కరెంటు ఉండాలంటే కారు రావాలె..
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులు చెప్పినంత ఖర్చు భరించి పని చేయించుకోవాల్సి ఉంటుండె. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకరావడంతో రైతులకు చాలా తిప్పలు తప్పాయి. భూమి కొనుగోలు చేసిన వెంటనే అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పాస్‌బుక్‌లో భూమి వివరాలను ఎక్కిస్తున్నారు.
- మళ్లీ నాటి చీకటి రోజులు వద్దంటున్న రైతులు
- ‘మూడు గంటల’ కాంగ్రెస్ వద్దు
- 24 గంటల కరెంటిచ్చే బీఆర్ఎస్సే ముద్దు
- 3 గంటల కరెంటుతో.. గుంట తడవదు.. పంట పండదు
- 10 హెచ్‌పీ మోటర్లను మా నెత్తిన పెట్టొద్దు
- పెట్టుబడీ రాదని రైతుల ఆవేదన
- కాంగ్రెస్ పాలన రానివ్వొద్దని స్పష్టం చేస్తున్న అన్నదాతలు
ధరణితో రైతులకు చాలా మేలు
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులు చెప్పినంత ఖర్చు భరించి పని చేయించుకోవాల్సి ఉంటుండె. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకరావడంతో రైతులకు చాలా తిప్పలు తప్పాయి. భూమి కొనుగోలు చేసిన వెంటనే అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పాస్‌బుక్‌లో భూమి వివరాలను ఎక్కిస్తున్నారు. భూములు అమ్మడం, కొనడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. రూపాయి కూడా ఖర్చు కావడంలేదు.
-విక్రమ్‌రెడ్డి, రైతు, మైలారం , ధర్పల్లి మండలం
ఇప్పుడే రైతులు సుఖంగా ఉన్నరు
సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటుతో రైతులు ఉన్నకాడికి సుఖంగా ఉన్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేస్తున్నారు. నీళ్లు పారిచ్చేందుకు తెల్లందాక బాయిలకాడికి, బోర్లకాడికి పోవుడు తప్పింది. 24 గంటల కరెంట్‌ను 3 గంటలకు తగ్గిస్తే గొడ్డు, గోదకు కూడా గడ్డి పెంచే పరిస్థితి ఉండదు. పదేండ్ల కింద పోయిన కరెంట్ బాధలను మళ్లా తీసుకొస్తామంటున్న పార్టీలను రైతులు ఆదరించవు.
-పీసు రాజ్‌పాల్‌రెడ్డి, ధర్పల్లి
కరెంటు కటకటలు వద్దు..
అప్పటి కరెంట్ కటకటలు మళ్లీ రావద్దు. రాత్రి పూట బావుల వద్ద పండుకునేటోళ్లం. కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకుండె. కరెంటు కోసం పొలంకాడనే కావలి కాసేటోళ్లం. రాత్రిపూట ఇచ్చే కరెంట్‌తో చాలా మంది రైతులు నీళ్లు పెట్టేందుకు పోయి కరెంట్ షాక్‌తో, పాముల కాటుతో చనిపోయారు. కరెంట్ సరిగా రాక పంటలు ఎండిపోయేవి. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుండటంతో ఎవుసం సక్కగా ఉంది. రైతులకు వీలైనప్పుడల్లా నీళ్లు పారించుకుంటున్నారు. రెండు పంటలు పండిస్తూ రాజులాగ జీవిస్తుండు. పుట్ల కొద్ది వడ్లు పండుతున్నయ్. ఆ కరెంటు కష్టాలు మళ్లీ రావొద్దు.
-కె. నవీన్‌రెడ్డి, రామడ్గు, ధర్పల్లి మండలం
కాంగ్రెస్ పార్టీకి రైతుల కష్టం తెల్వదు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిను రద్దు చేస్తామంటున్నారు. రైతుల కష్టం తెలియకుండా కాంగ్రెస్ వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముడు గంటలే కరెంట్ ఇస్తామంటున్నారు. ధరణి రద్దు చేస్తామంటున్నారు. ధరణిని రద్దు చేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. రైతుబంధు ఇస్తున్నాడు. రైతులు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం మోటర్ దగ్గర కావాలి కాయాల్సిన రోజులు ఉండేవి. సీఎం కేసీఆర్ 24 కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నడు.
