బీళ్ళ భూమి కాదు
ముళ్ళ భూమి కాదు
రాళ్ళ భూమి కాదు
అటు చూడు
అలుగులు ఆడుతున్నాయి
గుంటలు నీటి గంటలు మోగిస్తున్నాయి
పగుళ్ళ భూమి కాదు
దిగుళ్ళ భూమి కాదు
కన్నీళ్ల భూమి కాదు
ఇటు చూడు
కొండల్ని చుట్టుకొని
అడవుల్ని దాటుకొని
వాగులు వయ్యారాలు పోతున్నాయి
సెలయేళ్ళు పరవళ్ళు తీస్తున్నాయి
మాది నీళ్ళ భూమి
కష్టాల కొలిమిలోంచి
దారిద్రపు శృంఖలాల్లోంచి బైటపడ్డాం
కరువు కదలికల్ని కట్టడి చేసే
చెర్లు బోర్లు నిండా నీళ్ళు
పల్లెలన్నీ పసిడి పంటల లోగిళ్ళు
చిత్రకారుడు నీటి కుంచెతో ఎంత
అందమైన చిత్రం గీశాడు
జీవన ప్రస్థానం సజావుగా సాగడానికి
నీరెంత అవసరమో చెప్పాడు
చేయూతతో రైతు హిత సేద్యం
సర్వహిత జనామోదం
కోటం చంద్రశేఖర్
94920 43348