విద్యతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లే. చాలా మంది యువకులు ఈ నైపుణ్యం లేక వెనకబడిపోతున్నారు. ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో కేవలం 19 శాతం యువకులు మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నారని తెలిసింది. జీవితంలో ఉపయోగపడే విషయాలను పిల్లలు నేర్చుకునేలా చేస్తే సెలవులను సరదాతోపాటు సద్వినియోగం చేసుకునేవిధంగా గడిపేయవచ్చని పలువురు నిపుణుల అభిప్రాయం.
స్ఫూర్తిమంతమైన ప్రసంగాలు వినాలి..
చిన్నపిల్లలు ఇతరులు చెప్పే మాటలతో చాలా ప్రభావితమవుతారు. వారు ఒక గోల్ పెట్టుకునేలా, ఉత్సాహంగా ముందుకు సాగేలా స్ఫూర్తిదాతల ప్రసంగాలను వినిపించాలి. అవి పిల్లలను సన్మార్గం, ఆశాజనకమైన భవిష్యత్తు వైపు నడిపిస్తాయి. వేసవి సెలవుల్లో రోజుకు గంట సమయాన్ని కేటాయించి అంతర్జాలంలో ఉన్న వీరి ప్రసంగాలను వినే విధంగా ఏర్పాట్లు చేయాలి.
మెదడుకు మేత.. మెమరీకి ఊతం
చిన్నారుల మెదడు చురుగ్గా ఉండాలంటే దానికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్పాలి. లేదంటే మొద్దుబారిపోతుంది. పిల్లల మెదడును చురుగ్గా ఉంచే ప్రతి ప్రయత్నాన్నీ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చదరంగం, సుడోకు, ఇతర పజిల్స్ వంటివి మెదడును ఉత్తేజ పరుస్తాయి. పిల్లల అభిరుచిని బట్టి పజిల్స్‌తో పాటు రీజనింగ్ నేర్పించాలి.పోటీకి తగినట్లుగా వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలి. పదసంపదపై పట్టు పట్టు సాధించాలి. ఇందుకోసం ఎప్పుడూ సంభాషణనను మననం చేసుకుంటూ ఉండాలి. దీంతో మన పేరు గుర్తుకువచ్చినంత సులువుగా పదాలు గుర్తుకు వస్తాయి. స్కూల్, కళాశాలలో చదువుకున్న రోజుల్లో అంత సమయం ఉండదు కాబట్టి సెలవుల్లో పద విజ్ఞానంపై దృష్టి పెడితే భాషపై పట్టు సాధించడం సులభమవుతుంది.
టెక్నాలజీపై అవగాహన..
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ లేనిదే ఏ పనీ జరగడం లేదు. అన్ని విషయాలు ఇంటర్నెట్తో అనుసంధానంగా ఉన్నందున ప్రతి వ్యక్తికీ కంప్యూటర్ వినియోగం ప్రాథమిక అవసరంగా మారింది. ఇప్పటికే ఎంసెట్, నీట్ వంటివి కంప్యూటర్ సాయంతోనే నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగ పరీక్షలన్నీ ఆన్లైన్లో జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ టెక్నాలజీని నేర్చుకోవడం ఎంతో అవసరంగా మారింది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ వంటి కోర్సులను నేర్చుకుంటే వివిధ ఆఫీసుల్లో చిన్నాచితక ఉద్యోగాలు గ్యారంటీగా చేయవచ్చు.
భాషపై పట్టు భవిష్యత్తుకు మెట్టు..
ప్రతి ఒక్కరికీ భాష మీద పట్టు ఎంతో అవసరం. అది తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఏదైనా కావచ్చు. మన మాతృభాష తెలుగు అయితే.. బతుకు భాష ఇంగ్లిష్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సంభాషించడానికి ఇంగ్లిష్ అవసరం. భాష వేరు కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. భాష అనేది అందులో ఒక భాగం మాత్రమే. భాషమీద పట్టు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి వేసవి సెలవుల్లో భాషపై దృష్టి పెడితే అది జీవిత కాలమంతా మన ఉన్నతికి దోహదపడుతుంది.
బుక్ రీడింగ్..
సెలవుల్లో రోజుకు గంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో తల్లి దండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగించేవి, పరిజ్ఞానాన్ని అందించే పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాలి. మైండ్మేనేజ్మెంట్ వంటి పుస్తకాలు చదివితే విద్యార్థుల్లో ఉత్తేజంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
స్విమ్మింగ్ తప్పనిసరి..
నీళ్లలో ఆడుకోవడం పిల్లలకు చాలా ఇష్టం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఈదడం వచ్చేది. కాలువలు, చిన్న చిన్న కుంటల్లో ఈత నేర్చుకునేవారు. ఇప్పుడు ఆన్రాయిడ్ ఫోన్ల కారణంగా అదీ దూరమైంది. రోజూ స్విమ్మింగ్ చేస్తే శరీరం దృఢంగా తయారవుతుంది. పట్టణాల్లో చాలావరకు స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులోకి వచ్చాయి. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ ప్రాక్టిస్ చేస్తే ఉత్సాహంతోపాటు ఉల్లాసం కలుగుతుంది.
మెరుగైన చేతిరాత..
పరీక్షల్లో చేతిరాత చాలా ముఖ్యం. మంచిరాత ఉంటే జవాబుపత్రం చూడడానికి, సమాధానాలు చదవడానికి బాగుంటుంది. మంచి మార్కులు కూడా వచ్చే అవకాశముంటుంది. చేతిరాత బాగాలేక టీచర్ల చేత చీవాట్లు తినేవారంతా సెలవుల్లో కొంత కష్టపడాలి. చేతిరాతను మెరుగుపర్చుకునే విధంగా ప్రయత్నించాలి. చేతిరాతను అందంగా మార్చుకునేందుకు వీలుగా మార్కెట్లో డీవీడీలు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు రోజుకు గంట పాటు ప్రాక్టీస్ చేస్తే మీ రాతను మీరే నమ్మలేనివిధంగా మెరుగుపర్చుకోవచ్చు.
ఆటలు, వ్యాయామం..
వ్యాయామాలు ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి. రోజుకి గంట పాటు వ్యాయామాలు చేస్తే మరోపూట తప్పక ఆటలు ఆడాలి. వేసవిలో కొంతమంది ప్రత్యేక శిక్షకులు వ్యాయామాలు, యోగాపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. వీటికి హాజరైతే ఆరోగ్యంతోపాటు మానసిక స్థితి మెరుగవుతుంది. దీంతోపాటు ఏకాగ్రత, మెమోరీ ప్రాసెస్ కూడా పెరుగుతాయి.
ప్రతిభకు పదును..
చాలామంది విద్యార్థులు గణితశాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి అబాకస్, వేదగణితం, స్పీడ్మాథ్స్ లాంటి ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. అక్కడ నేర్చుకున్న విషయాలను వేసవి సెలవుల్లో బాగా సాధన చేసి తిరిగి స్కూల్స్ ప్రారంభమయ్యేసరికి ప్రతిభను పెంచుకొని మంచి మార్కులను సంపాదించుకోవచ్చు. లెక్కలతో అనేక ట్రిక్కులు చేయొచ్చు. అంకెల గారిడీ వంటి వాటిని నేర్చుకుంటే సరదాతోపాటు గణితంపై పట్టు పెరుగుతుంది.