కొర్రీలతో..కోత
రైతులకు రుణమాఫీ తిప్పలు తప్పడం లేదు. పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతున్నది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీలో పేరు రాని వారు, బ్యాంకుల్లో అప్పులు మాఫీ కాని వారంతా తీవ్ర ఆందోళనచెందుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ వర్తించలేదంటూ వాకబు చేసేందుకు బ్యాంకులకు వరుస కడుతున్నారు.
- చెప్పిందొకటి.. చేసిందొకటి..
- కర్షకులకు తప్పని రుణమాఫీ తిప్పలు
- బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వైనం
- కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.459కోట్లు మాఫీ
- సగానికి ఎక్కువ మంది రైతులకు మొండిచేయి
- కేసీఆర్ పరిపాలనలో రెండుసార్లు సాఫీగా రుణమాఫీ
రైతులకు రుణమాఫీ తిప్పలు తప్పడం లేదు. పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతున్నది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీలో పేరు రాని వారు, బ్యాంకుల్లో అప్పులు మాఫీ కాని వారంతా తీవ్ర ఆందోళనచెందుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ వర్తించలేదంటూ వాకబు చేసేందుకు బ్యాంకులకు వరుస కడుతున్నారు. ఫోన్లకు మెస్సేజ్‌లు వచ్చిన వారంతా సంబుర పడుతుండగా రాని వారంతా నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తుందని అందరూ చెప్పారని, రుణమాఫీ అవుతుందని కొండంత భరోసాతో ఉంటే నోట్లో మట్టి కొట్టారంటూ రైతులు బాధపడుతున్నారు.
కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని కాంగ్రెస్ సర్కారు అమలు చేసిన రుణమాఫీతో క్షేత్రస్థాయిలో వేలాది మంది అర్హులైన రైతులకు మాఫీ వర్తించలేదు. దీంతో వారంతా విలవిల్లాడుతున్నారు. ఇదేం పద్ధతంటూ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతున్నారు. కేసీఆర్ హయాంలో తమకు రుణమాఫీ వచ్చిందని, ఇప్పుడు ఎందుకు రాదంటూ పలువురు గుర్తు చేసుకుంటూ బ్యాంకుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.
-నిజామాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాటను నెరవేర్చే క్రమంలో చాలా మంది అర్హులను పక్కన పెట్టింది. నిబంధనల పేరిట కొర్రీలు జతచేసి ఒక్కో గ్రామంలో చాలా మంది రైతులకు రుణ విముక్తి చేయకుండా మొండిచేయి చూపించింది. కేసీఆర్ హయాంలో మొదటిసారి రుణమాఫీలో ఉమ్మడి జిల్లాలో రూ. 1576 కోట్లు నిధులు వెచ్చించాల్సి వచ్చింది. రెండోసారి రుణాల రద్దుతోనూ ఏకంగా రూ.వెయ్యి కోట్లు మాఫీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కేవలం రూ.459కోట్లు మాత్రమే ఉమ్మడి జిల్లాలో రుణాలు మాఫీ అయ్యాయి.
కేసీఆర్ చేసిన రుణమాఫీలో రేవంత్ రెడ్డి సర్కారు మాఫీ చేసిన రుణాలు చాలా స్వల్పమేనని గణాంకాలే చెబుతున్నాయి. 18వ తేదీన రుణమాఫీ తొలి విడుతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 86వేల రైతు కుటుంబాలకే ప్రయోజనం జరిగింది. వాస్తవానికి రుణాలు తీసుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలతో చాలా మంది నోట్లో మట్టి కొట్టినట్లయ్యింది. నిజామాబాద్ జిల్లాలో 4.14లక్షల కుటుంబాలకు రూ.225.62 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 4.52లక్షల కుటుంబాలకు రూ.235.61కోట్లు మాత్రమే రుణ విముక్తి జరిగింది.
కేసీఆర్ హయాంలో సాఫీగా…
కేసీఆర్ పాలనలో రెండుసార్లు రుణమాఫీ జరిగింది. పక్కాగా రైతులందరికీ రుణమాఫీని అమలుచేశారు. ఎలాంటి షరతులు విధించలేదు. వ్యవసాయ రుణాలు తీసుకున్న వారందరికీ స్వాంతన చేకూర్చారు. 2016లో తొలిసారి రుణమాఫీని కేసీఆర్ అమలుచేశారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో రూ.లక్షలోపు రుణం తీసుకున్న వారందరికీ మేలు జరిగింది. ఎంతమంది అర్హులుంటే అంతమందికీ రుణమాఫీ చేశారు. చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించారు. 2016లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3లక్షల 79వేల 520 మంది రైతులకు లాభం చేకూరింది.
ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1576 కోట్లు నిధులు వెచ్చించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కరోనా ద్వారా తలెత్తిన ఆర్థిక కష్టాలను పట్టించుకోకుండా ఇచ్చిన హామీని రైతుల కోసం కేసీఆర్ నెరవేర్చారు. 2018లో రెండోసారి రైతులకు రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న లక్షా 95వేల 657 మందికి రూ.942 కోట్లు రుణమాఫీ చేశారు. కేసీఆర్ హయాంలో రెండుసార్లు జరిగిన రుణమాఫీ ద్వారా మొత్తం 5,75,177 మంది రైతులకు మేలు జరిగింది. ఇందుకోసం రూ.2,518కోట్లు కేసీఆర్ సర్కారు మంజూరు చేసింది.
చెప్పలేక.. మింగలేక..
