ఉద్యోగాలపై మేధావుల పాప్యులిజం
ఇతర దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇటువంటి మేధావులు తగ్గిపోతున్నారు. గతంలో దాదాపు అందరూ అదేవిధంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉండటానికి, ఇప్పుడు తగ్గుతుండటానికి కారణాలు ఏమై ఉంటాయి? వారు లోగడ మేధావులుగా ఉంటూనే ఎవరి రాజకీయ విశ్వాసాలు వారు కలిగి ఉండేవారు.
పాప్యులిజం అనే మాటను సాధారణంగా రాజకీయ నాయకులతో ముడిపెట్టి మాట్లాడుతుంటాము. అటువంటిది మేధావులతో ముడిపెట్టడం ఆశ్చర్యంగా తోచవచ్చు. కానీ వారు ఉద్యోగ, ఉపాధి విషయాలపై వ్యవహరిస్తున్న తీరును చూసినప్పుడు ఇంతకన్న సరైన పదం మరొకటి కనిపించటం లేదు. ఇప్పుడు ఉద్యోగ, ఉపాధులపై మేధావులది పాప్యులిస్టు ధోరణిగా మారుతున్నది. అట్లా ఎందుకో విచారిద్దాము. ఉద్యోగార్థులైన యువతీ యువకులది జీవన ఆరాటం. అది వారికి తక్షణ సమస్య అయినందున ఉద్యోగ-ఉపాధి రంగంపై సమగ్ర దృష్టి తీసుకోవాలని, థియరెటికల్‌గా ఆలోచించాలని, సమస్యకు మౌలిక పరిష్కారాలను అన్వేషించాలని వారికి బోధనలు చేయలేము.
అటువంటి అవగాహనలు మేధావులు అయినవారికి మాత్రం తప్పక ఉండాలి. అట్లా ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి. వారు నిరుద్యోగులకు తప్పు అవగాహనలు కల్పించరు. రెచ్చగొట్టరు. వారి పట్ల సానుభూతి చూపుతూనే నిరుద్యోగ సమస్యపై అవసరమైన సమాచారాలను వారి ముందుంచుతారు. అందులో తక్షణ దృష్టితో పాటు సమగ్రమైన దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంటుంది. అటువంటి వారే నిరుద్యోగుల బాగును నిజంగా కోరే నిజాయతీ గల మేధావులవుతారు. కాని మన మేధావులు ఈ విషయంలో పాప్యులిస్టులుగా మారుతున్నారు.
ఇతర దేశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇటువంటి మేధావులు తగ్గిపోతున్నారు. గతంలో దాదాపు అందరూ అదేవిధంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉండటానికి, ఇప్పుడు తగ్గుతుండటానికి కారణాలు ఏమై ఉంటాయి? వారు లోగడ మేధావులుగా ఉంటూనే ఎవరి రాజకీయ విశ్వాసాలు వారు కలిగి ఉండేవారు. ఆ మేరకు తమ అభిప్రాయాలను, రాజకీయ సానుభూతులను మేధోరంగానికి పరిమితమై వ్యక్తపరిచేవారు. సాధారణంగా వామపక్ష మేధావులు మాత్రం ఆ పార్టీల క్షేత్రస్థాయి కార్యక్రమాలతో మమేకమవుతుండేవారు. ఆ కాలంలో రాజకీయ పాప్యులిజం కూడా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితి ముఖ్యంగా గత 40 ఏండ్లుగా మారుతూ వస్తున్నది. మధ్యేమార్గ రాజకీయాలకు, మితవాద రాజకీయాలకు చెందిన మేధావులు, నిర్దిష్టంగా ఒక రాజకీయం లేకున్నా ఉదారవాదులు, ప్రజాస్వామికవాదులు అయిన మేధావులు అనేకులు తమ మేధో కార్యకలాపాల పరిధిని దాటి, క్షేత్రస్థాయి విషయాలతో సంబంధం పెట్టుకోవటం, అందుకు స్పందించటం మొదలైంది.
