‘మార్త పద్మవ్వ’ అంటే అందరికిట్టమే. నడుం అంచితే సాలు జూసేటోళ్లకే మొసరావాలె గని, ఆమెకు మాత్రం మొసరాదనేటోళ్లు మా రామారమొళ్లు. పద్మవ్వ వట్టినా రెండు మునుములెక్కువనే వడ్తదని ఆళ్ల నమ్మకం. అట్లా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం మా రామారం ఊళ్లే నన్నొక్కల్గూడ ఉత్తగుండనియ్యకవోతుండె. పొట్టకూటి కోసం శేనుకో కైకిల్జేసిన. ఉన్నదో, లేందో.. కలో, గంజో ఇంట్లనే దిన్నం. ఇంట్ల మాట బైట వడకుండ బతికినం.
మా శిన్న బిడ్డ సరిత ఆర్నెళ్ల గుడ్డు. రామలింగయ్యనేమో ఎవుసం జెయ్యవోయిండు. ఆ ఆర్నెళ్ల గుడ్డును ముసలోళ్లకప్పజెప్పి నేను కైకిలివోయిన. నారు గల్వవోయి ఇంటికొచ్చేసరికి పొద్దుగూకింది. మోకాళ్ల మందం బురదతోనొచ్చిన నేను ఇట్ల కాళ్లు కడుగుతున్ననో లేదో.. నన్ను జూసిన నా శిన్నబిడ్డ ఎప్పట్లెక్కనే రొమ్ము కోసం ఏడ్పు మొదలువెట్టింది. కాళ్లకంటిన బుర్ద కడుక్కుంటున్న అంతే.. అట్లనే ఊపిరి బిగవట్టింది. గూత బైటికత్త లేదు, లోపల్కి వోతలేదు. కనుగుడ్లు దెర్సి అట్లనే బీరిపోయింది. ‘నడువుర్రా… పోరికి పిడ్సచ్చినట్టుంద’ని ఆ పసిగుడ్డును వట్టుకొని దావుకాన్లకుర్కిన. ఆ దేవుడు మా అందునున్నడు. అందుకే నా శిన్న బిడ్డ నాడు బతికి బయటవడ్డది.
బిడ్డలు వెర్గినా కొద్దీ, మా బతుకులు బరువెక్కుతున్నయి. ఉన్నదెకురంన్నర భూమి. అన్లేం జేసినా బట్టపొట్టకే దప్ప ఎన్కేసిందేం లేదు. ‘దంచుడెక్కువనే గని దమ్మిడి రాకట లేద’న్నట్లుండె మా బతుకులు. పెద్దబిడ్డ అగ్గువకే వోయింది గని, శిన్నబిడ్డ సరితకు 2014ల తెలంగాణ రాకముందు పెండ్లిజేసినం.
పిలగాడు పిట్రోల్ లారీ రొప్పుతడు. మ్యానొళ్లే మంచిగజూస్కంటడనిచ్చినం. వాళ్లకో బిడ్డా, కొడుకు. ఇద్దరు బిడ్డలకు పిల్లలు, వాళ్ల సంసారాలు వాళ్లకైనయి. ఇగ మమ్మల్ని వట్టించుకునేటోడెవ్వడు?
సరిత పెండ్లయి నెల రోజులైంది. అప్పులు మీద వడ్డయి. అదే రంది వెట్టుకున్నడో, మన్నో రామలింగయ్య. ఓ రోజు సూశేది సూడంగనే కింద గూలవడ్డడు. పిలిస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. ఆమాంతం లేవట్టి ఖమ్మం దావుఖానకేస్కవోయినం. డాక్టర్లు ‘బీపీ, షుగర్ ఎక్కువై మనిషి ఖరాబైండ’ని జెప్పిర్రు. అట్ల ఆయ్నను వట్టుకొని మూన్నె ళ్లు దవాఖాన్లనే ఉన్న . ఎడ్లేన్నోవొయినయి, ఎవుసం ఏన్నోవోయింది. మనుషుల్లేని ఇల్లు దయ్యాల కొంపతోని సమానమంటరు. అట్లనే అయింది రామారంల ఉన్న మా గూనపెంకల ఇల్లు. బిడ్డలకు లగ్గమైం ది. రామలింగయ్య దవాఖాన పాలైండు. ఈ ముసల్దేం జేత్తదనుకున్నయో మన్నో కాకులు, గద్దలు. వాటి కండ్లు మా భూమ్మీ ద వడ్డయి. అదే సందు జూస్కొని ఓ రోజు ఒక్కన్ని దొర్కిచ్చుకొని మీదికెగవడ్డరు. ‘పొట్టోన్ని పొడుగోడు మింగితే.. పొడుగోన్ని పోశమ్మ మింగుతది తీ’ అని శాపం బెట్టిన. ఆయ్నకు ధైర్నం జెప్పి మళ్లా ఖమ్మంల వడ్డం. ఈ లోకంల మనుషులందరు కఠినాత్ములే ఉండరు గదా? అట్ల ఖమ్మంల మాకు రంగయ్య అనే పెద్దమనిషి దేవునోలె దొర్కిండు. పాపం ఆయన జరిగివోంగ గూడ మమ్మల్ని వాళ్ల కొడుకులకప్పజెప్పిండు. పాపం ఆరేండ్లాయె.. ఆళ్లదగ్గర్నే ఉంటున్నం. బీపీ, షుగరున్నా రామలింగయ్యకు సెక్యూరిటీగార్డు నౌకరిచ్చిర్రు. ఉండేటందుకు చిన్న రూం ఇచ్చిర్రు.
