ఇప్పటికే వివిధ బ్యాంకు పరీక్షల కోసం ప్రిపేరవుతున్నవారు అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీస్, రీజనింగ్‌ల గురించి గత సంచికల్లో తెలుసుకున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో
కామన్ సబ్జెక్టుగా ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం.
బ్యాంకు పరీక్షల్లో ఇంగ్లిష్ సెక్షన్‌కు ప్రత్యేకత ఉంది. దీనిలో వచ్చే అంశాలు వొకాబులరీ, ప్యాసేజ్-రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కువ మార్కులతో కూడుకున్నవి. గ్రామర్-నాన్ గ్రామర్ చాప్టర్లను విడదీసి వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లిష్‌పై పూర్తి పట్టు సాధించవచ్చు.
ముందుగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ఉన్న అన్ని చాప్టర్లు బాగా చదవాలి. బేసిక్స్ ఆఫ్ గ్రామర్, రూల్స్, సిలబస్ ప్రకారం స్ట్రాటజీ అవలంబించాలి. పరీక్ష ప్యాట్రన్ ప్రకారం అంశాలను చదవాలి. బ్యాంక్ పరీక్షలకు టైం మేనేజ్మెంట్ చాలా కీలకం.
30 నిమిషాల్లో 30 ప్రశ్నలు సాల్వ్ చేయాలి. ఇందుకు రెండు వ్యూహాలు అనుసరించాలి. ఒకటి ప్రతి అంశాన్ని బాగా చదివి ప్రశ్నలు పరిష్కరించడం, రెండోది ఎలిమినేషన్ టెక్నిక్‌లు పాటించడం. మొదటిది సాధారణంగా ప్రతి ఒక్కరూ అమలు పరుస్తుంటారు. ఎలిమినేషన్ అనేది ప్రిపరేషన్ లెవల్స్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ, నాబార్డ్ గ్రేడ్-బి, సెబీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరీక్షలకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ సెక్షన్ కాస్త కఠినంగా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ అంశాలు పరిష్కరించాలి. ఫాస్ట్ రీడింగ్, ఫాస్ట్ అండర్స్టాండింగ్, ఫాస్ట్ అప్లికేషన్/మార్కింగ్ వంటివి ఏకాగ్రతతో సాధ్యమవుతాయి. ‘హూ ఎవర్ రీడ్స్ ఫాస్ట్ హీ ఎవర్ విన్స్’ అనే సిద్ధాంతాన్ని పాటించాలి.
ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కామన్‌గా వచ్చే అంశాలను తరచూ బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
సిలబస్
బ్యాంకు పరీక్షల్లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ సిలబస్‌ను క్షుణ్ణంగా చదవాలి. సిలబస్ ప్రకారం తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి.
1) వొకాబులరీ 2) రీడింగ్-కాంప్రహెన్షన్
3) ఇడియమ్స్-ఫ్రేజెస్ 4) సినానిమ్స్-ఆంటనిమ్స్
5) టెన్సెస్ 6) ఎర్రర్-డిటెక్షన్
7) సెంటెన్స్ కరెక్షన్స్ 8) ప్రిపోజిషన్స్
9) ఫిల్ ఇన్ ది బ్లాంక్స్/బాక్స్
10) పేరా జంబుల్డ్ సెంటెన్సెస్ 11) క్లోజ్ టెస్ట్
12) మెయిన్స్ కోసం ప్రిసైస్ రైటింగ్, వ్యాస సారాంశం, లెటర్ రైటింగ్, వ్యాసం
వొకాబులరీ కోసం రోజువారీ దినపత్రికలను అనుసరించవచ్చు. వీటిలో ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో పదాలు, వాటి అర్థాలు, సమాన పదాలు-వ్యతిరేక పదాలు (ఆంటనిమ్స్)తో పాటు ఎడిటోరియల్స్ కూడా చదవాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్
దినపత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్ బ్యాంక్, ఇతర పరీక్షల్లో రీడింగ్ కాంప్రహెన్షన్ రూపంగా వస్తాయి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజూ ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చే పై అంశాలను సొంతనోట్స్లో రాసుకుంటే చాలా మంచిది.