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీతో సొంత పార్టీలోని కార్యకర్తలు సైతం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయమే చేసుకుంటూ కాంగ్రెస్‌లో పనిచేసే వారిలోనూ సగానికి ఎక్కువ మందికి రుణమాఫీ వర్తించలేదు. పైగా వీరందరికీ గతంలో కేసీఆర్ అమలుచేసిన రుణమాఫీలో రెండుసార్లు లబ్ధి పొందిన వారున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వస్తే లాభం జరుగుతుందంటూ ప్రచారం చేసి ఏకంగా వారే స్వయంగా దెబ్బతినడంపై చెప్పలేక మింగలేక అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైకి మాత్రం నవ్వుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సంబురాల్లో పాల్గొంటున్నప్పటికీ లోలోపల రైతులను మోసం చేసిన తీరును చూసి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుమిలిపోతున్న దృశ్యాలు సైతం పలు చోట్ల కనిపిస్తున్నాయి. రూ.లక్షలోపు రుణమాఫీకి షరతుల్లేకుండా అమలు చేస్తే బాగుండేదన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ ఏర్పడింది.
నా లోన్ మాఫీ కాలేదు
ధర్పల్లి, జూలై 20: రామడ్గు సొసైటీ ఆధ్వర్యంలోని ధర్పల్లి ఎన్డీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నా. నా లోన్ రూ.లక్ష ఉన్నప్పటికీ జాబితాలో నా పేరు రాలేదు. లోన్ మాఫీ వస్తుందేమోనని జాబితాలో పేరు కోసం ఆతృతగా ఎదురుచూశాను. కానీ లిస్టులో నా పేరు రాకపోవడంతో బాధపడ్డాను. రెండో జాబితాలోనైనా నా పేరు వస్తుందో లేదోనన్న అనుమానం వస్తున్నది. ప్రభుత్వం ఒకేసారి ఎలాంటి కొర్రీలు లేకుండా వ్యవసాయం చేసుకునే రైతులందరికీ రుణమాఫీ చేస్తే బాగుంటుంది. మళ్లీ ఆ రుణమాఫీలో అసలు పోగా వడ్డీ మేమే కట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నా.
– సోమ శేఖర్, రైతు, మైలారం, ధర్పల్లి మండలం
సహకార సంఘంలో లోన్ తీసుకున్న..
శక్కర్‌నగర్, జూలై 20: ఎడపల్లి సహకార సంఘం ద్వారా రూ.25వేలు రుణం తీసుకున్నా. ప్రభుత్వం రూ. లక్షలోపు రుణాల మాఫీని మొదటి దఫాలో ప్రకటించగా వచ్చిన లిస్టులో నాపేరు లేదు. రెన్యూవల్ చేయిస్తూ నిబంధనల మేరకు ఉండడంతో నాకు రుణమాఫీ వస్తుందని ఎదురుచూశా. ప్రభుత్వం పెట్టిన షరతులు, నిబంధనల మేరకు నేను రుణమాఫీకి అర్హుడినే. సహకార సంఘంలో అడిగితే, రుణమాఫీ రాని వారి లిస్ట్ తిరిగి పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి రుణాన్ని మాఫీ చేయడంలో ఏం ఇబ్బంది జరిగిందో అధికారులే తెలపాలి.
– పోల మల్లారెడ్డి, రైతు, ఎడపల్లి.
అన్నీ కరెక్టు ఉన్నా మాఫీ కాలేదు..
నేను జానకంపేట్ సహకార సంఘం ద్వారా రూ. 67 వేల రుణం తీసుకున్న. ప్రభు త్వం ప్రకటించిన మొదటి లిస్టులో నా పేరు ఉంటుందని ఆశించా.. అయితే, మా సహకార సంఘంలో సగం మందికి పైగా రైతులకు రుణాలు మాఫీ కాలేదు. మొదటి విడుతలో మాఫీ జరగని మాలాంటి రైతులను, రెండోదఫా రూ.లక్షన్నర రుణమాఫీకి ముందే గుర్తించి, పథకం వర్తించేలా చూడాలి. రెండో దఫా అమలు చేస్తే, మొదటి విడతలో రుణమాఫీ జరగని మాకు అన్యాయం జరుగుతుంది. అందుకే రెండో విడుతకు ముందే మా సమస్య పరిష్కరించి న్యాయం చేయాలి.
– డి.గంగాధర్, రైతు, జానకంపేట్.
రూ.80వేలు తీసుకున్న.. మాఫీ కాలేదు
డిచ్పల్లి, జూలై 20 : నేను బర్ధిపూర్ సొసైటీలో రూ.85వేల పంట రుణం తీసుకున్న. రెండు రోజుల క్రితం ప్రకటించిన రుణమాఫీ లిస్టులో నా పేరు రాలేదు. రూ.లక్ష లోపు ఉన్నా.. మాఫీ ఎందుకు కాలేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ చేయాలి. నాతోపాటు మా గ్రామంలో చాలా మందికి రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
– నీరడి సంధ్య, బర్ధిపూర్ గ్రామం, డిచ్పల్లి
నా పేరు లేదు.. ఏం చేయాలో…
కోటగిరి, జూలై 20 :నా పేరు వడ్ల శ్యాంకుమార్, నాకు కోటగిరి సమీపంలోని దా మర చెరువు కింద 18 గుంటలు పొలం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వ హయంలో రూ.15వేలు రుణం తీసుకుంటే గతేడాది అక్టోబర్‌లోనే మాఫీ అయ్యింది. తిరిగి కొత్తగా రూ.15వేలు పంటరుణం తీసుకున్న. కానీ ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. సంబంధిత శాఖ సిబ్బందిని అడిగితే రుణమాఫీలో పేరు రాలేదని సమాధానం చెప్పారు.
– వడ్ల శ్యాంకుమార్, రైతు, కోటగిరి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

