ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న శాఖల్లో పోలీసు శాఖ ప్రముఖమైనది. అందుకే కేంద్ర హోంశాఖ ఏటా దేశంలోని ప్రజలకు అత్యుత్తమమైన, ప్రజా రంజకమైన సేవలనందించే పోలీస్ స్టేషన్లను గుర్తించి, వాటిని అత్యుత్తమ ‘పోలీస్ స్టేషన్లు’గా ప్రకటించి ప్రశంసిస్తున్నది. ఇందులో భాగంగానే 2021కి గాను మన దేశంలోని 36 పోలీసు స్టేషన్లను అత్యుత్తమ పోలీసు స్టేషన్లుగా గుర్తించింది.
ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీలోని ‘సదర్ బజార్’ పోలీస్‌స్టేషన్ ప్రథమ స్థానంలో నిలవగా, మన రాష్ట్రంలోని ‘ఆలేరు’ పోలీస్‌స్టేషన్ 32వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ స్టేషన్ దేశంలో అతిపెద్దది అయిన రాచకొండ కమిషనరేట్, భువనగిరి జోన్‌లోని యాదగిరిగుట్ట పోలీసు సర్కిల్లో ఉన్నది. 2018లో ఇదే రాచకొండ కమిషనరేట్‌లోని ‘సంస్థాన్ నారాయణపురం’ పోలీస్ స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో 14వ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
ఉత్తమ పోలీస్ స్టేషన్ జాబితాలో స్థానం సంపాదించడం ఉత్త ముచ్చటేం కాదు. అందుకు స్టేషన్లో సిబ్బంది అవిరళ కృషిచేయాలి. 360 అంశాల ఆధారంగా ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేస్తారు. ఇందులో శాంతిభద్రతల పరిరక్షణ ప్రధానమైనది. భారత రాజ్యాంగంలోని అధికారాల విభజనను అనుసరించి శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం తరఫున శాంతిభద్రతలను పోలీసు శాఖ పరిరక్షిస్తుంది. పోలీస్స్టేషన్లు వారి ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. ఆ ప్రాంతంలోని ప్రజల ధన, మాన, ప్రాణాలను పరిరక్షించడం పోలీస్‌స్టేషన్ ప్రాథమిక బాధ్యత. ఈ కారణంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక విషయంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రముఖ ప్రాధాన్యం కల్పిస్తారు.
కేంద్ర హోంశాఖ 2021 అక్టోబర్‌లో ఆలేరు పోలీస్‌స్టేషన్ పనితీరును పరిశీలించింది. ఇందుకోసం ఏర్పర్చిన హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందం పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది పనితీరును, మౌలిక సదుపాయాలను మూల్యాంకనం చేసింది. ఈ సమయంలో ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నది. ఈ పోలీస్‌స్టేషన్ ఆలేరు మునిసిపాలిటీ మధ్యలో ఉన్నది. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ 1998లో ‘ఆలేరు’ నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని అన్ని సదుపాయాలతో నిర్మించింది. దీని పరిధిలో 14 గ్రామాలున్నాయి. 2005 వరకు ఆలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొన్ని గ్రామాలు తీవ్రవాదులకు నిలయాలుగా ఉండేవి. ఆలేరు పీపుల్స్ గెరిల్లా స్కాడ్ పేరుతో సీపీఐ (ఎంఎల్) ఈ ప్రాంతంలో తన కార్యకాలపాలను కొనసాగించింది. 1990 ప్రాంతంలో వారి దాడిలో ఒక పోలీసు అధికారి తన ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రప్రభుత్వం విధానాల కారణంగా ఇప్పుడు ఈ సమస్య లేకుండా పోయింది.
‘ఆలేరు’ పోలీస్‌స్టేషన్ పరిసరాలు పచ్చదనంతో అలరారుతున్నాయి. స్టేషన్ లోపల సువిశాలమైన బ్యారక్లున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటస్థలం ఉన్నది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల స్టేషన్ సిబ్బంది బాధ్యతగా వ్యవహరిస్తారు. అన్ని ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ చేసి కాపీని ఫిర్యాదుదారులకు అప్పగిస్తు న్నారు. మహిళలకూ, పురుషులకూ ప్రత్యేకమైన లాకప్ గదులున్నాయి. ఈ పోలీస్‌స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్ పూర్తిస్థాయిలో అమలవుతున్నది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లు ఆలేరు పోలీస్ స్టేషన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో చోటు దక్కించుకోవాలి. ఈ సందర్భంగా ‘ఆలేరు’ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి రాష్ట్ర ప్రజలందరమూ అభినందనలు తెలుపుదాం.
(వ్యాసకర్త: డాక్టర్ పి.మోహన్‌రావు, 99495 95509, విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు)