తిట్లూ తన్నులు అనుకుంటూ
పరాయి తెలంగాణల మనకెందుకక్కా
రా, మన రాయలసీమకు
కన్నీరు నిండిన కరువు భూమికి!
తలకిందులు తపస్సు చేసినా
నిన్ను తమ బిడ్డ అనుకోరక్కా
నీ నాయిన, అన్న, నువ్వూ
వారి సొంత రాష్ర్టానికి కాళ్లడ్డం పెడితిరి
అందిన కాడికి దోస్తిరి
తెలంగాణ తల్లి బిడ్డలను
రాష్ట్ర ఉద్యమంల, విప్లవ పోరాటంల
వందల మందిని కాల్చి చంపితిరి
నిన్నెప్పటికీ నమ్మరక్కా
రా, మన ఎడారి సీమకు !
దోచింది కొంత ఖర్చుచేసి
కిరాయి జనాన్ని పోగేసినా
పచ్చ మీడియా ప్రచారం హోరెత్తినా
కాషాయం కండువాలు చప్పట్లు కొట్టినా
ఈ చైతన్యపు వీరగడ్డపై
ఉద్యమాల పెను తుఫానులో
నిన్న అంతా చిత్తయినట్లే
నీ కొత్త జిత్తులు చెల్లవక్కా !
నీ తాత ముత్తాతల గడ్డ
శతాబ్దాలుగా కునారిల్లి
దేశానికి సొతంత్రంవచ్చి తెలుగు రాజ్యం ఏర్పడినా
నీతిలేని మన నేతలు, దోపిడీల మహానుభావులు
దగాకోరు రాజకీయం చేస్తే
అంతంలేని కన్నీటి ధారలతో కృశించిపోతున్నది
ఇంతప్రేమ పరాయి తెలంగాణకు ఎందుకక్కా
నీ సొంత గడ్డ నీ కోసం ఎదురు చూస్తున్నది
రా, నిన్ను తలపై మోసి గుండెల్లో దాచుకుంటుంది
పోరాడు అక్క నీ సీమ కోసం
తనకు మరో దగాకోరుగా మిగిలిపోకు
మంచో చెడో తెలంగాణను
తన కోసం తండ్లాడనియ్యి
పెరుగుతున్న అక్కడి సిరులపై దొంగ కన్నెయ్యకు
పోరాట చరిత్రల ఆ భూమి
తన తెరువు తాను వెతుక్కుంటున్నది
మన తెరువు ఏమిటని సీమ నిన్ను ప్రశ్నిస్తున్నది
తెలంగాణను దోచింది చాలు తిరిగి రమ్మంటున్నది
అధికార భ్రమ, ధన కండూతితో
విన్యాసాలు వృథా అంటున్నది
తన కండగండ్లపై నీకు కన్నీరెందుకు లేదే
దయగల అక్కా అని అడుగుతున్నది
సీమ భవిష్యత్తులో నీ భవిష్యత్తును
వెతుక్కొమంటున్నది!
-టంకశాల అశోక్