నిత్య జీవితంలో ఎంతోమంది మాటకారులు ఎదురవుతూ ఉంటారు. తమపని తాము చేసుకోలేకపోయినా.. పక్కవాళ్ల పనులు చేసామని ఊకదంపుడు మాటలు చెప్పి.. ఏవో బాధ్యతలు నెత్తినేసుకుంటారు. అలాంటివారిని ఉద్దేశించిన సామెతే ఇది. అంటే, తనపని తాను చేసుకోలేకపోయినా.. ఏడు ఊళ్ల పనులు చేస్తానని రంగంలోకి దిగుతారు, ప్రగల్భాలు పలుకుతారు. ఈ సామెతలో ‘మెతరి’ అనే పదం ఓ చేతివృత్తిని సూచిస్తుంది. పూర్వం కల్లాల దగ్గర ఒడ్లు తూర్పారబట్టడం, రాశి పోయడం, లెక్కలేయడం వంటి పనులన్నీ చేసేవారిని మెతరి అనేవారు. కొన్ని కులవృత్తుల వారు మెతరితనం మాత్రమే చేసేవారు. అరపార అంటే.. ఆయా పనులు చేసేందుకు ఎలాంటి వస్తువు, పనిముట్టు లేకపోవడం.
కొందరిని ఎంతమంచిగా చూసుకున్నా.. ఎన్నిసార్లు ఆపదలో ఆదుకున్నా.. సమయం రాగానే వక్రబుద్ధి ప్రదర్శిస్తారు. అలాంటివారిని ఉద్దేశించించే జానపదులు ‘మంచోడు మంచోడంటే.. మంచమెక్కి దుంకిండట’ అని ఎగతాళి చేశారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో మంచివారిలా నటిస్తుంటారు. ఆ విషయం తెలియని అమాయకులు.. వారికి స్థాయికి మించిన అవకాశాలు ఇస్తుంటారు. దీంతో నటన మోతాదు పెంచుతారు. ఇక నటించాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు శుభ్రంగా తమ ముసుగు తొలగిస్తారు. అలాంటి ప్రమాదకర వ్యక్తుల్ని గుర్తించకపోతే భంగపాటు తప్పదు. కష్టాలూ తప్పవు.
‘బొప్పడు లేకపాయె.. చేతికొచ్చిన ఆడబిడ్డల్ని సాకాలంటె ఎంత బుగులైతాంది. బొప్పడు ఉంటే నాకీ బాదలుండేయే కావు..’ – కుటుంబ బరువు బాధ్యతలు ఒక్కరే మోస్తున్నప్పుడు ఇలా వాపోతుంటారు. ఈ పదబంధంలో ‘బొప్పడు’ అనే పలుకుబడి ఒకప్పుడు జానపదుల నోళ్లలో బాగా నానేది. బొప్పడు అంటే అన్న.. ఇంటికి పెద్దోడు అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో ‘బొప్పా’ అని కూడా పిలుస్తారు. అన్న ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు. మరి ఆదుకునే అన్న బొప్పడు ఉంటే ఇంట్లో చిన్నవాళ్లకు బాధలు ఉండవని ఈ పదబంధం ఉద్దేశం. కాలక్రమంలో.. ‘తిప్పడు’ లాగనే
‘బొప్పడు’ కూడా వ్యంగ్య పదంగా మారింది.
1 కసరడం = ప్రతి దానికి చిరాకుపడటం, కోపగించుకోవడం, ఆగ్రహించడం (రేయ్! ఎందుకు రా కుక్కలా
ఆ పిల్లమీద అట్ట కసరుతున్నవ్? నీ పనేదో నువ్ జూస్కొరాదు. చెయ్య శాతగాదు గాని కసరడం మాత్రం వొచ్చు)
2 శాపెన = శాపం
(లచ్చక్క జోలికి పోకురా బిడ్డా..
దాని నాల్కమీద మచ్చలున్నయ్.. దాని శాపెనలు
ఇట్టే తగుల్తయ్. పక్కపొంటోడు
మట్టిగొట్టక పోయిండు)
3 వంతన = సంప్రదాయం (పిల్లా.. పిలగాని సూపులప్పుడే కట్నం బోత్తరా? లగ్గంరోజు బోత్తరంటే ఓ లెక్కుంది. ఇదెక్కడి వంతన. నేనెప్పుడు చూడ్లా.. నేనెప్పుడు ఇన్లా..)
4 కారువాయి = పైరవీ (పట్నం పోయెటప్పుడు రమేశుగాడ్ని తీస్కపో.. వానికి కారువాయి మస్తు తెల్సు. నువ్ నోట్ల నాల్క లేనోడి లెక్క గమ్మునుండకు.. అన్నతో కల్సి పని నేర్సుకో)
5 పొడలు = మచ్చలు (కుడ్తి పెట్టేటప్పుడు పొడల ఎద్దుతో పైలం బిడ్డా.. ఎవ్వలు లేకపోతే కొమ్ముల్తో కుమ్ముతది. జరంత దూరంగనే ఉండు)
…?డప్పు రవి