-కే. శంకర్, రాజీవ్‌నగర్ తండా, బోధన్ మండలం
కాంగ్రెస్ వస్తే సమస్యలొస్తయ్..
బోధన్ రూరల్: సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. గత కాంగ్రెస్ హయాంలో రాత్రింబవళ్లూ కరెంట్ కష్టాలతో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 24 గంటలపాటు ఉచితంగా కరెంటును సరఫరా చేయడంతో రంది లేకుండా పంటలు పండిస్తున్నాం. సీఎం కేసీఆర్ మేలును రైతులు ఎప్పటికీ మరువరు.
-టిక్యానాయక్, ఊట్పల్లి, బోధన్ మండలం
3 గంటల కరెంట్‌తో ముప్పు తిప్పలే
ధర్పల్లి: మూడు గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడడం చూస్తే వారికి వ్యవసాయంపై అవగాహన లేదని తెలుస్తున్నది. ఇది ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనం. వ్యవసాయానికి 3 గంటల సమయమనేది ఎలా సరిపోతుంది. వాళ్ల పాలన వస్తే ఇక ముప్పు తిప్పలే. ఇటు పండదు.. అటు ఎండదన్నట్లు వ్యవసాయం పరిస్థితి మారుతుంది. ఇంత ఘోరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్‌కు తప్పకుండా బుద్ధి చెబుతాం.
-పీసు గోపాల్‌రాజ్, రైతు, ధర్పల్లి
కరెంట్ కష్టాలు పోయినయ్..
సీఎం కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు పోయినాయి. గత కాంగ్రెస్ హయాంలో ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ పోయేది. వస్తదో.. రాదో తెలిసేది కాదు. పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాత్రి సమయంలో కరెంట్ షాక్‌తో చనిపోయారు. ముడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి అంటున్నాడు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవే కరెంట్ కష్టాలు వస్తాయి. మేం సంతోషంగా ఉండాలంటే సీఎం కేసీఆర్ సార్‌ను మళ్లీ గెలిపిస్తాం.
-సుదర్శన్‌రెడ్డి, రాంపూర్ గ్రామం, బోధన్ మండలం
24 గంటల కరెంట్‌తో పంటలు బాగా పండుతున్నాయి..
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. పంటలకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 24 గంటల కరెంట్‌తో మోటర్లు కాలిపోతలేవు. కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వ్యవసాయానికి ముడు గంటల కరెంట్ సరిపోతుందని. ముడు గంటల కరెంట్‌తో ఒక్క గుంటకూడా పండది. సగం ఎండిపోవుడే ఉంటది. మళ్లీ పాత పాలన అంటే ..మాకు చీకటి రోజులే. బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
-బైరాగి అశోక్, పెగడాపల్లి, బోధన్ మండలం
ముడు గంటలు వద్దు.. 24 గంటలు కావాలి
కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి ముడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నది. ముడు గంటల కరెంట్ ఇస్తే పంటలు ఎండిపోతాయి. రైతులు గోసపడతారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ సారే మళ్లీ సీఎం కావాలి. కాంగ్రెస్ మాయమాటలను నమ్మవద్దు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతం.
