వినాయక్‌నగర్, ఆగస్టు 28: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి నిజామాబాద్‌ను ప్రమాదరహిత జిల్లాగా నిలపాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా పోలీసు శాఖ, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్తో కలిసి జిల్లా జడ్జి సునీత ప్రారంభించారు.
పరేడ్ మైదానం నుంచి జిల్లా కోర్టు చౌరస్తా వరకు ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించి, అనంతరం హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు మూ డేండ్ల వరకు జైలు శిక్ష, రూ.25వేల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు.
హెల్మెట్ ధరించి వాహనం నడిపితే ప్రాణాలను కాపాడుకునే ఆస్కారం ఉన్నదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వివరించారు. జిల్లాలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 337 మంది చనిపోతే, ఈఏడాది ఇప్పటి వరకు 218మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో ద్విచక్ర వాహనదారుల సంఖ్యనే అధికంగా ఉన్నదని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ వెల్లడించారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం.శ్రీకాంత్ బాబు, పి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.