న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా మారనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువరాజ్‌కు ఇదే తొలి అధికారిక కోచింగ్ బాధ్యత కానుంది. 2019లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన యువీ ఆ తర్వాత అన్ని రకాల పోటీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డీసీ క్రికెట్ డైరెక్టర్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
దాదా చొరవతోనే యువీ డీసీ బ్యాటింగ్ కోచ్‌గా చేరనున్నాడు. కాగా, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ నెగ్గడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన యువీకి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మకు తను వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరించి వారిని మేటి ఆటగాళ్లుగా మార్చాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం ఫామ్ కోల్పోయిన సమయంలో యువరాజ్ సలహాలు, సూచనలు తీసుకున్నాడు.