-మేడి రవి పెగడాపల్లి, బోధన్ మండలం
రైతులు దళారుల బారిన పడి ఇబ్బందులు పాలవ్వకూడదనే దశాబ్దాల దారిద్య్రాన్ని వదిలించేలా కేసీఆర్ ధరణిని తీసుకవచ్చారు. ధరణితో దళారులే కాదు.. మన భూములు, రికార్డులను అధికారులు కూడా ముట్టుకోలేని పరిస్థితిలో భద్రంగా ఉన్నాయి. పట్వారీ వ్యవస్థలో ఒకరి భూమిని మకరికి మార్చడం, భూమిని తగ్గించడం, ఇస్టానుసారంగా వ్యవహరించడం ఉండేది. ధరణి వచ్చి భూముల వివరాలన్ని ఆన్లైన్ కావడంతో భూమికి సంబంధించి ఎలాంటి చిన్నమార్పులు చేయాలన్నా యజమాని వేలిముద్ర లేనిదే వీలుకాదు. ఇంత మంచి ధరణి పోర్టల్‌ను తీస్తామనడం దుర్మార్గం.
-నల్ల హన్మంత్‌రెడ్డి, ధర్పల్లి
3 గంటల కరెంట్‌తో గడ్డి కూడా పెరగదు..
మూడు గంటల కరెంటు ఇస్తే పంటలు ఎండిపోవడం ఖాయం. ఆ కొంచెసేపు నీళ్లు పారిస్తే.. గడ్డి కూడా పెరగదు. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాంగ్రెసోళ్లు అన్నట్లు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ ఇవ్వడమనేది పనికిరాని మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటే కరెక్ట్. రైతులు ఉన్న మోటర్లతోనే నిరంతరం పంటలకు నీళ్లు పారించుకుంటున్నరు. ప్రస్తుత కరెంట్‌తో రైతులకు ఎలాంటి బాధలు లేవు.
-నాగంపేట్ సాయారెడ్డి, రైతు, ధర్పల్లి మండలం
కరెంటియ్యని కాంగ్రెస్‌ను బొందపెట్టాలె..
కాంగ్రెస్ నాయకులు నమ్మితే కష్టాలు తప్పవు. మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి ఎటూ సరిపోదు. రైతుల బతుకుల్లో అంధకారమే. సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో గుంట భూమి కూడా ఎండిపోకుండా పంటలు బాగా పండుతున్నాయి. రైతులు మంచి లాభాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా అవస్థలు పడ్డారు. అప్పట్లో ఎన్నోసార్లు కరెంట్ కోసం సబ్స్టేషన్లను ముట్టడించాం. వచ్చీరాని కరెంట్‌తో మోటర్లు కాలిపోయేవి. రిపేర్ చేయించడంతో రైతులపై ఆర్థిక భారం పడేది. నీరు అందక పంటలు ఎండిపోయేవి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. 24 గంటల కరెంట్ ఉండడంతో ఏ సమయంలోనైనా పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులు ఆలోచించి ఓటెయ్యాలె. కరెంట్ 3 గంటలు ఇస్తమన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
-కోతి శేఖర్‌రెడ్డి, రైతు, దుబ్బాక, ధర్పల్లి మండలం
భూములను గుంజుకునడానికే కాంగ్రెస్ కుట్ర
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో ఎంతో మేలు జరుగుతున్నది. దాన్ని తీసేస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. గరీబ్ రైతుల దగ్గర నుంచి ఉన్న భూములను గుంజుకునడానికే వాళ్లు కుట్రలు చేస్తున్నరు. పటేల్, పట్వారీలను తీసుకువస్తే రైతులకు అరిగోసనే. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని తరిమికొడితేనే మంచిగుంటది. మళ్లీ పాత పాటే అంటే మేం ఒప్పుకోం. తెలంగాణ ప్రభుత్వం ధరణి ఫోర్టల్ తెచ్చి అరగంటలోనే మా భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. మూడు ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చింది. రైతుబంధు వస్తున్నది. పెట్టుబడి సాయంతోని అప్పలు లేకుంటా ఎరువులు కొంటున్నం. గీ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
-దరావత్ గోపాల్‌నాయక్, రైతు, భగవాన్ల తండా, ధర్పలి మండలం..
ధరణి పోతే రైతులకు తిప్పలే..
భూములకు రక్షణ కల్పించింది కేసీఆర్ సర్కారే. రికార్డులన్నీ పక్కాగా, పకడ్బందీగా నమోదు చేసి పెంట్టిండ్రు. మనకు తెల్వకుండా గుంట భూమి కూడా వేరేవారి పేరిట బదిలీ కావడం లేదు. గతంలో దళారులు, అధికారులు కలిసి ఒకే భూమిని ఇద్దరు.. ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్ చేసేవారు. రైతుల మధ్య తగాదాలు సృష్టించేవారు. అలాంటి సమ్యలు ఇప్పటికీ తెగడం లేదు. అధికారుల చేతుల్లో ఉన్న భూములకు సబంధించిన సమస్యలు ఇప్పటికీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. రికార్డులను తారుమారు చేయడం ద్వారా రైతుకు అనాయ్యం జరుగుతుంది. ధరణిని తీసేస్తే రైతులకు చాలా తిప్పలు. మన భూములు ఉండాలంటే బీఆర్ఎస్ సర్కారే ఉండాలి.
-జంగబోయిన నర్సింహులు, రైతు, పెద్దమల్లారెడ్డి
ధరణి ఉంటెనే మన భూములుంటయ్..
ధరణిని తీసేస్తే రెవెన్యూ వ్యవస్థ మొత్తం మళ్లీ ఆగమైపోతుంది. సీఎం కేసీఆర్ సారు మూలంగనే రుపాయి ఖర్చు లేకుండా పట్టదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పాలనతో పటేండ్లు, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూమి పట్టాలు చేసుకోవాలంటే తప్పకుండా లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తెచ్చిందో అప్పటి నుంచే రైతులు ఊపిరి పీల్చుకున్నరు. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా.. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే చాలు. అర్ధగంట లోపే అధికారులు రుపాయి తీసుకోకుండా పట్టా చేసి ఇస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పైసలు చేతిలో పెట్టకుంటే ఏ పనీ ముట్టకపోయేది. ధరణి ఉంటెనే మన భూములు ఉంటయ్.. కాంగ్రెస్ వచ్చిందటే భరోసా ఉండది. చాలా జాగ్రత్తగా ఉండాలె.
-బాబు, రైతు బస్వాపూర్, భిక్కనూరు మండలం
మూడు గంటల కరెంట్ సాలది…
కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తమని గొప్పలు చెబుతుండ్రు. వాళ్లంటున్న మూడు గంటల కరెంట్‌తో మూడు గుంటలు కుడా పారదు. ఎవుసం చేసేటోళ్లం మాకు తెల్వదా.. కరెంట్ ఎంతస్తే ఎంత పొలం పార్తదో. ఎవుసం జేసేటోనికి అంతా తెలుసు. కాంగ్రెసోళ్లు అన్నట్లు మూడు గంటల కరెంట్ సాలదు. 50 ఏండ్లు పరిపాలన చేసినా ఇంకా వాళ్లకు అర్థమైతలేదు. మూడు గంటల కరెంట్ ఇచ్చి, 10 హెచ్‌పీ మోటర్లు కొనాలంటే చాలా ఖర్చు అవుతుందంట. ఆ పైసలు ఎక్కడి నుంచి తేవాలి. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తుండు. నాణ్యమైన కరెంట్ ఇవ్వడంతో ఏ మోటరు రిపేరుకు పోతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ బాధలు తప్పవు.
-మర్రి రాజిరెడ్డి, బస్వన్నపల్లి, రాజంపేట్ మండలం
రైతుల బతుకు ఆగమే..
మాచారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వలేదు. దీంతో బోర్మోటర్ల వద్ద పడికాపులు కాసేవాళ్లం. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్, 10హెచ్‌పీ మోటర్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా రైతుల బతుకులు ఆగమవుతాయి. ఆ కాంగ్రెసోళ్లను రానిచ్చేది లేదు. వాళ్లిచ్చే కరెంటు వద్దు..వాళ్ల మోటర్లు వద్దు. కాంగ్రెస్ నాయకుల్లారా.. సంతోషంగా బతుకుతున్న రైతుల జీవితాలతో ఆడుకోకండి.
– బూస దేవరాజు, లచ్చాపేట, మాచారెడ్డి మండలం
ఎవుసం బందు వెట్టుకోవాలె..
