ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 29 : వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ జిల్లాకేంద్రంలోని మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో ‘మినీ వాకథాన్’ను గురువారం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ నుంచి పాత కలెక్టరేట్ వరకు మినీ వాకథాన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించడం సంతోషకరమన్నారు. గుండె సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ రవికిరణ్, సందీప్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు అవీన్, విద్యాసాగర్, శ్రీనివాస్, రవికిరణ్, సందీప్, వాసు, కల్యాణ్, మేనేజ్మెంట్ శ్రీనివాస్‌శర్మ, స్వామి, లహరి, సిబ్బందితో పాటు 200 మంది యువకులు పాల్గొన్నారు.