విద్వేషం ముసుగులో ప్రశ్నకు సంకెళ్లు
ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించడం నేరం కాదు. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడం విద్వేషం కాదు. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టడం దేశద్రోహం కాదు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసే విధంగా చట్టాలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. అయితే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లు2026 ఈ ప్రాథమిక సూత్రాలపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నది.
విద్వేషాన్ని అరికట్టడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. కానీ, ఆ ముసుగులో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, జర్నలిస్టులను భయపెట్టడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను మూయించడానికి ఉపయోగపడే అధికారాలను చట్టబద్ధం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ నేపథ్యంలో సదరు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 25న తెలంగాణ శాసనసభ సెలెక్ట్ కమిటీకి బీఆర్ఎస్ 11 పేజీల వినతిపత్రం సమర్పించింది. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరింది. విద్వేష ప్రసంగాలు, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టే చర్యలపై శిక్షలు విధించేందుకు నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. ఈ అభ్యంతరాలను కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదంగా చూడకూడదు. ఇది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలకు, ప్రభుత్వానికి ఉండాల్సిన పరిమితులకు సంబంధించిన మౌలిక ప్రశ్న.
1982లో బీహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ప్రభుత్వం తీసుకువచ్చిన బీహార్ ప్రెస్ బిల్లు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. పరువు నష్టం కలిగించే ప్రచురణలను నియంత్రించాలనే పేరుతో తీసుకువచ్చిన ఆ బిల్లు జర్నలిస్టులను, సంపాదకులను క్రిమినల్ కేసులకు గురిచేసే ప్రమాదం ఉన్నదని పత్రికా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టే వార్తలను కూడా అపకీర్తికరమైన ప్రచురణలుగా పరిగణించే అవకాశం ఉన్నదని విమర్శించాయి. పత్రికా స్వేచ్ఛ కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల నేపథ్యంలో చివరికి ఆ బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఆ చరిత్ర చెప్పే పాఠం ఒక్కటే. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టం. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. మీసా వంటి చట్టాలను ఉపయోగించి వేలాది మందిని నిర్బంధించారు. ప్రజల ప్రాథమిక హక్కుల అమలుపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.
ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే స్వేచ్ఛను పరిమితం చేశారు. 1977లో ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారానికి ప్రజాస్వామ్య పరిమితులు ఉంటాయని నిరూపించింది. నేటి తెలంగాణ పరిస్థితులను గమనిస్తే ఎమర్జెన్సీ నేర్పిన చారిత్రక పాఠాన్ని విస్మరించినట్టు అనిపిస్తున్నది. పాలకుల చేతుల్లో అపరిమిత అధికారాలు కేంద్రీకృతమైతే, ముందుగా ప్రమాదంలో పడేది ప్రజల స్వేచ్ఛే. హింసను ప్రేరేపించే విద్వేషం నుంచి పౌరులను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించిన భాషను ఎలా అర్థం చేసుకోవాలి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దూసుకెళ్లే విధంగా ప్రోత్సహించడం దేనికి సంకేతం?
కేసీఆర్, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని దూషణ వ్యాఖ్యలు, కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి పదేపదే దూషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి విద్వేషపూరిత ప్రసంగాలు కావా? ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రోత్సహించడం (promoting enmity against a caste) కాదా? ముఖ్యంగా, కేసీఆర్ కీడును కోరుకునే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, అసభ్యకర మాటలు ముఖ్యమంత్రి నోట రావడం ప్రజాస్వామ్య రాజకీయ సంస్కృతికి తగినది కాదనే ఇంగితజ్ఞానం సీఎంకు ఉన్నదా? విద్వేష ప్రసంగాలను అరికట్టాలని కొత్త చట్టాన్ని తీసుకువస్తున్న ప్రభుత్వం, తన నాయకులు ఉపయోగించే భాష విషయంలో అదే నైతిక ప్రమాణాలను ఎందుకు పాటించకూడదు? ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు చట్టంలోని నేర నిర్వచనాలకు సరిపోతే, వారి పదవులతో సంబంధం లేకుండా చట్టం సమానంగా వర్తించాలి.
ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. అధికారంలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ అంతకంటే కాదు. చట్టాన్ని అమలు చేయడం, నేరాలను నిరోధించడం, ఫిర్యాదులను నిష్పాక్షికంగా విచారించడం, నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడం పోలీసుల విధి. కానీ, తెలంగాణలో పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా, ప్రభుత్వ పెద్దలపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సిన నాయకుల స్థానంలో పోలీసులే ఫిర్యాదుదారులుగా మారుతున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనాలు.
కొన్ని సందర్భాల్లో పోలీసులు స్వయంగా కేసులు నమోదు చేయడానికి చట్టపరమైన అధికారం ఉంటుంది. అయితే, ఆ అధికారాన్ని ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడేందుకు ఉపయోగిస్తున్నారా? లేక నిజంగా నేరం జరిగిందనే ఆధారాలతో ఉపయోగిస్తున్నారా? అనేదే అసలు ప్రశ్న. ప్రభుత్వంపై విమర్శలు వస్తే పోలీసులే పాలకుల తరఫున స్పందించే పరిస్థితి ఏర్పడితే, ప్రజల హక్కులను రక్షించాల్సిన వ్యవస్థ రాజకీయ అధికారానికి రక్షణ కవచంగా మారే ప్రమాదం ఉన్నది. ప్రతిపాదిత బిల్లులో విద్వేష ప్రసంగం నిర్వచనానికి ఉపయోగించిన కొన్ని పదాల విస్తృత పరిధి ఆందోళన కలిగిస్తున్నది. మొదటి నేరానికి ఏడేండ్ల వరకు, పునరావృత నేరానికి పదేండ్ల వరకు శిక్షలు ప్రతిపాదించారు.
ప్రభుత్వం ద్వారా నియమితులైన అధికారి అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించే అధికారాన్ని కూడా బిల్లు కల్పిస్తున్నది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ విశ్లేషణ కూడా ఈ అధికారాలకు తగిన విధానపరమైన రక్షణలు లేకపోవడం, రాష్ట్ర శాసనాధికార పరిధి వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తూ ప్రచురించిన వార్తను విద్వేష ప్రసంగంగా చిత్రీకరిస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రమాదాలన్నింటినీ పరిశీలించినప్పుడు, బిల్లును దుర్వినియోగం చేసే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయలేం. విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు భారతీయ న్యాయ సంహితలో ఇప్పటికే 196, 197, 299, 302, 353 వంటి సెక్షన్లలో నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. అందువల్ల, తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లు2026ను ఉపసంహరించుకోవాల్సిందే.
(వ్యాసకర్త: న్యాయవాది)
తన్నీరు శ్రీరంగారావు
98489 33606
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