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే వేసిన పంటలు ఎండుతాయి. పంటలు పండించలేక నష్టపోతాం. అప్పులబారిన పడడం ఖాయం. దీనికన్నా ఎవుసం బందు వెట్టుకోవడం మంచిది. కాంగ్రెసోళ్లు ఏసీ రూముల్లో కూసోని మస్తు మాట్లాడుతుండ్రు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 10హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. ఆ మోటర్ పెట్టుకుంటే ఒక్కసారిగా ఫుల్ నీళ్లు పోసి.. ఆ తర్వాత చుక్క నీరు కూడా రాదు. నీళ్లు రాకపోతే మోటరు కరాబైతది. రిపేర్లకు పైసలు పెట్టాల్సి వస్తది. ఇదంతా చేస్తే పంట పండదు.. పెట్టుబడి కూడా రాదు. రైతులను ముంచాలని చూస్తున్న కాంగ్రెసోళ్ల మాటలు నమ్మం. పంటలు పండేలా కరెంటు ఇస్తున్న కేసీఆర్‌నే మళ్లీ గెలిపిస్తం.
-బుడ్డ ఎల్లయ్య, రైతు పెద్దమల్లారెడ్డి, భిక్కనూరు మండలం
రైతుల బతుకులు ఆగం చేసే కుట్ర..
కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు కరెంట్ ఎప్పుడోస్తుందో తెలియక అరి గోస పడ్డం. పంటను కాపాడుకునేందుకు ఎన్ని బాధలువడ్డమో మాకు తెలుసు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నది. రెండు పంటలకు సరిపడా నీరు అందింతున్నది. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్ చాలంటే పంటలు పండుతయా? రైతు అగం కావాలనే 10 హెచ్‌పీ మోటరు పెట్టుకొమంటున్నరు. కాంగెసోళ్లు మళ్లీ రైతులను ఇబ్బందిపెట్టడం కాకపొతే ఇంకేంటి? రైతులు బరాబర్ బీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తరు.
-సామ సంతోష్ రెడ్డి, బస్వన్నపల్లి
మూడు గంటల కరెంటు ఎట్లా సరిపోతది?
భిక్కనూరు: మూడు గంటల కరెంటుతో ఎవుసం చేయలేం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతుల బతుకులు చీకట్లోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ వచ్చాకనే బాగుపడ్డరు. 24 గంటల కరెంటు ఇవ్వడంతో సంతోషంగా పంటలు పండిస్తున్నం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నాం. కాంగ్రెస్ 3 గంటల కరెంటు ఇస్తే ఒక్క మడి కూడా నీళ్లు పారవు. వ్యవసాయం వదిలిపెట్టుకోవాల్సిందే. అప్పటి కరెంటు కష్టాలు మళ్లీ రావొద్దు. రాత్రి పూట పొలాల వద్ద జాగారాలు చేశాం. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెసోళ్ల మాటలు వింటే మళ్లీ కష్టాలు మొదలైనట్టే. పొలాలు బీడు పెట్టుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరు. మళ్లీ కేసీఆర్ మూడో సారి సీఎం కావడం ఖాయం.
-టప్ప ఎల్లం, పెద్దమల్లారెడ్డి, భిక్కనూరు మండలం
10హెచ్‌పీ మోటరు కొనలేం..