నిజానికి మేధావులు క్షేత్రస్థాయికి కదలిరావటం ఆహ్వానించదగ్గదే. కాని ఆ క్రమంలో అవాంఛనీయమైనవి కొన్ని కన్పించసాగాయి. స్వప్రయోజనాలు, స్వీయ ప్రచారాభిలాషలు, పార్టీలతో అందుకనుగుణమైన సంబంధాలు, ఒకవేళ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా ఈ మొత్తం వలయంలో చిక్కుకుని సమయానుకూలంగా వ్యవహరించటం. మేధావులకు తప్పనిసరి అయిన నిష్పాక్షికతను, స్వార్థరాహిత్యాన్ని వదలివేయటం వంటివి. ఇవి జరిగినప్పుడు సహజంగానే, పైన చెప్పుకున్న తరహా గత కాలపు మేధావి లక్షణాలకు వారు దూరమవుతారు. ఇదొక స్పష్టమైన పరివర్తన. ఇటువంటి స్థితి నుంచే ఈ కొత్త దశలో వారి పాప్యులిస్టు మేధావితనం ముందుకొచ్చింది.
మొదట ప్రస్తావించిన ఉద్యోగ, ఉపాధి అంశాన్నే తీసుకుని ఈ విషయం చర్చిద్దాము. ఉదాహరణకు తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారన్నది కొందరి అంచనా. అది నిజమైనా కాకపోయినా వారు భారీ సంఖ్యలో ఉన్నారనే మాట వాస్తవం. ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యావంతులకు జీవనోపాధి లభించేది మూడు విధాలుగా. ఒకటి ప్రభుత్వరంగం, రెండు ప్రైవేటురంగం, మూడు స్వయం ఉపాధి రంగం.
వీటిలో మొదటిది ఎప్పుడైనా పరిమితమే. రెండవది యథాతథంగా అపారమైనది. కానీ టెక్నాలజీ ఆధునీకరణ వల్ల అవకాశాలు వేగంగా తగ్గుతున్నాయి. స్వయం ఉపాధి రంగం కూడా అపారమైనదే అయినా దానిపై సైతం టెక్నాలజీ ఆధునీకరణలు ప్రభావం చూపుతున్నాయి. తిరిగి మొదటి అంశానికి వెళ్తే, మన దేశంలో 30 ఏండ్ల నుంచి వచ్చిన ఆర్థిక సంస్కరణలు, పరిపాలనా సంస్కరణల వల్ల ప్రత్యక్ష ఉద్యోగాలు తగ్గటం, ఖాళీలను భర్తీ చేయకపోవటం, కాంట్రాక్టు ఉద్యోగాలు, ఔట్సోర్సింగుల పరిస్థితి పెరిగిపోతున్నది. ప్రభుత్వరంగ సంస్థల మూసివేతలు, ప్రైవేటీకరణలతో సమస్య మరింత తీవ్రమవుతున్నది. నిరుద్యోగ సమస్యను ఎప్పటికప్పుడు పెంచుతున్న ఈ వేర్వేరు ధోరణులు ఏవీ నిలిచిపోయే అవకాశం కనుచూపు మేరలో లేదు. అందుకే యువకులు ప్రాణాలపై సైతం ఆశలు వదులుకొని యుద్ధ క్షేత్రాలైన ఇజ్రాయెల్, ఉక్రెయిన్లకు తరలిపోతున్నారు.
ఈ యావత్ పరిస్థితులు మేధావులకు తెలియవని ఎంతమాత్రం భావించలేం. అటువంటప్పుడు వారు చేయవలసినవి మూడున్నాయి. ఒకటి, నిరుద్యోగులకు పూర్తి సానుభూతి తెలుపుతూ వారి ఆందోళనలకు మద్దతు ప్రకటించటం. అది తక్షణ కర్తవ్యం. రెండు, పైన చెప్పుకొన్న నిరుద్యోగ పరిస్థితి కారణాలను వారికి వివరించటం. అది దీర్ఘకాలిక అవసరం. మూడు, అసలు ఈ సమస్య తొలగిపోవటమన్నది మౌలికమైన విషయం గనుక, కేవలం కారణాల వివరణతో పరిష్కారం లభించదు గనుక, వ్యవస్థలో మార్పుల వల్ల గాని ఆ మౌలిక పరిష్కారం జరుగదు గనుక, వారికి అటువంటి అవగాహనలను కల్పించి ఆ దిశగా కదిలించటం.
