బంజారాహిల్స్,మే 18 : సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్లి గదిలో బంధించి గదిలో రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటినుంచి అనాథ శరణాలయంలో పెరిగిన యువతి(18) ఇటీవల మరో యువతితో కలిసి కొంతకాలం పాటు ఓ హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉండేది. కాగా ఇటీవల ఉద్యోగం మానేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని మెట్రోస్టేషన్ ప్రాంతంలో ఉంటూ సినిమా షూటింగ్స్‌లో పనికి వెళ్తోంది.
ఈ క్రమంలో ఈనెల 14న తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మెట్రో స్టేషన్ వద్దకు వచ్చి సినిమా షూటింగ్ పని ఉందంటూ బైక్ మీద ఎక్కించుకుని సికింద్రాబాద్‌లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. లోనికి వెళ్లగానే అక్కడున్న మరో వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అంగీకారం లేకుండా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే అంతుచూస్తానంటూ బెదిరించాడు.
రెండురోజుల పాటు అదే గదిలో ఉన్న యువతిని ఈనెల 16న సాయంత్రం ర్యాపిడో బుక్ చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం 5కు పంపించాడు. కాగా మరుసటిరోజు స్నేహితురాలికి జరిగిన దారుణం గురించి చెప్పగా ఆమెను గాంధీ దవాఖానకు తీసుకువెళ్లింది. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.