బ్యాంక్ పీవో, ఎస్వో పరీక్షల్లో అన్ని విభాగాలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఇవి నేషనల్ లెవల్ పోస్టులు కాబట్టి ఇంగ్లిష్‌లోనే పరీక్ష రాయాలి. ఇందుకు ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, మేగజైన్లు, ఎడిటోరియల్స్ వంటివి క్రమం తప్పకుండా చదివితే మంచి ఫలితం ఉంటుంది.
క్లర్క్ పరీక్షలకు ప్రాంతీయ భాషలో కూడా పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉండటం వల్ల తెలుగు వారు లాభం పొందినప్పటికీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ సెక్షన్‌ను మాత్రం ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఈ విభాగాన్ని తేలికగా తీసుకోవద్దు.
గ్రామర్, నాన్ గ్రామర్ పార్టులుగా విభజించి చదవాలి. గ్రామర్‌లో టెన్సెస్, ఎర్రర్-డిటెక్షన్, సెంటెన్స్-కరెక్షన్స్ వంటి అంశాలు కీలకమైనవి.
వీటి కోసం టెన్సెస్-ఫామ్స్ (టైప్స్ ఆఫ్ టెన్సెస్), వాటి నిర్వహణ వంటి బేసిక్స్ బాగా అవపోసన పట్టాలి. వీటిని ఎలా ఉపయోగిస్తారు. ఇంగ్లిష్ వాక్య నిర్మాణం, వాక్య లోపాలను గుర్తించడం వంటివి తెలుసుకోవాలి.
ప్రిపోజిషన్స్లో పదాలు ఉపయోగించడం, వాక్యాన్ని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ద్వారా పూర్తి చేయడం వంటివి నేర్చుకోవాలి.
ఇన్, ఎట్, ఆన్, ఆఫ్, టు వాటి పదాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీటిని ఖాళీలను పూరించడం చాప్టర్లో అడుగుతారు.
పేరా జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే క్రమంలో లేని వాక్యాలను ఒక క్రమ రూపంలో పేర్చడం వంటిది. ఈ అంశం 5-6 మార్కులతో ప్రతి బ్యాంక్ పరీక్షలో ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ కోసం కొన్ని మెలకువలు తెలుసుకోవాలి.
అవి.. ఒక వాక్యం ఎలా మొదలవుతుంది, తదుపరి వాక్యానికి జోడీని ఎలా పసిగట్టాలి, వాక్యానికి ఏయే పదాలు అవసరమవుతాయి వంటి చిట్కాలు తెలుసుకోవాలి.
మంచి మార్కుల కోసం వందకు పైగా పేరా జంబుల్డ్-సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
క్లోజ్ టెస్ట్ అనేది ఒక అసంపూర్ణ వ్యాసాన్ని పూర్తి చేయడం. వ్యాసం మధ్యలో ఖాళీలను పూర్తి చేయాలి. ఖాళీలను భర్తీ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. అవి పదాలు-అర్థాలు వంటి రూపంలో ఉంటుంది. ఇది ప్యాసేజ్ లాగే ఉంటుంది. పదజాలం, వ్యాకరణ నైపుణ్యాలను అంచనా వేయడానికి ఈ అంశం ఉపయోగపడుతుంది. దీనిలో నుంచి 5-6 మార్కులు వస్తాయి. ఇది కాస్త సులభమైన అంశం అని చెప్పవచ్చు.
మెయిన్స్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజెస్‌తో పాటు 30 నిమిషాల వ్యవధిలో వ్యాస రచన, సారాంశం రచన, లెటర్ రైటింగ్ అంశాలు ఉంటాయి.
వ్యాస రచన కోసం ఇంగ్లిష్ న్యూస్పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ బాగా చదవాలి. దీనిలో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారిత, దేశంలో మౌలిక సదుపాయాల నిర్వహణ, ఆర్థిక పురోగతి, వ్యాధుల పట్ల అప్రమత్తత వంటి టాపిక్స్ చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు నీతి వాక్యాలు, వాటిపై విశ్లేషణ వంటివి కూడా బాగా చదవాలి.
