BRS | ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖల నేతలు తరలిరావాలని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల కోరారు. ఎన్నారైలతో ఆయన ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్లో మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారని.. ప్రవాస భారతీయులుగా తాము గర్వపడుతున్నామన్నారు. ఉద్యమ సమయంలో విశ్వరూప మహాసభ వంటి చారిత్రక సభలకు వేదికైన వరంగల్ గడ్డపై ఈ రజతోత్సవ మహాసభ స్ఫూర్తిదాయకమన్నారు.
మహాకవి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ సాధనకు బలమైన పునాది వేశాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన విషయం జగమెరిగిన సత్యమని.. రజతోత్సవ మహాసభ విజయవంతమవ్వాలని.. కేసీఆర్ ఆశయాలు ప్రపంచానికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా చేరుకుంటూ.. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారన్నారు. అలాగే, సంవత్సర కాలం పాటు వివిధ దేశాల్లో రజతోత్సవ వేడుకలు చేయనున్నారని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వివరాలను ప్రకటిస్తారని వివరించారు.
Brs Nri