బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 30, 2020 , 01:46:41

2020 కరోనా నామ సంవత్సరం

2020 కరోనా నామ సంవత్సరం

  • మనుషుల మధ్య దూరం పెంచి... దగ్గర చేసిన కొవిడ్‌
  • కష్టకాలంలోనూ సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యం
  • భారీ వానలతో ఉప్పొంగిన గోదావరి, మంజీర
  • ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక..
  • బెట్టింగ్‌ దందాతో ఖాకీలకు మరక

2020 సంవత్సరం మానవ సమాజానికి ఓ చేదు అనుభవంలా మిగిలిపోనుంది. కంటికి కనిపించని శత్రువు ఒకటి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇంకా కొంగొత్త రూపాల్లో పుట్టుకొస్తూ మనిషికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాయదారి రోగం మానవ సమాజానికి కనీవినీ ఎరుగని అనుభవాలను పంచింది. ఉల్టా పల్టా అన్నట్లు వ్యవస్థలే కుప్ప కూలే దుస్థితికి చేరాయంటే అతిశయోక్తి కాదు. కాలు బయటపెట్టడమే ముప్పు అన్నట్లుగా కరోనా వైరస్‌ తీసుకొచ్చిన పరిస్థితులు సరికొత్త పాఠమై నిలిచింది. లాక్‌డౌన్‌ వంటి గడ్డు కాలాన్ని అనుభవంచిన ప్రజలు అనేకానేక గుణపాఠాలను నేర్చుకున్నారు. ఇంతటి విపత్కర దుస్థితిలోనూ బాంబులు లేని యుద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. సామాన్య ప్రజలకు గడ్డు కాలంలోనూ అండగా నిలిచింది. ధరణి లాంటి విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. 2021లో కరోనా వాక్సిన్‌ పుణ్యమా అని సకల జనులంతా సుఖ సంతోషాలతో ఉండాలని యావత్‌ ప్రపంచమే కోరుకుంటున్న వేళ 2020లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని మంచి, చెడుల అనుభవాలపై కథనం.

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఎస్సారెస్పీకి వరద

చారిత్రక శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు 2020 సీజన్‌లో పోటెత్తింది. జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వర కు జల వనరుల శాఖ అధికారులు లెక్కించిన వరద గణాంకాల ప్రకారం 361 టీఎంసీల వరద రావడం విశేషం. అది కూడా వానకాలం ప్రారంభ సమయంలోనే ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదలడం ఓ రికార్డే. ఎస్సారెస్పీ దిగువన ఉన్న ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కాళేశ్వరం జలాల వినియోగం పెరగడం ద్వారా పోచంపాడ్‌పై భారం తగ్గింది. తద్వారా సగం నీళ్లతో ఏడాది పొడవునా నిండుగా కనిపించడంతోపాటు వానకాలం ఆరంభంలో కొద్దిపాటి వర్షాలకే ఆగస్టు నెలాఖరుకే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. 2020, ఆగస్టు 1వ తారీఖు నాటికి 39.298 టీఎంసీలతో 1074 అడుగుల నీటి మట్టంతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకోగా... సెప్టెంబర్‌ మొదటి వారానికి స్వల్ప కాలంలోనే 50 టీఎంసీల వరద రావడంతో నిండుగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పరవశించిన గోదావరి పరీవాహకం

రాష్ట్రంలో రెండు చోట్ల త్రివేణి సంగమాలున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి ఒకటి కాగా.. మరోటి కాళేశ్వరం. జీవనది గోదావరి పవిత్ర స్థలాలను తాకుతూ వడివడిగా తెలంగాణ నేలపై ప్రవేశించేది నిజామాబాద్‌ జిల్లా నుంచే. మరాఠా నేల నుంచి ప్రవహించే గోదావరి, కన్నడ నుంచి పరుగెత్తుకొచ్చే మంజీర, తెలంగాణ నేల నుంచి పుట్టి ప్రవేహించే హరిద్ర ఈ మూడు నదులు ఒకే చోట కలిసే ప్రాంతమే కందకుర్తి. గోదావరి తన జన్మస్థలం నుంచి బంగాళాఖాతంలో సంగమించే వరకూ సుమారుగా 14 ఉప నదులను తనలో కలుపుకొంటుండగా నిజామాబాద్‌ జిల్లాలోనే మంజీర, హరిద్ర రెండు ఉపనదులుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2020లో గోదావరి నది జల అందాలను సంతరించుకుంది. కందకుర్తి నుంచి మొదలు పెడితే ఎస్సారెస్పీ వరకు నిండుగా ప్రవహిస్తున్న నదీ గర్భం అద్భుత సుందర దృశ్యానికి నెలవైంది. వాగులు, వంకల గుండా వచ్చిన భారీ వాన నీటితో జీవనది కాస్తా వరద గోదారిగా నెలల తరబడి కనిపించింది.