కానీ ఈ మేధావులు అటువంటి పనులేవీ ఎంతమాత్రం చేయటం లేదు. కొన్ని సులభ సూత్రాలను మాత్రం ప్రకటించి నిరుద్యోగులను వంచించి ఆత్మవంచన కూడా చేసుకుంటున్నారు. ఉదాహరణకు వారిలో కొందరు ఉద్యోగ హక్కును ప్రభుత్వాలు చట్టంగానే చేయాలని, అట్లా చేసినట్లయితే నిరుద్యోగులు తమ హక్కు అమలు కోసం కోర్టుకు వెళ్లే వీలుంటుందని అంటున్నారు. ఇది వినేందుకు గొప్పగా తోస్తుంది గాని ఆచరణలో సాధ్యమా? అటువంటి చట్టాలు మన దేశంలో గాని, ఇతర ప్రజాస్వామిక దేశాల్లో గాని ఎక్కడైనా ఉన్నాయా? ఏటా కొన్ని లక్షల మంది డిగ్రీలు చేసి విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. అన్ని లక్షల మందికి ఏటా ఒక చట్టపరమైన హక్కుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగే పనేనా? అందుకే వీరిని పాప్యులిస్టు మేధావులనటం.
ఈ మేధావులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి కొన్ని పనులు చేయవచ్చు. పూర్తి పరిష్కారం కాకున్నా వీలైనంత మేర. యువకులలో, వారి కుటుంబాలలో, సమాజంలో ఈ సమస్య మౌలిక కారణాలపై, అందుకు మౌలిక పరిష్కారాలపై చైతన్యం తీసుకురావటం. తమతో ఏకీభావం గల సంస్థలను వెంట తీసుకోవటం. ఇక కార్యాచరణకు సంబంధించి, ఆర్థిక సంస్కరణల వల్ల, పరిపాలనా సంస్కరణల వల్ల ఎక్కడెక్కడైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ, పైవేటు రంగాలలో తగ్గుతూ వస్తున్నాయో ఆ చర్యలు నిలువరింపజేయటం. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను బలంగా ఆపటం.
ప్రైవేట్రంగానికి ఈ దేశపు నేల, నీరు, సహజ వనరులు, ఆర్థిక వనరులు, ప్రభుత్వ రాయితీలు, వ్యాపార సౌలభ్యాలు లభించాలంటే అందుకు తగినట్లు ఉపాధి అవకాశాలను, ఉద్యోగాలను ఇప్పటికన్న గణనీయంగా పెంచి తీరాలన్న చట్టాలు చేసి అమలు జరిగేట్లు చూడటం. కునారిల్లుతున్న వ్యవసాయరంగంలో, గ్రామీణ వృత్తుల ఆధునీకరణ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతుండటాన్ని అరికట్టి గణనీయంగా పెంచటం. విద్యావంతులకు విస్తృతంగా సాంకేతిక శిక్షణల కల్పన. ఈ విధమైన చర్యల వల్ల గాని ఇంత పెద్ద దేశంలో ఉద్యోగ, ఉపాధి సమస్యలు ఒక మేరకైనా, క్రమక్రమంగానైనా అదుపులోకి రావు.
ఉద్యోగ, ఉపాధి సమస్యలు చివరికి సోషలిస్టు దేశాల్లోనూ ఒక మేర ఉన్నాయి. ఇతర వ్యవస్థల గురించి చెప్పనక్కరలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ను, కర్ణాటకను కుదిపివేస్తున్నది అదే. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోదీ ప్రభుత్వం విఫలం కావటానికి కారణం ఆయన కాదు. ఆయన పాలిస్తున్న వ్యవస్థ. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, తన ప్రణాళిక అంటూ గత మంగళవారం ప్రకటించిన 20 సూత్రాలలో, ఔట్ సోర్సింగ్‌ను ఆపివేయగలనంటూ ఇచ్చిన హామీకి కారణం అక్కడి నిరుద్యోగ సమస్య. ఈ సమస్య ప్రస్తుత యూరోపియన్ ఎన్నికలన్నింటిని ప్రభావితం చేస్తున్నది. ప్రపంచమంతటా పరిస్థితి సరేసరి.
అందువల్ల మేధావులు నిరుద్యోగుల పట్ల కపటత్వాన్ని మానివేయాలి. తమకు నచ్చని పార్టీలపై వారిని రెచ్చగొట్టడం, నచ్చినవారు గెలవగానే మౌనం వహించటం, ఉద్యోగ హక్కు చట్టాలంటూ అసాధ్యమైన పాప్యులిస్టు మాటలతో మభ్యపుచ్చటం వంటివి వారికి తగవు. అందువల్ల తమకేవైనా ప్రయోజనాలు చేకూరుతాయేమోగాని, యువతీ యువకులకు లభించేది శూన్యం.
-టంకశాల అశోక్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

