బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 09, 2020 , 01:36:56

ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం

ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి: ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం ప్రదర్శించిన ఐదు గ్రామ పంచాతీయతీలపై జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ కొరఢాఝుళిపించారు. ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు, తీర్మానాలు చేయని గ్రామ సర్పంచులు, ఉపసర్పంచ్‌ల చెక్‌ పవర్‌ను రద్దు చేశారు. కడెం మండలం లక్ష్మీసాగర్‌, కోర్రతాండ్ర, నిర్మ ల్‌ మండలం డ్యాంగాపూర్‌, పెంబి మండలం పెంబి గ్రా మ పంచాయతీ, ఖానాపూర్‌ మండలం ఎక్బాల్‌పూర్‌ గ్రామ  సర్పంచులతో పాటు పెంబి మండలంలోని అం కెన, యాపలగూడ గ్రామాల ఉప సర్పంచుల చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పచ్చదనం కోసం ట్రాక్టర్లను కొనుగొలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసేందుకు గ్రామ సభలు నిర్వహించి పాలక వ ర్గాలు తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన ధరల మేరకు ట్రాక్టర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలు సొంత నిధులతో కొనుగోలు చేస్తుండగా మరికొన్ని చోట్ల బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 391 గ్రామపంచాయతీల్లో తీర్మానాలు, ప్రతిపాదనలు చేయగా ట్రాక్టర్ల మంజూరు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే ట్రాక్టర్లు అందుబాటులోకి రాగా మరికొన్ని చోట్ల మంజూరు దశలో ఉన్నాయి. ఐదు గ్రామపంచాయతీల్లో మాత్రం ఎలాంటి తీర్మానాలు, ప్రతిపాదనలు చేయకపోవడంతో ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచుల అలసత్వంపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. వారి చెక్‌పవర్‌ను రద్దుచేస్తూ ట్రెజరీ, బ్యాంకు మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, జీపీల నుంచి వచ్చే చెక్కులను చెల్లకుండా ఆదేశాలు ఇచ్చారు


logo