ఉపాధి,ఈ-గవర్నెన్స్‌లో టాప్‌

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కామారెడ్డి జిల్లా సత్తా చాటింది. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు పని కల్పించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 98 లక్షల పని దినాలు కల్పించారు. అంతే కాకుండా 23,011 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు పూర్తి చేయడం విశేషం. ఇందూలోనూ కామారెడ్డి జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ నేతృత్వంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పనితనంతో మంచి ఫలితాలు రాబట్టడంతో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా పేరు మార్మోగుతున్నది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రూ.156 కోట్లు చెల్లించారు. ఉపాధి హామీ పేదల కడుపు నింపుతుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులపై ఆసక్తి చూపుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కొవిడ్‌ -19 నిబంధనలు పాటిస్తూ పల్లెల్లో ఉపాధి పనులు నిర్వహించారు. ఉపాధి కోల్పోయిన ఎంతో మందికి ఉపాధి హామీ దిక్సూచిగా నిలిచింది. ఇదే కాకుండా కామారెడ్డి జిల్లాను ఇటీవలే వెబ్త్న్ర అవార్డు వరించింది. డిజిటల్‌ గవర్నెన్స్‌లో సమర్థవంతమైన జిల్లాగా గుర్తింపు పొందింది. kamareddy.telangana.gov.in వెబ్‌సైట్‌ సేవలను జిల్లా ప్రజలకు అందివ్వడంతో కేంద్ర గుర్తింపు దక్కింది.

మంజీర పరవళ్లు

జీవనది గోదావరికి రాష్ట్రంలో అనేక ఉపనదులున్నాయి. అం దులో రాష్ట్ర సరిహద్దులోనే తోడుగా వచ్చేది మంజీర నది. రెండింటి పుట్టుక ఒకే రాష్ట్రంలో జరిగినప్పటికీ వాటి సంగమ క్షేత్రం మాత్రం నిజామాబాద్‌ జిల్లాలోనే ఉంది. ఎక్కడో మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా పటోడా తాలూకాలోని బాలాఘాట్‌ పర్వతశ్రేణిలో సముద్ర మట్టానికి 823 మీటర్ల ఎత్తులో జన్మించిన మంజీర... కర్నాటక మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలో సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రవహిస్తూ లక్షలాది ఎకరాలకు ఆయువు పట్టుగా నిలుస్తున్నది. ఇప్పుడిదంతా గతం. ఎగువన అనేక ఆనకట్టల నిర్మాణంతో రాష్ట్రంలో మంజీర నది రూపు కోల్పోగా మరోమారు 2020 సంవత్సరంలో ఉప్పొంగడంతో పరీవాహక ప్రాంత వాసుల్లో ఆనందం నింపింది. భారీ వానలతో నాలుగేండ్ల తర్వాత నిజాంసాగర్‌ గేట్లు ఎత్తడం, మంజీర కొన్ని రోజులపాటు పరవళ్లు తొక్కుతూ కందకుర్తి వద్ద గోదావరితో సంగమించడంతో జలానందం వెల్లివిరిసింది.

వహ్వా..వరద కాలువ

మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతోపాటు నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు నీరు అందించే ఆధునిక దేవాలయం. మహారాష్ట్రలో అక్రమంగా వెలసిన ప్రాజెక్టులతో చుక్క నీరు రాక గోదావరి నది వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. ఎస్సారెస్పీ ఖాళీ కుండలా దర్శనమివ్వాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి ప్రాజెక్టుకు జలకళను తీసుకురావాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. సగానికిపైగా పనులు పూర్తికావడంతో పునర్జీవ పథకం ప్రారంభానికి ముందే వరద కాలువకు కొంగొత్త శోభను తీసుకొచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎస్సారెస్పీకి ఊతకర్రలా కాళేశ్వరం జలాలను ఎదురెక్కించుకుని 102 కిలో మీటర్ల మేర మోసుకొచ్చింది. దండిగా కురిసిన వానలతో వరద నీటిని తిరిగి దిగువకు తీసుకెళ్తూ మిడ్‌ మానేరు ప్రాజెక్టును నింపింది. ఒకే కాలువ ఎగువ, దిగువ తేడా లేకుండా జలసవ్వళ్లతో సందడి చేయడం ఓ చరిత్ర.

