పబ్లిసిటీకి తప్ప ఎందుకూ పనికిరానిది!
స్వదేశంలో క్రమంగా అప్రతిష్ట పాలవుతున్న ప్రధాని నరేంద్రమోదీ కోసం ఆయన వ్యూహకర్తలు గత వారం ఒక కొత్త ఉపాయాన్ని కనుగొన్నారు. అది, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారతదేశం ఒక శాంతి సూత్రాన్ని కనుగొన్నదనే వార్తను ప్రచారంలో పెట్టడం. అది సరిగా ఓటర్ల జాబితా అరాచకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొని, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా కోసం ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న సమయం.
ఈ పబ్లిసిటీ కూడా లోగడ ఇరాన్ యుద్ధం విషయంలో జరిగినటువంటిదే. భారత ప్రజాస్వామ్యానికి గల మూలాధారాల్లో ఒకటైన పౌరుల స్వేచ్ఛాయుత ఓటు హక్కుకు బుద్ధిపూర్వకంగా కలిగిస్తున్న భంగపాటుతో చెలరేగిన అశాంతికి పరిష్కారం కనుగొనని, లేదా కనుగొనదలచని మోదీ, యూరప్‌లో నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధానికి శాంతిసూత్రాలను కనుగొన్నారంటే నవ్వు సహజంగానే వస్తుంది. ఆయనకు పబ్లిసిటీ ఎంత ప్రాణప్రదమైనదో గుజరాత్ కాలం నాటి విషయం మనకు తెలియదుగాని, 2014 నుంచి జాతీయ స్థాయిలో మాత్రం విరామమెరుగక చూస్తూనే ఉన్నాం.
ప్రధాని మోదీ ప్రచార ప్రణాళికలో ఒక పార్శం దేశీయమైతే మరొకటి అంతర్జాతీయం. తన ప్రచారదుగ్ధలో భాగంగా ‘విశ్వగురు’ అనే మాటను కూడా తమ మొదటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. తన కోసం తన వందిమాగధులతో ఆ బిరుదు ఇప్పించుకున్నారు. ఏ దేశానికి పోయినా అక్కడి అత్యున్నత పౌరసత్కారాలు, పతకాలను మరే దేశాధినేత చేయని విధంగా ఇప్పించుకోవటం ఒక సంప్రదాయంగా మార్చుకున్నారని అంతర్జాతీయ మీడియా ఇటీవలనే కథనాలు రాసింది. హడావుడిగా తయారు చేయించటం వల్ల ఆ పతకాలూ పత్రాల్లో కొన్ని సందర్భాల్లో దొర్లిన తప్పులను కూడా ఎత్తిచూపింది. ప్రధాని మోదీ పబ్లిసిటీ కాంక్షకు ఇటువంటివన్నీ దృష్టాంతాలవుతున్నాయి. అటువంటి కోవలోకి వచ్చేదే రష్యా-ఉక్రెయిన్ శాంతిసూత్రం సంగతి. అయితే ఆయన అధికారులు ఒక జాగ్రత్త తీసుకున్నారు.
మోదీ సూత్రాలు అసలు యుద్ధ పరిష్కారానికి అనిగాక, యుద్ధం వల్ల తలెత్తిన తక్షణ సమస్యల నివారణకు అని పేర్కొన్నారు. ఇంతకూ ఆ సూత్రాలు ఏమిటి? ఒకటి, రెండు దేశాలు కూడా అవతలి పక్షపు మౌలిక సదుపాయాలపై దాడులు ఆపటం. రెండు, నిత్యావసరాల సరఫరాలకు ఆటంకం కలిగించకపోవటం. మూడు, నల్ల సముద్రం మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలకు రక్షణ కల్పించటం. వాస్తవానికి వీటిలో ఏ ఒక్కటీ మోదీ ప్రభుత్వం కొత్తగా చేసిన ప్రతిపాదన కాదు. ఐక్యరాజ్య సమితి సహా వేర్వేరు వైపుల నుంచి లోగడ వచ్చినవే. వేర్వేరు పక్షాలు తరచు పునశ్చరిస్తున్నవే. ఈ మాట మోదీ విదేశాంగశాఖకు తెలియదనుకోలేము. అంతేకాదు. దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, లేనట్టయితే అనేక దేశాలకు ఆహార ధాన్యం, ఎరువుల రవాణాలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఆఫ్రికన్ దేశాలు చేసిన విజ్ఞప్తి దరిమిలా కొద్ది వారాలపాటు ఉభయపక్షాలు కొన్ని సడలింపులను ఇచ్చాయి కూడా. తర్వాత వెనుకటి పరిస్థితే ఏర్పడింది.