రాజంపేట్: కాంగ్రెసోళ్లు రైతులను ఆగం చేయాలని చూస్తున్నారు. వ్యవసాయానికి 3గంటల కరెంటు ఇస్తే పంటలకు నీరు అందక ఎండిపోతాయ్. తెలంగాణ రాక ముందు కాంగ్రెసోళ్లు ఇట్లనే చేసిండ్రు. అర్ధరాత్రి కరెంటు ఇస్తే అదే రాత్రి పొలానికి వెళ్లి బోర్లు చాలు పెట్టేవాళ్లం. అది కూడా గంట, రెండు గంటలు ఇస్తే మస్తు అయితుండె. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో మూడు గంటలు ఇస్తమని చెబుతుండ్రు. గదేదో 10హెచ్‌పీ మోటరు పెట్టుకోవాలని అంటుండ్రు. ఆ మోటరును మేం కొనలేం. అంత ఖర్చు పెట్టి కొన్న మోటరు కరాబైతే రిపేర్లు కాంగ్రెసోళ్లు వచ్చి చేయిస్తారా చెప్పాలి. చాలా ఏండ్లు కాంగ్రెసోళ్ల పాలనలో మేం పడ్డ తిప్పలు సాలు. కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం. కష్టాలను కొనితెచ్చుకోం. రైతులను రాజుగా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు అండగా నిలబడి మరోసారి అధికారం ఇస్తాం.
-మైలారం మల్లయ్య, పెద్దాయిపల్లి, రాజంపేట మండలం
కేసీఆర్ పాలనలో పైరవీలే లేవు..
గతంలో భూములు పట్టా చేయించాలంటే చాలా పైరవీలు చేయాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత పైరవీకారులు, లంచాలు లేకుండా ధరణిలో పాస్‌పుస్తకాలు వస్తున్నయ్. రైతు సొంతంగా మీ సేవకు పోయి స్లాట్‌బుకింగ్ చేసుకుంటే పని అయిపోతున్నది. ఇంటికే పోస్టులో పాస్‌పుస్తకాలు వస్తున్నాయ్. గతంలో నెలల తరబడి తిరిగినా మన పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేసేది కాదు. ధరణితో అందరి భూములకు భద్రత వచ్చింది. చిన్న, సన్నకారు రైతులు భూమి పోతదనే భయం లేకుండా బతుకుతున్నరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి ఉండాల్సిందే.
-ఎం. నజీర్, రైతు, ధర్పల్లి
కాంగ్రెస్ వస్తే భూములు బీడు పెట్టాలె..
నాకు 25 ఎకరాల భూమి ఉంది. బీఆర్ఎస్ సర్కారు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడంతోనే మొత్తం సాగు చేస్తున్నం. 5 హెచ్‌పీ మోటరుతో రెండు, మూడు రోజులకోకసారి నీళ్లు పారిస్తా. కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేకనే 3 గంటల కరెంటు సరిపోతుందని అంటున్నడు. వాళ్లు అధికారంలోకి వస్తే చాలా మంది రైతులు భూములను బీడు పెట్టుకోవాల్సి వస్తుంది చిన్న, సన్నకారు రైతులకు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకునే స్థోమత ఉండదు. రేవంత్‌రెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడటం సరికాదు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే.. కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం రైతులతో రాజకీయం చేస్తున్నరు.
-పీసు రాజారాం, రైతు ధర్పల్లి
ఓవర్ లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతయ్..
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంట్‌తో పొలాలు పండవు. రైతులు బాగపడరు. మాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇవ్వటంతో 5 హెచ్‌పీ మోటర్లను వాడుతున్నం. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇచ్చి, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టి నీళ్లు పారిచ్చుకొండి అంటున్నరు. రైతులందరూ ఒకేసారి 10 హెచ్‌పీ మోటర్లను ఆన్ చేస్తే ఓవర్ లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ పేలిపోతయ్. లో వోల్టేజీతో ఇండ్లళ్లకు కూడా సక్కగ కరెంటు రాదు. ఇంత మంచిగున్న 24 గంటల కరెంటును పాడుచేసుకోం.
-జంగిటి పెద్ద పోసన్న, రైతు, సీతాయిపేట్, ధర్పల్లి
పట్వారీలు, కర్ణంల కాళ్లు పట్టుకోవాల్నా..
