బుధవారం 20 జనవరి 2021
Nirmal - Jan 12, 2021 , 01:22:06

జనసంద్రమైన దీక్షభూమి

జనసంద్రమైన దీక్షభూమి

ఘనంగా గురుకృప దివస్‌

భారీగా తరలివచ్చిన బంజారా గిరిజనులు

నార్నూర్‌, జనవరి11 : ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం కొత్తపల్లి(హెచ్‌)గ్రామంలోని జాతీయ బంజారా దీక్షభూమి జనసంద్రమైంది. సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గురు శిష్యుల మిలాన్‌ దివస్‌ (42వ గురుకృప దివస్‌) భక్తజనంతో సందడిగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కిటకిటలాడింది. భజన కీర్తనలతో ఆధ్యాత్మిక క్షేత్రం మార్మోగింది. ఆలయ మైదానంలో ఏర్పాటు చేసిన జాతర.. రద్దీగా కనిపించింది. ఈ సందర్భంగా లంబాడా గిరిజనుల ఆరాధ్యదైవం జగదాంబదేవి, ధర్మగురు రాష్ట్రీయ సంత్‌ మహాన్‌ తపస్వీ రామ్‌రావ్‌ మహరాజ్‌ ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సంత్‌ ప్రేమ్‌సింగ్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో భోగ్‌బండార్‌ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన ప్రబోధించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్య అతిథిగా ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ హాజరయ్యారు. దీక్ష భూమి అభివృద్ధికి తమ వంతు కృషిచేస్తామని తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నార్నూర్‌ సీఐ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, సర్పంచ్‌ రాథోడ్‌ సభద్రబాయి, రామేశ్వర్‌, ఠాక్రునాయక్‌, న్యాయవాది జగన్‌, రాథోడ్‌ మధూకర్‌, అజయ్‌, మాజీ సర్పంచ్‌ దిగంబర్‌, ఆలయ కమిటీ నిర్వాహకులు, యువకులు గ్రామపెద్దలు ఉన్నారు.


logo