ఇటువంటి నేపథ్యమంతా ఉన్నందున ఈ తరహా శాంతి పథకాలను ముందుకు తేవటాన్ని మిగిలిన వారు మరచిపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వానికి గుర్తుకువచ్చింది. అందుకు కారణం పైన అనుకున్నట్టు ప్రస్తుతం భారతదేశంలో సాగుతున్న అశాంతి అనుకుంటే పొరపాటు ఉండకపోవచ్చు. కానీ ఈ ఎత్తుగడ పారగల అవకాశం లేదు. స్వదేశంలోని అశాంతి తీవ్రంగా మారుతున్నది. అందుకే కావచ్చు ఈ యుద్ధశాంతి వార్తలను మోదీ అనుకూల పత్రికలు కూడా సీరియస్‌గా తీసుకోలేదు.
శాంతి నెలకొనాలని, ఆ ప్రాంతం నుంచి సరఫరాలు సవ్యంగా సాగాలని కోరుకోవటంలో తప్పుపట్టవలసిందేమీ లేదు. రష్యా, ఉక్రెయిన్ల మధ్యగల నల్ల సముద్రం కీలకమైనది. రష్యా నుంచి చమురు తదితరాలు, ధాన్యం ఆ సముద్రం మీదుగా నిరంతరం రవాణా అవుతుండేవి. 2022 నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి ఈ రవాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సముద్రం మధ్యలో గల క్రిమియా దీవిని రష్యా ప్రస్తుత యుద్ధానికి ముందే 2014లో ఆక్రమించటం ఉక్రెయిన్‌కు మరింత సమస్య అయింది. ఈ పరిణామాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియా ఒకటి. కనుక, అసలు ఆ యుద్ధం ముగియాలని, లేదా కనీసం సరుకుల రవాణా సజావుగా సాగాలని కోరుకోవటం సహజం. ఇక్కడ సమస్య ఆ కోరికతో కాదు. కానీ, ఆ యుద్ధం ఎంత సంక్లిష్టమైనదో, రవాణా స్తంభనలు ఆ వ్యూహంలో ఎట్లా విడదీయరాని భాగంగా మారాయో తెలిసి కూడా ఇప్పుడు ఈ ప్రతిపాదనల కపటత్వమన్నది విమర్శించదగిన విషయమవుతున్నది.
మరొకటి కూడా ఉన్నది. అది మరింత ముఖ్యమైనది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమంటూ మొదలు కావటానికి కొన్ని మూల కారణాలున్నాయి. అవి తరచు చర్చకు వస్తున్నవే. సోవియెట్ యూనియన్, వార్సా సైనిక కూటమి 1991లో రద్దయిన తర్వాత, అమెరికా నాయకత్వాన ఉండిన నాటో సైనిక కూటమిని రద్దు చేయకపోవటమే గాక, ఆ కూటమిలోకి కొత్త దేశాలను చేర్చుకుంటూ రష్యా సరిహద్దుల వైపు విస్తరించటం మొదలుపెట్టారు. నాటో విస్తరణ ఉండదంటూ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు. ఆ విధంగా విస్తరణలో ఉక్రెయిన్ వంతు వచ్చింది. అనగా రష్యాను పశ్చిమ దిశలో దిగ్బంధం చేయడమన్నమాట. అది తగదన్న రష్యా మాటను అమెరికా, యూరప్‌లు లెక్క చేయలేదు. ప్రధానంగా ఈ కారణం వల్లనే రష్యా ఆత్మరక్షణ కోసం 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనపరచుకున్న తర్వాత, 2022లో ఉక్రెయిన్‌పై దాడిని మొదలుపెట్టింది. ఈ వరుస క్రమాన్ని నిరుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం గుర్తించి మాట్లాడటం గమనించదగ్గది.
