నిజామాబాద్ కల్చరల్, జనవరి 3: ఆంగ్ల మాధ్యమ పాఠశాలల ప్రభావంతో మన మాతృభాష తెలుగు క్రమంగా అదృశ్యమైపోతున్నది. తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో తెలుగు సాహితీ అర్చకుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్ ఇందూరు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ నెల 5న నిర్వహించనున్న ఆకాశవాణి సర్వభాష జాతీయ కవిసమ్మేళనానికి ఎంపికయ్యారు. తన కవిత్వాన్ని చదవాలని ఆల్ఇండియా రేడియో కోరింది.
నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లికి చెందిన సాయిలు-యశోద దంపతుల కుమారుడు గంగాప్రసాద్ ఐటీఐ పూర్తిచేశారు. అనంతరం ఒక మెకానిక్ దగ్గర పనిచేసి హైదరాబాద్ యూనివర్సిటీ దాకా వెళ్లాడు. పరిశోధనలో గోల్డ్‌మెడల్ అందుకోవడం వెనక గంగాప్రసాద్ దీక్ష, పట్టుదల ఎంతో ఉంది. డాక్టర్ మల్లెగోడ కృషి నేటి యువతరానికి స్పూర్తి.
తెలుగు భాషపై ఉన్న మమకారంతో జిల్లాకు చెందిన కవి, సాహితీవేత్త ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్ ప్రోత్సాహంతో గంగాప్రసాద్ ఎంఏ (తెలుగు) పూర్తి చేశాడు. ఏకంగా ఆరు పుస్తకాలను రాశారు. సాహిత్య అకాడమీ తరఫున శాతవాహనుడు, కాకతీయులు, అసబ్జాహీల వరకు కేవలం ఐదు రోజుల్లోనే 400 పుటల పుస్తకాన్ని రూపొందించారు. కవిత్వం, కథ, విమర్శ, వ్యాసం, పాట, పరిశోధన ఇలా అన్ని రంగాల్లో తన సృజనాత్మకతతో అలవోకగా వ్యాసాలు రాయడంలో గంగాప్రసాద్‌ది అందెవేసిన చెయ్యి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన మొదటి ర్యాంకు సాధించి తెలుగుభాషలో గోల్డ్‌మెడల్ సాధించారు. తదనంతరం అక్కడే ఉద్యోగంలో చేరారు. జాతీయ సెమినార్లలో తన పుస్తకాలను ఆవిష్కరించారు. ‘కవిత్రయ భారతం – కాలస్పృహ’ అనే అంశం మీద పీహెచ్డీ పట్టా పొందారు. అదే క్రమంలో కాలదృక్పథం, కాల పదాల నిఘంటువును రూపొందించారు. గజేంద్రమోక్షం వ్యక్తిత్వ వికాసం అనే అంశాలపై ఎంఫిల్ చేశారు. వందలాది సినిమా, జానపద పాటలు, వేలాది కవితలతో గంగాప్రసాద్ తెలుగు సాహిత్యానికి అక్షరాభిషేకం చేస్తున్నారు. దివంగత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మీద ప్రసాద్ రాసిన నివాళి గీతం ఎంతోమంది ప్రశంసలు పొందింది. పలు షార్ట్ ఫిల్మ్‌లకు మాటలు, పాటలు కూడా రాశారు.
జాతీయ కవిగా ఆకాశవాణి సర్వభాష జాతీయ కవి సమ్మేళనానికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తెలుగు భాష, మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి కృషి చేస్తున్నా. నేటి తరానికి మాతృ భాషపై ఆసక్తి కలిగించడానికి త్వరలోనే తెలుగు భాషా నిఘంటువును రూపొందించాలని ఉంది. నాకు దక్కిన అరుదైన గౌరవాన్ని కవి గురువు కాసర్ల నరేశ్‌కు అంకితమిస్తున్నా.