యోగా.. ఆధునిక జీవనశైలి వ్యాధుల నియంత్రణకు సమర్థంగా సాయపడుతుంది. అందులోనూ, మధుమేహాన్ని యోగాతో అదుపు చేయవచ్చని భరోసా ఇస్తున్నారు నిపుణులు. ఆ ప్రయత్నంలో కొన్ని ఆసనాలను సూచిస్తున్నారు. దీనికి ప్రాణాయామం, ధ్యానం జోడించాలని చెబుతున్నారు.
బాలాసనం
చిన్నపిల్లలు పడుకున్న భంగిమలా ఉంటుందీ ఆసనం. ఇది రక్తంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రించేందుకు సాయపడుతుంది. ఈ తరహా రిలాక్సేషన్ యోగా వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గుముఖం పడతాయి.
సూర్య నమస్కారాలు
మధుమేహ నియంత్రణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.. సూర్య నమస్కారాలు. ఇందులో ఒక క్రమ పద్ధతిలో సాగే భంగిమలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి, ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడానికి సాయపడతాయి. సూర్య నమస్కారాల్లోని 12 ఆసనాలు మానసిక ప్రశాంతతతో పాటు దేహానికి దృఢత్వాన్ని ప్రసాదిస్తాయి.
త్రికోణాసనం
ఈ యోగాసనం టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో సాయపడుతుంది. దాదాపు పదమూడు యోగాసనాల మీద జరిగిన ఒక అధ్యయనంలో త్రికోణాసనం రక్తంలోని చక్కెర స్థాయులను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుందని తేలింది.
మయూరాసనం
వివిధ అవయవాలను సరైన ఆకృతిలో ఉంచేందుకు మయూరాసనం సాయపడుతుంది. ముఖ్యంగా రక్త ప్రసరణకు, జీర్ణ వ్యవస్థలకు సహకరించే కిడ్నీలు, క్లోమగ్రంథి, కాలేయం పని తీరును మెరుగుపరుస్తుంది. అలా, పరోక్షంగా మధుమేహాన్నీ అడ్డుకుంటుంది.