భారత ప్రధాని ఈ మౌలిక విషయాలను గుర్తించకుండా, అందుకు పరిష్కారాలను చర్చించకుండా, పైపైన మెరుగుమాటలు మాట్లాడటం వల్ల ఉపయోగమేమిటి? తనకు ఎవరూ నమ్మని పబ్లిసిటీ తప్ప. పైగా ఇవన్నీ గతంలోనూ ఇతరుల ద్వారా ప్రతిపాదనకు వచ్చి విఫలమైనప్పుడు? సమస్య పరిష్కారానికి రష్యా ప్రతిపాదనలు ఏమిటి? ఉక్రెయిన్ కోరుకుంటే యూరోపియన్ యూనియన్‌లో చేరవచ్చు గానీ, నాటోలో చేరబోమని ప్రకటించాలి. ఆ మేరకు తమ రాజ్యాంగాన్ని సవరించాలి. వారిని చేర్చుకొనబోమని నాటో కూడా ప్రకటించాలి. ఉక్రెయిన్ తూర్పున రష్యా సరిహద్దుల్లో గల దోన్బాస్ ప్రాంతంలో అధిక సంఖ్యాకులైన రష్యన్ జాతీయులపై వివక్షలను ఆపివేసి, వారికి సముచిత స్థానాలు కల్పించాలి. భవిష్యత్తులో తమ రక్షణ కోసం దోన్బాస్ ప్రాంతాన్ని తమకు బఫర్‌జోన్‌గా వదలాలి. ఇవి ప్రధానం.
ఇందులో గమనించవలసింది దోన్బాస్ ఇప్పటికే సుమారు 80 శాతం గత నాలుగేండ్ల యుద్ధంలో రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. తక్కినది కూడా వదలుకుని రాజీ చేసుకోవాలని స్వయంగా ట్రంప్ ఒకటికి నాలుగుసార్లు ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీకి సూచించారు. అదేమాట ఈ నెల 10న కూడా అన్నారు. ఒక దశలో జెలెన్స్కీ సైతం అర్ధాంగీకారం తెలిపారు. తాము కూడా అదేమాట అన్న యూరోపియన్ నాయకులు అంతలోనే మాట మా ర్చారు. యుద్ధానికి సాయపడుతున్నారు.
ఆ విధంగా యుద్ధానికి లోతైన నేపథ్య కారణాలుండగా, ఆ సమస్య పరిష్కారానికి చిక్కుముళ్లు అనేకం ఉన్నాయి. అవి తేలనంతవరకు నల్ల సముద్ర ప్రాంతంలో, ఇతరత్రా కూడా ఉభయపక్షాల మధ్య యుద్ధం సాగుతూనే ఉంటుంది. సరకుల రవాణాకు ఆటంకాలు కల్పించటం కూడా యుద్ధ వ్యూహంలో భాగమే. అది ఉద్దేశపూర్వకంగా అనుసరిస్తున్న వ్యూహం. అటువంటి స్థితిలో మీరు ఆ వ్యూహాన్ని మానుకుని మాకు మాత్రం సరకుల రవాణా జరిగేటట్టు చూడమంటూ చెప్పే శాంతిసూత్రాలు నెరవేరేవేనా? అవి సొంత పబ్లిసిటీకి తప్ప ఎందుకూ ఉపయోగపడవు. ఇది ఇరాన్ యుద్ధంలో, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధం గురించి ఏమీ మాట్లాడకుండా, హోర్ముజ్‌ను తెరవండి అంటూ ఇరాన్‌కు ప్రతిపాదించటం వంటిదే. మోదీ విశ్వగురుత్వం ఎంత అర్థరహితమైనదో అనేక ఇతర దృష్టాంతాలతోపాటు ఇది కూడా చెప్తున్నది.
టంకశాల అశోక్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

