భారతీయ వివాహ వ్యవస్థపై తనకెంతో గౌరవముందని, పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నది తన అభిమతమని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా. అయితే అందుకు మరికొంత టైమ్ కావాలని, ప్రస్తుతం వరుస సినిమాలతో వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేనని స్పష్టం చేసింది. తన పేరెంట్స్ కూడా పెళ్లి విషయంలో ప్రతి రోజు పోరు పెడుతుంటారని, వాళ్లకు సర్దిచెప్పడం తనకు అలవాటైపోయిందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ప్రస్తుతం నేను దక్షిణాదితో పాటు హిందీలో బిజీగా ఉన్నా. సమయం ఏ మాత్రం సరిపోవడం లేదు. అందరి తల్లిదండ్రుల మాదిరిగానే నా పేరెంట్స్ కూడా నేను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. మా అమ్మ ఫోన్ చేసిన ప్రతీసారి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటుంది. ఆమెకు సర్దిచెప్పడం అలవాటైపోయింది’ అని తమన్నా పేర్కొంది. సమీప భవిష్యత్తులో తప్పకుండా తన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చుతానని, పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తానని తమన్నా చెప్పుకొచ్చింది.