మేమున్నామని..  మీకేం కాదని 

కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలని ఉన్నా భయం కాస్తా చేతులను కట్టేసింది. మానవత్వంతో స్పందించాల్సిన చోట దూరాన్ని పెంచింది. ఇది నిన్నటి మాట. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వైరస్‌ బారిన పడిన కుటుంబాలకు అండగా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఇరుగూ పొరుగు వారు ముందుకొస్తున్నారనేది నేటి మాట. అపోహలు, అనుమానాలు వదిలేసి జాగ్రత్తలు తీసుకుంటూనే సాయం అందిస్తున్నారు. అదే బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. మార్కెటింగ్‌ విభాగంలో పని చేసే ఆర్మూర్‌ వాసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ బారిన పడ్డారు. అద్దె ఇల్లు, భార్యా పిల్లలు అంతా హోం ఐసోలేషన్‌లో ఎలా ఉండాలనుకునే సమయంలో ఓ మిత్రుడు వచ్చి భరోసానిచ్చాడు. ఇదే తరుణంలో సహచర ఉద్యోగులు సైతం అండగా నిలిచారు. ఫోన్‌ చేస్తే అవసరమైన వస్తువులు గుమ్మం వద్దకు చేర్చారు. కరోనా బాధితులపై సానుభూతితో మెలగడానికి నగరవాసులు క్రమేపీ అలవాటు పడుతున్నారని అందరూ భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించింది. కరోనా దృష్ట్యా ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసింది. రైతులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేసింది.

ఖాకీలకు అవినీతి మరక

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పోలీస్‌ శాఖ అప్రతిష్ట పాలైంది. 2020 చివరి అంకంలో వరుసగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పోలీస్‌ అధికారులు పట్టబడడం సంచలనం రేపింది. ఇందులో కామారెడ్డి పట్టణంలో వెలుగు చూసిన బెట్టింగ్‌ వ్యవహారమైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సివిల్‌ తగాదాల్లో తల దూర్చి పోలీస్‌ శాఖకు చెడ్డ పేరు తీసుకువచ్చారన్న అపవాదు పోలీసులపై పడింది. అక్టోబర్‌ 13న బాన్సువాడ సీఐ టాటాబాబు, అక్టోబర్‌ 31న బోధన్‌ సీఐ రాకేశ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా.. నవంబర్‌ 11న కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌ సైతం ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. కామారెడ్డి పట్టణంలో వెలుగు చూసిన ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో నెల రోజుల్లోనే డీఎస్పీ, సీఐ, ఎస్సైలు అరెస్టు అయి జైలుకెళ్లడం సంచలనం రేపింది. ఐపీఎల్‌ నిర్వాహకులతో కుమ్మక్కై సీఐ జగదీశ్‌, ఎస్సై గోవింద్‌ కటకటాలకు వెళ్లగా... బెట్టింగ్‌ అక్రమాల్లో తీగలాగితే డీఎస్పీ లక్ష్మీనారాయణ అక్రమాస్తుల కేసు బయటపడడం, అక్రమంగా బుల్లెట్లు కలిగి ఉన్నందున మరో కేసు డీఎస్పీపై నమోదు కావడం, పక్కా ఆధారాలతో జైలుకెళ్లడం అంతా చకచకా జరిగిపోయాయి. వరుసగా కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో పోలీసుల అవినీతి వ్యవహారాలు బయటపడడంతో 2020 చెరగని మచ్చగా నిలిచినట్లు అయ్యింది.

అద్భుతం..  ధరణి పోర్టల్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తీర్చిదిద్దారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించిన లావాదేవీల్లో సామాన్య ప్రజానీకానికి ఎలాంటి తలనొప్పులు లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భూముల క్రయ, విక్రయాలకు సులువైన ప్రక్రియను ఇందులో చేపట్టారు. అచ్చంగా బ్యాంకు లావాదేవీలను తలపించేలా భూముల అమ్మకం, కొనుగోళ్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా ఈ విధానంలో అమలు చేస్తున్నారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం తహసీల్దార్లు ధరణి పోర్టల్‌ ప్రారంభమయ్యాక జాయింట్‌ రిజిస్ట్రార్లుగా పని చేస్తున్నారు. వ్యవసాయ భూములను వీరే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని 29 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో దిగ్విజయంగా అమలవుతుండడంతో భూముల మార్పిడిలో అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడినైట్లెంది. దొంగ రిజిస్ట్రేషన్లు, పైరవీలకు ఆస్కారం లేకుండా, గంటల తరబడి నిరీక్షణ లేకుండా చకచకా పని జరిగిపోతుండడం విశేషం.

