జగిత్యాల, జూన్ 26 (నమస్తే తెలంగాణ): నాలుగున్నర దశాబ్దాల చరిత్ర.. వ్యవసాయ పరిశోధనా రంగంలో పేరెన్నికగన్న వైభవం.. మూడున్నర దశాబ్దాల కాలంలో ఒక్క వరిలోనే 17 రకాల విత్తనాల సృష్టి.. తెలంగాణతోపాటు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ర్టాల వరి సేద్యం గతిని మార్చిన గౌరవాన్ని దక్కించుకున్నది జగిత్యాల పరిశోధనా స్థానం. 1980లో జగిత్యాల సమీపంలోని పొలాస గ్రామ శివారులో ప్రారంభమైన వ్యవసాయ పరిశోధనా స్థానం నలభై ఐదేండ్ల ప్రస్థానంలో విప్లవాత్మకమైన ఫలితాలు నమోదు చేసింది. అనేక విత్తనాలు, వంగడాలను ఇక్కడి వాతావరణానికి అనువుగా సృష్టించి రికార్డులు తిరుగరాసింది.
నేడు రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల పరిశోధనా స్థానం సృష్టించిన సన్నాలకు సున్నా చుట్టడం, వరి బోనస్‌కు ప్రోత్సాహం అని ప్రకటించిన ఏడు రకాల్లో జగిత్యాల పరిశోధనా స్థానం విత్తనం ఒక్కటీ లేకపోవడంపై ఉత్తర తెలంగాణ రైతులు, శాస్త్రవేత్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏడు రకాల సన్నాలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఆ విత్తనాల వల్ల కలిగే లాభాలు, నష్టాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదా.. లేక ప్రైవేట్ కంపెనీలు, ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన సీడ్ కంపెనీలకు మేలు చేసేలా, తెలంగాణ రైతులను ఇబ్బందుల పాలుజేసేలా విత్తనాలు ఎంపిక చేసిందా..? అన్న అనుమానాలను రైతులు, శాస్త్రవేత్తలు వ్యక్తంచేస్తున్నారు.
జగిత్యాల పరిశోధనా స్థానంలో దొడ్డు, సన్నరకానికి సంబంధించి మొత్తం 17 రకాల వరి విత్తనాలు రూపొందించారు. అందులో ఏడు సన్న, పది దొడ్డు రకాలకు చెందినవి. జేజీఎల్-29545, జేజీఎల్-33124, జేజీఎల్-27456, జేజీఎల్-384, జేజీఎల్-1798, జేజీ3844, జేజీఎల్-3328 రకానికి చెందిన సన్న వరి విత్తనాలు రూపొందించి రైతులకు అందించారు. ఇవి అత్యంత నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. తెలంగాణ వాతావరణానికి అనువైనవి. చీడపీడలను తట్టుకొని నిలబడి అధిక దిగుబడులను ఇచ్చేవని శాస్త్రవేత్తలు, రైతులు చెబుతున్నారు. అన్నీ 125 రోజుల పంటకాలం కలిగి ఉన్నాయి. నాలుగు నెలల వ్యవధిలో పంట చేతికి వస్తుంది. ఎకరానికి 25 నుంచి 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి కచ్చితంగా వచ్చే అవకాశాలున్నాయి. కొన్నేండ్లుగా క్షేత్రస్థాయిలోనూ వీటిని పండించిన రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారని పేర్కొంటున్నారు.
నెలన్నర క్రితం కేవలం 7 రకాల వరి విత్తనాలు సాగు చేస్తేనే బోనస్ వస్తుందని రేవంత్ సర్కార్ ప్రకటించింది. బీపీటీ-5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎమ్-1638, కేఎన్ఎం-7715, డబ్ల్యూజీఎల్-44 రకాలకు వర్తింపజేస్తామని ప్రకటించారు. వాటిలో మొదటి రకం బీపీటీ-5204 వరి విత్తనం నలభై ఏండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పరిశోధనా కేంద్రంలో ఉత్పత్తి చేయబడినది. ఇది దీర్ఘకాలిక(150 రోజుల) పంటగా గుర్తింపు పొందింది. తెలంగాణ వాతావరణానికి సరైనదిగా గుర్తించబడటం లేదు. ఉల్లికోడు, సుడిదోమ, అగ్గితెగులు, ఎండు తెగులు అధికంగా సోకే ప్రమాదం ఉన్నది.
ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్ల మధ్యలో దిగుబడి వస్తుంది. మహారాష్ట్రలో సృష్టించబడిన జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనాకు సైతం అధిక తెగుళ్లు వస్తాయని, ఇక్కడి మృత్తికలకు ఇవి పూర్తిస్థాయిలో సరిపోవని పేర్కొంటున్నారు. ఈ మూడు రకాలు ఐదు నెలల పంటకాలాన్ని కలిగి ఉంటాయి. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, కేఎన్ఎం- 7715 రకాలు 125 రోజులపాటు పంటకాలాన్ని కలిగి ఉంటాయని, ఇవి సైతం ఉల్లికోడు, అగ్గితెగులును తట్టుకునే సామర్థ్యం లేవని చెబుతున్నారు.
డబ్ల్యూజీఎల్-44 రకానికి చెందిన వరి విత్తనం ఉల్లికోడును, అగ్గి తెగులును తట్టుకునే శక్తిని కలిగి ఉందని, ఇది సైతం 150 రోజుల కాలానికి చెందిన దీర్ఘకాలిక పంట అని పేర్కొంటున్నారు. డబ్లూజీఎల్-44 రకానికి చెందిన వరి రకాన్ని సాగు చేయాలంటే మే చివరి వారం నుంచి జూన్ 10వ తేదీలోపు నారు పోసుకోవాలని లేని పక్షంలో ఆ రకం విత్తనం సాగు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
బీపీటీ, డబ్యూజీఎల్, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్ వంటి దీర్ఘకాలిక రకాలు సాగు చేయమని సూచించడం వెనుకాల ఏడాదికి మూడు పంటలు సాగు చేసే పరిస్థితులు లేకుండా చేయాలన్న వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి. ఇందులో నాలుగు రకాల విత్తనాలు తక్కువ దిగుబడిని కలిగి ఉన్నవే. దీంతో రైతు విక్రయానికి తెచ్చే ధాన్యం ముప్పై శాతం వరకు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇది ప్రభుత్వంపై కొనుగోలు భారాన్ని తగ్గిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
బీపీటీ, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా రకాలను రైతులు అధిక భాగాన్ని బహిరంగ మార్కెట్లోనే విక్రయించుకొనే అవకాశాలున్నాయి. దీంతో సర్కార్ వరి కొనుగోలు అంశం నుంచి బయటకు రావచ్చునని ఆలోచిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతంలో సృష్టించబడిన బీపీటీ రకం విత్తనం, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా విత్తనాలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే విక్రయించబడుతున్నాయి.
సర్కార్‌లోని ప్రముఖులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రైవేట్ విత్తన కంపెనీలతో లాలూచీ పడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో చాలా జిల్లాల్లో రైతులు తమ విత్తనాలను తామే శుద్ధి చేసుకొని వినియోగిస్తున్నారు. ఏడు రకాల విత్తనాలను మాత్రమే ప్రభుత్వం అనుమతించడంతో ఇక్కడి రైతులు తాము స్వయంగా శుద్ధి చేసుకున్నవి.. రైతు నుంచి రైతుకు చేరే విత్తనాలపై తీవ్ర విఘాతం కలుగుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం ఏడు రకాల వరి విత్తనాల ప్రోత్సాహం అంశాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజాప్రతినిధులు కండ్లు మూసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పరిశోధనా స్థానంలో తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా సృష్టించిన ఇక్కడి వరి విత్తనాలకు ఎందుకు రాయితీ ఇవ్వడం లేదని, ప్రోత్సాహక జాబితాలో ఎందుకు లేవని ఒక్క ప్రజాప్రతినిధి ప్రశ్నించకపోవడాన్ని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధుల చేతగానితనం, అవగాహనా రాహిత్యం తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచివేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.