‘సర్’లో ఓటర్లను తొలగిస్తున్నారిట్లా!
తెలంగాణలో ఈ ఏడాది జూన్‌లో మొదలైన సమగ్ర ఓటు సవరణ ప్రక్రియ (సర్) ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 38 లక్షల 26 వేల 449. ‘సర్' ప్రక్రియలో భాగంగా ఫారాలు ఇచ్చిన వారి సంఖ్య 2 కోట్ల 67 లక్షల 87 వేల 253. అంటే ప్రారంభంలోనే 73 లక్షల 39 వేల 235 ఓట్లు గల్లంతయ్యాయి.
తెలంగాణలో ఈ ఏడాది జూన్‌లో మొదలైన సమగ్ర ఓటు సవరణ ప్రక్రియ (సర్) ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 38 లక్షల 26 వేల 449. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఫారాలు ఇచ్చిన వారి సంఖ్య 2 కోట్ల 67 లక్షల 87 వేల 253. అంటే ప్రారంభంలోనే 73 లక్షల 39 వేల 235 ఓట్లు గల్లంతయ్యాయి. నోటీసులు వచ్చిన వారి సంఖ్య 92,88,118 ఇందులో మ్యాపింగ్ కానివారు, తమ పేరు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తప్పుగా వచ్చినవారూ ఉన్నారు. వీరిని ఒక ప్రత్యేక వర్గమని అధికారులు పేర్కొంటున్నారు.
నోటీసులు ఫిజికల్‌గా ఇండ్ల చిరునామాలకు రాలేదు. బీఎల్వోలు ఎవరూ ఇంటింటికీ రాలేదు. కమ్యూనిటీ హాళ్లు, బస్తీల్లో వీధులు, గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుల్లో కూర్చొని..వచ్చిన వారికి ఫారాలు ఇవ్వడం, వాటిని తీసుకోవడం చేశారు. ఫారాలు డౌన్లోడ్ కాని వారి విషయంలో ఆయా సిబ్బంది వద్ద తగిన సమాచారం లేదా సమాధానం మాత్రం లేదు. మొదట్లో ఆధార్ కార్డు ధ్రువీకరణ పత్రంగా చెల్లుబాటు కాదన్నారు. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఏ ధ్రువీకరణపత్రమైనా పరిగణిస్తామని అన్నారు. వాటిని బీఎల్వోలు తీసుకుంటున్నపుడు ఫొటోలు తీశారు. ఆ ఫొటోల ఉద్దేశం నోటీసులు ఇచ్చినట్లు సాక్ష్యం కోసమని అంటున్నారు.
2002లో మ్యాపింగ్ కాని వారిని వారి తల్లిదండ్రుల ఐడీ ప్రూఫ్ కావాలన్నారు. చాలామంది ప్రజలు ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. 70, 80 పైన వయసున్న వారు తమ జీవితంలో ఎన్నడూ తమకు తామే వెళ్లి ఓటు నమోదు చేసుకోలేదని, తాము పుట్టి పెరిగిన తర్వాత జీవితమంతా ఎక్కడో ఒకచోట ఓటు వేస్తున్నామని చెప్తున్నారు. మరికొందరు తాము పుట్టింది మొదలు ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు తమ ఓట్లు పోవడం ఏమిటని వాపోతున్నారు.
మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోబోతున్నారని తెలుస్తున్నది. హైదరాబాద్ నగర జనాభా కోటీ యాభై లక్షలు కాగా మేడ్చల్-రంగారెడ్డి-హైదరాబాద్ కలుపుకొని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోటి మంది ఓటర్లు ఉన్నారు. ‘సర్’లో డిలీట్ అయిన ఓటర్ల సంఖ్య 43 లక్షలు. ఒక్క హైదరాబాదులోనే 20 లక్షల ఓట్లు తొలగించబోతున్నారని తెలుస్తున్నది. ఇప్పటివరకు ‘సర్’ ప్రక్రియ ముగిసిన రాష్ర్టాల్లో 13 కోట్ల 37 లక్షలు పేర్లను తొలగించారు. ‘సర్’ అమలు జరుగుతున్న రాష్ర్టాల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఓటుహక్కును కోల్పోయే వారి సంఖ్య 16 కోట్లకు చేరుతుందని అంచనా.
ఓటరు జాబితాల నుంచి తొలగింపునకు గురైనవారు కేవలం ఓటు వేయడానికి అనర్హులు కావడమే కాదు, అది వారి పౌరసత్వానికి సంబంధించిన విషయం కూడా. తాము ఈ దేశ పౌరులమే అని నిరూపించుకోవలసిన బాధ్యత వారిపైనే ఉంటుందని అధికారులు అంటున్నారు. నిరూపించుకోలేకపోతే రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన సర్వహక్కులను కోల్పోతారని చెప్తున్నారు. ఓట్ల తొలగింపు అశాస్త్రీయంగా, అసంబద్ధంగా జరుగుతున్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కోటీ 45 లక్షల ఓట్లలో 47 లక్షల ఓట్లను తొలగించిన సందర్భంగా దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఏ కారణం లేకుండా ఓట్ల తొలగింపును స్పృహ ఉండే చేస్తున్నారా? అంటూ, ఇంటి అడ్రస్ మారితే ఓటు తొలగిస్తారా? అని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ, మూడు కోట్ల మంది బంగ్లాదేశీయులు మనదేశంలో అక్రమ వలసదారులుగా ఉన్నారని తెలిపారు. బోగస్ ఓట్లను ఏరివేయడమే ‘సర్’ ఉద్దేశమని ఆయన స్పష్టంచేశారు. అయితే, ఇప్పటికే దేశంలో ఎన్ని బోగస్ ఓట్లు తేలాయో, ఏ ప్రాతిపదికన బోగస్ ఓట్లను గుర్తించారో ప్రజలకు తెలుపాలి. ఇప్పటివరకు ఎంతమంది విదేశీయులను గుర్తించారో ప్రకటించాలి. ‘సర్’ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు ఉత్తవేనని కొట్టిపారేస్తున్న మోదీ, అమిత్ షా..బీజేపీ ఏలుబడిలోని ఉత్తర్‌ప్రదేశ్‌లో కోటీ 27 లక్షల హిందుల ఓట్ల చోరీ జరిగిందని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. పౌరుల, పౌర సమాజాల విజ్ఞాపనల మేరకు అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడానికి కారణమైన అధికారులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి. తొలగించిన ఓటర్లకు సంబంధించి చట్టపరమైన ఆధారాలు వెల్లడించాలి. ప్రగతిశీల వ్యక్తులు, సంస్థలు మేధావులు ఈ అక్రమాలను ప్రశ్నించి నిరోధించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది.
(వ్యాసకర్త: ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు)
జీ అనసూయ
9490128259
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

