ప్రాచీన ఆలయాలను పరిరక్షించాలి
రిటైర్డ్ ఐఏఎస్, ప్రముఖ సాహితీవేత్త ముక్తేశ్వర్రావు
రామగిరి, అక్టోబర్ 30: ప్రాచీన దేవాలయాలను పరిరక్షించాలని, ఆనాటి వాస్తు శిల్పకళ భవిష్యత్తరాలకు అందించాలని విశ్రాంత ఐఏఎస్, ప్రముఖ సాహితీవేత్త నందివెలుగు ముక్తేశ్వర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్‌లోని శ్రీఛాయా సోమేశ్వరాలయ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ శనివారం ఆస్ట్రేలియాకు చెందిన అష్టావధాని తటపర్తి కల్యాణ్‌చక్రవర్తి చేసిన ఆన్లైన్ అష్టావధానంలో ముక్తేశ్వర్రావు మాట్లాడారు. ఛాయా సోమేశ్వరాలయం మహిమాన్విత క్షేత్రమని కొనియాడారు. నిత్యం శివలింగంపై ఛాయ (నీడ) ఏర్పడే దృశ్యం ఇక్కడే కనిపిస్తుందన్నారు. ఆత్మీయ అతిథి ఛాయా సోమేశ్వరాలయం చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రభు త్వం, దాతల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రముఖ చరిత్రకారుడు సూర్యకుమార్ మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం ఆర్కిటెక్చర్లోనే విశిష్ఠమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన సాహితీవేత్త డాక్టర్ వేణుగోపాల్ రాజుపాలెంతోపాటు దక్షిణాఫ్రికా, అమెరికా, న్యూజిలాండ్, జర్మనీ నుంచి కూడా పలువురు అష్టావధానంలో పాల్గొన్నారు.