చెప్పిన మాటకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా.. అదే తప్పు మళ్లీమళ్లీ చేసేవారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. ఇలాంటి వ్యక్తులు అన్ని కాలాల్లోనూ మనకు తారసపడుతుంటారు. నలుగురిలో మెప్పుకోసం తప్పుడు పనులు చేసినవారికి బుద్ధి చెప్పినట్లు నటిస్తుంటారు. తాము మాత్రం అవే తప్పులు చేస్తూ.. ‘బుద్ధి చెప్పి గడ్డి తింటారు’. అందుకే, ఎదుటివారికి నీతులు చెప్పే ముందు.. మనం కూడా ఆచరించి చూపాలంటారు జానపదులు. అది సాధ్యం కాకపోతే, నీతిబోధకు దూరంగా ఉండాలి. పైకి నాలుగు మంచి మాటలు చెబుతూ.. తాము మాత్రం ఆచరించకపోతే ‘బుద్ధి చెప్పి గడ్డి తినొద్దు రా’ అంటూ కడిగిపారేస్తారు పెద్దలు. ఇలాంటి అర్థాన్నిచ్చే సామెతలు చాలానే ఉన్నాయి. ‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అలాంటిదే.
పొట్టకు, బట్టకు అడగకపోతే సచ్చిందాక సాకుత
ఏ పనీ చెయ్యకుండా, ఇంట్లోవాళ్ల కనీస అవసరాలు కూడా తీర్చకుండా.. మాయమాటలతో మభ్యపెట్టేవాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. ఒక మనిషి కనీస అవసరాల్లో పొట్ట, బట్ట ముఖ్యం. పొట్ట అంటే అన్నం/ఆహారం. బట్ట అంటే దుస్తులు. వీటి తర్వాతే గూడు (ఇల్లు). నాగరిక సమాజంలో ఒక మనిషి బతకాలంటే పొట్టకు, బట్టకు లోటు లేకుండా ఉండాలి. పొట్టకు తిండి లేకపోతే ఆకలితో చస్తాడు. తిండి దొరికినా ఒంటికి సరైన వస్త్రం లేకపోతే గౌరవం ఉండదు. ఇవి రెండూ మనిషికి తప్పనిసరి. వాటిని అడగకపోతే.. చనిపోయిందాక సాకుతాను అనడం (సాదడం) మోసానికి పరాకాష్ఠ.
తూర్పు తిరిగి దండం పెట్టుడే
‘ఇయ్యకియ్యక ఆనికే ఇస్తివా డబ్బులు. ఇగ నీ పని తూర్పు తిరిగి దండం పెట్టుడే’ అనే పదబంధంలో జానపదులు సులువుగా పలికే పలుకుబడి ‘తూర్పు తిరిగి దండం (దణ్ణం) పెట్టుడు’. అంటే మోసగాళ్లకు తెలియక డబ్బులో, వస్తువో ఇచ్చి మర్లబడటం. మన దగ్గర తీసుకున్న వ్యక్తి తిరిగి మనకు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు, అతని గురించి తెలిసిన వ్యక్తులు చెప్పే సూక్తి ‘తూర్పు తిరిగి దండం పెట్టుకో’ అని. తూర్పుకే ఎందుకు తిరిగి దండం పెట్టాలి? వేరే దిక్కులు లేవా? అంటే, తూర్పును మనం పుణ్యమైన దిక్కుగా భావిస్తాం. ఇంద్రుడు తూర్పు దిశకు అధిపతి. సూర్యుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. అందుకే ఇండ్లలో పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చుంటారు. తూర్పు వైపు తిరిగి దండం పెడితే.. ‘పోయిన నీ సంపద ఎటూ రాదు. కనీసం పుణ్యం అయినా దక్కుతుంది’ అని అంతరార్థం.
-డప్పు రవి
అర్థ వివరణ
సగం కడుపు = అర్ధాకలి
(ఇంట్ల తింటానికి గింజల్లేవు.. పిల్లలు మొన్నటిసంది సగం కడ్పుతోనే పండుతుర్రు)
లట్టుపొట్టు ఒర్లుడు =నోటికొచ్చినట్టు మాట్లాడటం (ఏమ్రో..లట్టుపొట్టు ఒర్లుతున్నవ్.బొక్కల్ చూరచూర అయితయ్ బిడ్డా)
వానో వరుపో =వర్షం, కరువు
(ఈ ఏడాది ఎట్లుంటదో బిడ్డా.. వానొస్తదో..వరుపైతదో అర్థం కాకుంట ఉంది)
ఏడాకులు ఎక్కువ సదువుడు =ఒకరికంటే తెలివిలోమించిపోవడం (వాడునీకంటే ఏడాకులు ఎక్కువగానే సదివిండు.. జర భద్రం కొడకా)
కండ్లు సల్లవడుడు =శత్రువుకు హానిజరిగినప్పుడు/ పగోడిని కొట్టినప్పుడు సంతోషించడం (వాని కాలో, చెయ్యో ఇరిసేత్తేనే నా కండ్లు సల్లవడతయ్)