ప్రిసైస్ రైటింగ్ అంటే ‘సారాంశం’ రాయడం, దీనిలో ఇచ్చిన వ్యాసం చదివి దాని సారాంశాన్ని చిన్నగా తెలియపర్చడం ఉంటుంది. వ్యాసంలోని ముఖ్యాంశాలను లేదా వ్యాస ఉద్దేశాలను వ్యక్తపర్చాలి.
లెటర్ రైటింగ్: లేఖ రచన విధానం, ఇందులో 3 రకాలు అధికారిక, అనధికారిక, లీవ్ లెటర్ వంటివి ఉంటాయి. అధికారిక లేఖ రచనలో ఒక మున్సిపల్ అధికారికి చెత్త నిర్వహణ లోపం గురించి కాని, రోడ్డు గుంతల గురించి కాని, పార్క్ నిర్వహణ గురించి కాని కంప్లయింట్ చేస్తూ లేఖ రాయడం.
అనధికారిక లేఖలో స్నేహితులకో, తల్లిదండ్రులకో లేఖ రాయడం. స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపాల్‌కు సెలవు కోసం లేఖ రాయడం.
లేఖ రచనలో తేదీలు, వ్యక్తి పేరు, అర్హతలు, హోదాలు, చిరునామా వంటివి ఎలా ప్రస్తావించాలో మెలకువలు తెలుసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మెయిన్స్‌లో ఈ మూడు అంశాలు ఆన్లైన్లోనే రాయాలి. కాబట్టి ఆన్లైన్ మాక్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రిపరేషన్
ముందుగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ సిలబస్‌ను పూర్తిగా విశ్లేషణ చేయాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ కోసం ఇంగ్లిష్ దినపత్రికలపై ఆధారపడాలి. ప్రతిరోజూ ఎడిటోరియల్ టాపిక్స్‌ను నోట్ చేసుకోవాలి. ఈ నోట్స్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ముందు తిరగేయాలి.
పదాలు-అర్థాలు, వ్యతిరేకార్థాలు వంటివి బాగా అవపోసన పట్టాలి. ఇందుకు ‘రూట్ వర్డ్స్’- వర్డ్ పవర్ మేడ్ ఈజీ పుస్తకం బాగా చదవాలి.
గ్రామర్ కంటే నాన్ గ్రామర్ టాపిక్స్ 60 శాతం ఉన్నందున ముందుగా వాటిని పూర్తి చేసుకొని తర్వాత గ్రామర్ టాపిక్స్ చదవాలి.
గత ప్రశ్నపత్రాలను చదివితే ఇంగ్లిష్‌పై అవగాహన కలుగుతుంది. తర్వాత తమ తమ సామర్థ్యాలను బట్టి సొంత స్ట్రాటజీతో ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.
ఆన్లైన్ మాక్ పరీక్షలు రోజు 1-2 ప్రాక్టీస్ చేయాలి.
బ్యాంక్ పరీక్షల్లో తరుచుగా అడిగే గ్రామర్, నాన్ గ్రామర్ రూల్స్ తెలుసుకొని వాటి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
నిత్యం బ్యాంక్ అంశాలపై బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే మంచి మార్కులు పొందవచ్చు.
రిఫరెన్స్ బుక్స్
ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్- రెన్ అండ్ మార్టిన్
వర్డ్ పవర్ మేడ్ ఈజీ- నార్మన్ లూయిస్
ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్- వికాస్, ఆర్ఎస్ అగర్వాల్
జనరల్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్- అరిహంత్ పబ్లికేషన్స్
ప్రీవియస్ ఇయర్స్ ఇంగ్లిష్ సాల్వ్డ్ పేపర్స్- దిశ
నోట్: ఐబీపీఎస్ క్లర్క్-2021 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. వెబ్సైట్ www.ibps.in లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష డిసెంబర్ 12, 19 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష విధానం, విభాగాల విశ్లేషణ, ప్రిపరేషన్ ప్లాన్ కోసం ‘నిపుణ’లో గతంలో ప్రచురించిన సంచికలను చదవండి.
ఎస్. మధుకిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ
హైదరాబాద్