గురువారం 28 మే 2020
Nizamabad - Mar 10, 2020 , 00:44:28

మిస్సింగ్‌.. మిస్టరీ

మిస్సింగ్‌.. మిస్టరీ

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే 10 మంది అదృశ్యం కావడం జిల్లాలో కలకలం రేపుతున్నది. ప్రతినెలా సరాసరి 15 మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో మహిళల అదృశ్యం కేసులే ఎక్కువగా ఉండడం గమనార్హం. తమ పిల్లల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని కేసులు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. యువతులు ఎక్కువగా అదృశ్యం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని మృతదేహాలు లభించినప్పుడే అదృశ్య కేసులు గుర్తించి కేసును మూసివేస్తున్నారు. అదృశ్యమైన వారు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నా ఇప్పటికీ మిస్టరీగానే కొన్ని కేసులు మిగిలిపోతున్నాయి.

85 శాతం మహిళలే..

జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్‌ కేసుల్లో 85 శాతం వరకు మహిళలు, అమ్మాయిలే ఉంటున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఫిబ్రవరిలో ఆరు గురు మహిళలు, ముగ్గురు పురుషులు అదృశ్యమయ్యారు. ఇందులో మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన మారకంట రేఖ, ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌ గ్రామానికి చెందిన బోడ శిరీష, పోల్కంపేట్‌ గ్రామానికి చెందిన సూరవ్వ, డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌ గ్రామానికి చెందిన సబాబేగం, భీమ్‌గల్‌ మండలం గోనగొప్పుల గ్రామానికి చెందిన జ్యోతి అదృశ్యమైన వారిలో ఉన్నారు. మిగితా వారు నిజామాబాద్‌ నగరానికి చెందిన సాయికుమార్‌, డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన షేక్‌షరీఫ్‌, సిరికొండ మండలం చిన్న వాల్గోట్‌ గ్రామానికి చెందిన సుభాష్‌ ఉన్నారు. ఇలా ప్రతి నెలా 15కు పైగా అదృశ్యం కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

పెండింగ్‌లోనే అదృశ్యం కేసులు

జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్‌ కేసుల్లో 80 శాతం వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. మిస్సింగ్‌ అయిన వారిలో కొందరు కిడ్నాప్‌కాగా, మరికొందరు హత్యకు గురవుతున్నారు. మరికొన్ని ప్రేమవివాహం చేసుకొని తిరిగి వస్తున్నారు. మిగతా కేసుల్లో ఇప్పటికీ ఆచూకీ లభించడం లేదు. తప్పిపోయిన వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్న వారి ఆశలు నిరాశగానే మిగిలిపోతున్నాయి. జనవరిలో నిజామాబాద్‌ నగరానికి చెందిన ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసి విక్రయించడానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకొని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా చిన్న పిల్లలు మాత్రమే కాదు యువతులు, మహిళలు ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతన్నారు. పోలీసులు మిస్సింగ్‌ కేసులను ఛేదించి పూర్తి వివరాలు వెల్లడించాలని బాధితులు కోరుతున్నారు. 


logo