ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్‌లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్‌లో రాయడం, ఆ భాషలో సరైన ఉచ్ఛారణతో మాట్లాడడంలో మాత్రం వెనుకబడిపోతున్నారు. దీంతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసినప్పటికీ వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడడంలేదు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లాలన్నా, బడా కంపెనీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఎంపికవ్వాలన్నా.. ఇబ్బందులు పడుతున్నారు. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ చదువుతున్నప్పటికీ, ఆ భాష మాట్లాడడం, సరైన విధానంలో అర్థంచేసుకోకపోవడంతో మంచి భవిష్యత్తును కోల్పోతున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అది కూడా తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులకైతే ఇంగ్లిష్‌లో రాయడం, చదవడం, వినడం, మాట్లాడడం అన్నది ఒక గుదిబండగా మారింది.
ఆంగ్ల విద్యకు అన్నిరంగాల్లో ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో ఇంటర్మీడియట్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటి వరకు భౌతిక శాస్త్రం, రసాయన, జీవ, వృక్షశాస్ర్తాలతోపాటు వొకేషనల్ కోర్సుల్లోనే ప్రాక్టికల్స్ ఉండేవి. ఇక నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్ ప్రవేశపెడుతున్నారు. ఇంగ్లిష్‌లో పట్టుసాధిస్తే ఉద్యోగ సాధనలో సైతం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు.
ఇంగ్లిష్ భాష ప్రావీణ్యం పెరగాలన్నా.. కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడాలన్నా ‘ఎల్ఎస్ఆర్డబ్ల్యూ’ స్కిల్స్ ప్రధానమని ఆంగ్ల భాషా నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ ఎల్ అంటే లిజనింగ్ (వినడం), ఎస్ అంటే స్పీకింగ్ (మాట్లాడడం), ఆర్ అంటే రీడింగ్ (చదవడం), డబ్ల్యూ అంటే రైటింగ్ (రాయడం).. ఈ నాలుగింటిలో నైపుణ్యాలు పెంచే ప్రధాన ఉద్దేశంతో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ నైపుణ్యాలు పెరిగితే ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లోనూ, బడా కంపెనీల్లో నియామకాలకు విదేశాలకు వెళ్లేందుకు టోఫెల్ తదితర పరీక్షల్లోనూ విద్యార్థులకు విజయవకాశాలు ఉంటాయి.
ఇంటర్ దశలోనే ఇంగ్లిష్ అభ్యాసానికి సరైన పునాది పడితే.. భవిష్యత్తులో స్పోకెన్ ఇంగ్లిష్ కోసం వేలాది రూపాయలను కోచింగ్ సెంటర్లకు ధారపోయాల్సిన దుస్థితి రాదు. 20 మార్కులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల్లో ఐదు విభాగాలు ఉంటాయి. కమ్యూనికేటివ్ ఫంక్షన్, జామ్ (జస్ట్ ఏ మినిట్), పాత్ర పోషణ (రోల్ ప్లే) మౌఖిక పద్ధతిలో, గ్రూప్ డిష్కషన్ మాదిరిగా జరుగుతాయి. లిజనింగ్ కాంప్రహెన్షన్ కింద ఒక ఆడియోను వినిపించి, దానికి సంబంధించిన ప్రశ్నలను బోర్డుపై రాస్తారు. మరోసారి అదే ఆడియోను వినిపించి, బోర్డుపై ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇది రాత పద్ధతిలో ఉంటుంది. ప్రాక్టికల్ రికార్డు పుస్తకం విభాగంలో ఏదైనా తమకు నచ్చిన అంశంపై రాయాల్సి ఉంటుంది. మొత్తం ఐదు విభాగాలకు ఒక్కో విభాగానికి నాలుగు మార్కులు చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంగ్లిష్ లెక్చరర్లకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించాలన్న యోచనలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నది.
విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేకంగా 90 పేజీలతో కూడిన ‘ఏ హ్యాండ్‌బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-1’ పేరిట ప్రత్యేక సిలబస్‌తో ఇంటర్మీడియట్ బోర్డు కొత్త పుస్తకాన్ని రూపొందించింది. ఆ పుస్తకాలు ముద్రణను పూర్తిచేసుకొని జూనియర్ కళాశాలలకు చేరాయి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ సెకండియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు, వొకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఇకపై ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ ప్రారంభించడంపై విద్యార్థులు ఆ సబ్జెక్ట్‌ను మూస ధోరణిలో చూడకుండా ఆసక్తిని పెంచుకునే అవకాశం కలిగింది. ఈ ప్రాక్టికల్స్ కోసం ప్రతి జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్ ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనేక జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ప్రారంభించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టడం మంచి పరిణామం. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాక్టికల్స్ కోసం సిలబస్‌ను కూడా అందించారు. అన్ని కళాశాలల్లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా అమలుచేస్తాం. వచ్చే ఏడాది మార్చిలో 20 మార్కుల కోసం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రాక్టికల్స్‌తో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అమెరికా, బ్రిటన్ యాక్సెంట్ అలవడుతుంది. ప్రాక్టికల్స్ కోసం కళాశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌ను ఏర్పాటుచేయబోతున్నాం.
– ఎల్.రఘురాజ్, డీఐఈవో, నిజామాబాద్
ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఇప్పటి వరకు విద్యార్థులు పరీక్షలను రాత పద్ధతిలో రాసేవారు. దీంతో వారికి ఇంగ్లిష్ భాష ఉచ్ఛారణ సరిగ్గా వచ్చేది కాదు. మాట్లాడడం రాక విద్య, ఉద్యోగ అవకాశాలను పొందడంలో ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడీ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌తో విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేర్చుకోగలుగుతారు. రేపటి రోజున ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. మా కళాశాలలో ఇప్పటికే ఇంగ్లిష్ ల్యాబ్‌ను ప్రారంభించి ప్రాక్టికల్స్ చేయిస్తున్నాం.
– ఎస్.అరుణ్‌కుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్,
విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను పూర్తిగా వినియోగించుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు మూడు విభాగాల్లో మౌఖికంగా, గ్రూప్ డిష్కషన్ తరహాలో జరుగుతాయి. రెండు విభాగాల్లో రాత పద్ధతిలో ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్‌తో విద్యార్థులకు ఇంగ్లిష్ చక్కగా వినడం, రాయడం, మాట్లాడడం అలవడుతాయి. ఇదొక మంచి ప్రయోగం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే దీని ఉద్దేశం. ప్రాక్టికల్స్ కోసం ఇంటర్మీడియట్ బోర్డు అందించిన పుస్తకం సిలబస్ మేరకు విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.
– రాములు, ఇంగ్లిష్ లెక్చరర్,