పెద్దల సభకు కవిత

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల బరిలో నిలిచిన కవితను స్థానిక ప్రజా ప్రతినిధులు భారీ మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్సీ పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 88 శాతం ఓట్లు పోలయ్యాయి. సొంత పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు ఇతర పార్టీలకు చెందిన వారు స్వచ్ఛందంగా ఓట్లేశారు. 824 మంది ఓటర్లకు 821 మంది ఓట్లేశారు. ఇద్దరు ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ను వాడుకున్నారు. ఇందులో 728 ఓట్లు కవిత(టీఆర్‌ఎస్‌)కు రాగా, 56 ఓట్లు పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ(బీజేపీ)కు, 29 ఓట్లు వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి(కాంగ్రెస్‌)లకు దక్కాయి. 672 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా కవిత ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కకలేదు. 

నిండుగా నిజాంసాగర్‌

వరద ప్రవాహం లేక కనిష్ఠ నీటి నిల్వతో కొట్టుమిట్టాడిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు 2020 వానకాలం సీజన్‌లో ఆశాజనకమైన ఫలితాలను సాధించింది. నాలుగేండ్ల తర్వాత సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద మూలంగా పూర్తి స్థాయి నీటి నిల్వతో సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. చారిత్రక ప్రాజెక్టు నిజాంసాగర్‌తోపాటుగా సింగూరు ఆశాజనకంగా మారడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల్లోని 21 మండలాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ఢోకా లేకుండా పోయింది. 2016లో చివరి సారిగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువకు మంజీర నదిలోకి నీటిని వదిలిపెట్టారు. ఆ తర్వాత నిజాంసాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టానికి 2020 సెప్టెంబర్‌లో చేరడం విశేషం. 17.802 టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీటితో ఉప్పొంగి దిగువకు పరవళ్లు తొక్కడం రైతుల్లో, స్థానిక ప్రజల్లో ఆనందాన్ని నింపింది.

ఎస్సారెస్పీతో జీవ వైవిధ్యం

కృష్ణ జింకలు నిజామాబాద్‌ జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం సువిశాలమైన పచ్చిక బయళ్లతో అలరారుతున్నది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా 2020 ఎండా కాలంలో ఎస్సారెస్పీలో జల సంపద తొణికిసలాడింది. వేసవిలోనూ 30 టీఎంసీల నీటితో ప్రాజెక్టు ఉండడం మూలంగా బ్యాక్‌ వాటర్‌ ఏరియాలో జలకాంతులీనాయి. ఫలితంగా భిన్నమైన వలస పక్షులు, నీటి పక్షులెన్నో నీటి జాడను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. వేల ఎకరాల్లో మైదాన ప్రాంతం ఉండడంతో కృష్ణ జింకలకు ఆవాసంగా మారింది. క్రమంగా వేలల్లో జింకలు చేరాయి. జంతుజాలాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివచ్చారు. అటవీ శాఖ అప్రమత్తమై అరుదైన కృష్ణ జింకలను గణించింది. సుమారుగా 6వేల పైచిలుకు జింకలు ఈ ప్రాంతంలో ఉండొచ్చనే అంచనాకు వచ్చింది.

కరోనాతో యుద్ధం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులో ఉన్నప్పటికీ... నేడు ప్రపంచమే కంటికి కనిపించని శత్రువుతో కనీవిని ఎరుగని ఉపద్రవాన్ని ఎదుర్కొంటోంది. అన్ని దేశాలు మాయదారి కరోనా వైరస్‌తో నిరాటంకంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ రకంగా కరోనాతో బాంబులు లేని యుద్ధం చేస్తోంది. కొత్త రూపును మార్చుకుంటున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు శత విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొవిడ్‌ -19ను ఎదుర్కొనేందుకు వైద్యులు, పారామెడికల్‌, 108 అంబులెన్సు సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నది. వైరస్‌ సోకిన వ్యక్తిని కుటుంబ సభ్యులే పట్టించుకోని దయనీయ పరిస్థితుల్లో అన్నీ తామై కొండంత అండగా నిలిచి సేవలు చేస్తున్నారు. కన్నవారిని, కట్టుకున్న వారిని వదిలేసి వస్తున్న కొవిడ్‌ -19 బాధితుల కోసం వైద్యులు, వైద్య సిబ్బంది సైతం తమ వారందరికీ దూరంగా ఉంటూ సేవలు అందించారు. కొవిడ్‌ నియంత్రణలో 108 అంబులెన్సు పైలెట్లు, ఈఎంటీలు అలుపెరుగని సేవలు అందించారు. ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్సులు 16 ఉన్నాయి. ఇందులో 80 మంది సిబ్బంది పని చేస్తున్నారు.


logo