ఇగ.. ‘మార్త పద్మవ్వ’ దగ్గరిరొద్దాం.. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు. మోకాళ్లయితే అసల్కే లేస్తలెవు నాకు. పొద్దంతా బుర్దల చెయ్యిలాడిచ్చినదాన్ని ఇప్పుడిటున్న పుల్ల అటువెడ్తలేను. కండ్లు మస్కలు గొడ్తున్నయి. మంచాలకెళ్లి లేస్తే సాలు గిర్రున తిర్గుతున్నయి కండ్లు. దావుకానకు వొయి సూపిచ్చుకుందామంటే పైసల్లెవ్వు. సూపిచ్చుకున్నా ఆప్రీషన్ జేయాల్నంటె రామలింగయ్య సగం రందికే సత్తడు. అందుకే మన్సుల బాధను కండ్లళ్లలనే ఒత్తుకొని సత్తున్న. ‘నువ్వు కూసున్నకాన్నే ఉండె.. నీకేం గావాల్నన్నా నేనే దెచ్చిపెడ్తా అని’ పాపం రామలింగయ్యనే అపురూపంగా జూస్కుంటున్నడు. అన్నం కాన్నుం చి అండివెడ్తడు. నా పానం ఉండంగనే, పానం మంచిగలేని రామలింగయ్యను మంచిగర్సుకోవాల్ననే కోరిక నాది.
ఓ రోజు మజ్జాన్నం.. ఇంట్లనే వండుకున్నా. ఎవ్వల్ పంపిర్రో ఏమో తెల్వది.. కండ్ల డాక్టర్లు సక్కగింటికే అచ్చిర్రు. అవేవో మిషిన్లు వెట్టి కండ్ల పరిచ్చలు జేసిర్రు. ‘అయ్యో అమ్మా… నీ కండ్లు మస్తు మస్కయినయి గాదు, ఇట్లనే సుస్కుంటా ఉంటే కండ్లు మొత్తానికే వోతయి, ఇగ్గొ సుక్కల మందేస్కో.. ఇగ్గొ గీ అద్దాలు వెట్టుకో… కొన్ని రోజులైనంక ఆప్రీషం జేత్తం, మీ ఇంటికే అచ్చి దావుకానకు తీస్కవోతమని’ జెప్పి, చేతుల ఓ పేపర్ వెట్టిర్రు.
నాకు సద్వత్తదా గని, ఆ అద్దాలు వెట్టుకొని ఆ పేపర్‌ను జూసిన. ఓ దిక్కు మన కేసీఆర్ సారు, ఇంకో దిక్కు హరీశ్‌రావు సారు నవ్వుకుంటా కనవడ్డరు. ‘అగ్గో ఏమో కనవడ్డట్టే నవ్వుతున్నవేందే’ అని అడుగవట్టిండు మా రామలింగయ్య. ‘ఔను ళ్లా… కేసీఆర్ సార్ తేటగ్గొడుతున్నడ’ని జెప్పిన. నన్ను జూసి ఆయ్న గూడ నవ్విండు. మా నవ్వు ల్ని జూత్తున్న డాక్టర్లను ‘మిమ్మల్ని కేసీఆర్ పంపిం డా సార్లు’ అనడిగిన. ‘ఔనమ్మా’ అని వాళ్లుగూడ నవ్వవట్టిర్రు. మా నవ్వుళ్ల కేసీఆర సార్ పెద్దకొడుకై కనవడ్డడు. అందుకే సారుకు ‘నీ తండ్రీ దం డం బెడ్తా కేసీఆరూ, నాకు ఇన్నిరోజుల నుంచి కండ్లు ఔపల్లే… నీ అద్దాలు వెట్టుకున్నంక కండ్లవుపడ్తున్నయి నాయినా…’ అని వీడియో జేసి సక్కగ కేసీఆర్‌కే పంపిన.
-గడ్డం సతీష్
99590 59041