ధరణి పద్ధతి వచ్చినప్పటి నుంచి భూమి రిజిస్ట్రేషన్ కోసం మాలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. మన భూమి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ధరణి పోర్టల్‌తో నా ఫోన్లోనే చూసుకుంటున్నం. గతంలో పట్వారీలు, కర్ణాల దగ్గరికి పోయి బతిమి లాడాల్సి ఉంటుండె. కాంగ్రెస్ వచ్చి ధరణిని తీసేస్తే భూము పట్టా చేసుకునడానికి మళ్లీ పట్వార్లు, కర్ణాల దగ్గరికి పోయి కాళ్లు పట్టుకోవాల్నా? చల్.. కాంగ్రెస్‌నే ఖతం చేస్తే చాలు.
-సబావత్ శ్రీనివాస్‌నాయక్, రైతు భగవాన్ల తండా
కాంగ్రెస్‌ది అంతా బ్రోకర్ల రాజ్యమే..
రేవంత్‌రెడ్డి ధరణిని తీసేస్తామంటున్నడు. కాంగ్రెస్‌ది అంతా బ్రోకర్ల రాజ్యమే. ధరణి వచ్చిన తర్వాత ఒకే దగ్గర రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అయిపోతున్నాయి. రైతులకు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. ధరణి రద్దు చేస్తే పట్వారీలు, రిజిస్ట్రేషన్ కార్యాలయం, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి ఉంటుంది. అయినా సరిగ్గా పని కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యాక రిజిస్ట్రేషన్ అవస్థలన్నీ పోయాయి. కాంగ్రెస్ సర్కారు వస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయి. రైతులు బ్రోకర్లు, పటేండ్లు, పట్వారీల వెంట తిరిగి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది.
-ఎం.సేవ్యా, రైతు, చెరువు తండా, ధర్పల్లి మండలం
మస్తు ఇబ్బందులు ఎదుర్కొన్నం
కాంగ్రెస్ పాలనలో భూమి పట్టా చేసుకోవాలంటే పట్వారీతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నం. మాకు ఎకరంన్నర భూమి ఉంది. అప్పట్లో ఓ పట్వారీ 35 గుంటలు మాత్రమే పట్టాలో ఎక్కిచ్చిండు. మిగిలింది పట్టా కాలేదు. మొత్తం సాగు చేసుకుంటున్నా మాకు 35 గుంటలకే రైతుబంధు సాయం అందుతున్నది. ఇట్లా చాలా మంది భూములు సాగులో ఉన్నప్పటికీ పట్టాలకు ఎక్కించలేదు. కాంగ్రెస్ నాయకులు మళ్లా పాత పద్ధతే తీసుకొస్తామని అంటాండ్రు. వాళ్లు వచ్చేది లేదు.. చేసేది లేదు. ఎనకటి మనుషులు ఎనికటి వేషాలే ఏస్తరుగానీ, కొత్తగా ఏం ఆలోచిస్తరు. కాంగ్రెస్ వాళ్లతో రైతులకు ఇబ్బందులు ఉంటాయి.
-ఎం. రాజేందర్‌రెడ్డి, రామడ్గు, ధర్పల్లి మండలం
ఎవుసాన్ని ఆగం చేసుకోం..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవు. అప్పట్ల కరెంట్‌తో గోస పడ్డ రోజులు మర్చిపోతమా? రాత్రిళ్లు బ్యాటరీ లైట్లు పట్టుకొని బాయిలకాడ కావలి ఉండేటోళ్లం. కరెంటు ఇట్ల అచ్చినట్టు అచ్చి.. దాని పాడుగాను బందయ్యేది. మళ్లా కరెంట కోసం కావలి కాసేది. ఆ రోజులు గుర్తొస్తేనే వణుకు పుడ్తది. తెలంగాణ వచ్చినంక 24 గంటలు కరెంటేనాయే. ఎప్పుడంటే అప్పుడు పోయి నీళ్లు వదులుతున్నం. కాలిన మోటర్లను ట్రాక్టర్ల తీసుకెళ్లే బాధ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లా కాంగ్రెస్‌కు ఓటేసి మా బతుకులను ఆగం జేసుకుంటమా.. రైతును బతికించిన బీఆర్ఎస్కే మా మద్దతు.
-సోమ శేఖర్, రైతు, మైలారం, ధర్పల్లి మండలం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

