ఓ మహిళా! నీ చేతులే నీ ఆయుధాలు.. నీ సమయస్ఫూర్తే నీ అంగరక్షకుడు.. నీ మనోధైర్యమే నీ రక్షణ కవచం.. పరిస్థితులు ఎలా ఉన్నా,సందర్భం ఎలాంటిదైనా కొన్ని జాగ్రత్తలు, కొంచెం అప్రమత్తత చాలు. దాడులు, ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు.ఒంటరిగా బయటికి వెళ్లినా, పొద్దు పోయే దాకా ఇంటికి చేరుకోలేక పోయినా.. సాంకేతికత తోడుగా సురక్షితంగా ఉండొచ్చు.మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఆత్మరక్షణ మార్గాల గురించి ‘జిందగీ’ ప్రత్యేక కథనం…
ఓ ‘కన్నే’యాలి
పబ్లిక్ టాయిలెట్స్, ట్రయల్ రూముల్లో నిఘా, రహస్య కెమెరాలు పెడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. పర్యాటక ప్రాంతాలు, పండుగలు, పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లినప్పుడు పరిసరాలను గమనిస్తూ ఉండాలి. హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌కు వెళ్తే వాష్‌రూంలు వాడే సమయంలో తప్పనిసరిగా పరిసరాలను నిశితంగా గమనించాలి. ట్రయల్ రూముల్లో, హోటల్గదుల్లో గోడలు, మూలలు, స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, బల్బు హోల్డర్లు, పూలకుండీలు, అలంకరణ వస్తువులు, గోడ గడియారాలు, డెస్క్ టేబుళ్లు, టేబుల్ ల్యాంప్‌లు, ఫొటో ఫ్రేమ్‌లు, స్విచ్ బోర్డులకు ఉండే స్క్రూలు.. అన్నీ నిఘా కెమెరాలు దాచేందుకు అనువైన ప్రదేశాలే. వాటిని బాగా పరిశీలించాలి. చిన్న రంధ్రాలు ఉన్నా అనుమానించాల్సిందే.
నిఘా కెమెరాల గుర్తింపు
నిఘా కెమెరాల్లోని అయస్కాంత తరంగాల వల్ల అక్కడినుంచి మనం ఎవరికైనా ఫోన్ చేస్తే కాల్ డ్రాప్ అవుతుంది. ఇక ట్రయల్ రూంలు, వాష్ రూముల అద్దాలనూ తనిఖీ చేయాలి. గదిలో లైట్లను ఆర్పేసి సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్‌తో చెక్ చేయాలి. నిఘా కెమెరా ఉంటే వాటి కటకాలపై ఫ్లాష్‌లైట్ పడి మెరుస్తాయి. ఇలా నిఘా కెమెరాలను గుర్తించవచ్చు. రహస్య కెమెరాలను గుర్తించేందుకు మార్కెట్లో, ఆన్లైన్లో ‘యాంటీ డిటెక్టర్ హిడెన్ కెమెరా’ రూ.2వేల లోపే దొరుకుతున్నది. బయటికి వెళ్లినప్పుడు దీన్ని వెంట తీసుకెళ్లటం శ్రేయస్కరం. అనుమానం ఉన్న చోట ఆన్ చేస్తే.. పరిసరాల్లో రహస్య కెమెరా ఉన్నప్పుడు డిటెక్టర్‌లో లైట్ వస్తుంది. బీప్ శబ్దం వినిపిస్తుంది.
హాక్ ఐ.. రక్షణకు సై
పౌరులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు హాక్ ఐ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిలోని ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్, ఎస్ఓఎస్ బటన్ ఫీచర్లు మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. రాత్రివేళల్లో లేదా ఒంటరిగా క్యాబ్, ఆటో, బస్, రైలు.. ఎందులో ప్రయాణిస్తున్నా సరే హాక్ ఐలోని వుమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ బటన్‌పై క్లిక్ చేసి ఆ వాహనం ఫొటో తీసి, ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు నమోదు
చేస్తే చాలు.
ఆ సమాచారం
దగ్గర్లోని పోలీసులకు చేరుతుంది. మీరు సురక్షితంగా గమ్యం చేరే వరకూ ఆయా ప్రాంతాల పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. ఆపదలో ఉన్నా, ఎవరైనా వెంబడిస్తున్నట్టు అనుమానం వచ్చినా.. హాక్ ఐలోని ఎస్ఓఎస్ బటన్‌ను క్లిక్ చేస్తే చాలు. అప్పటికే మనం ఫీడ్చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లలోని మన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఒకేసారి కాల్ వెళ్తుంది. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రదేశం సహా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందికి కూడా హెచ్చరిక చేరుతుంది.
అడుగు అడుగులో అప్రమత్తత
ఏ ప్రదేశంలోనైనా అనుమానంగా అనిపిస్తే, వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లటం మంచిది. ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు అనిపిస్తే జనం ఎక్కువగా ఉన్నచోటుకు వెళ్లాలి. ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే ఆటో, క్యాబ్ నంబర్లను కుటుంబసభ్యులు, సన్నిహితులకు షేర్ చేయాలి. రాత్రిళ్లు మాత్రమే కాదు.. పగలు కూడా ఇలా చేయడం మంచిది. కార్యాలయంలో ఉన్నా, బయట ఉన్నా నిర్మానుష్యమైన, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలకు వెళ్లకూడదు.
112 ఇండియా… డిజిటల్ అస్త్రం
విపత్కర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందడానికి ఉన్న ప్రత్యేక మార్గమే 112 యాప్. మీ స్మార్ట్ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్‌లోకి వెళ్లి ‘112 ఇండియా’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో యాప్ ఓపెన్ చేసి ‘షౌట్’ అనే బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకొంటే ఆ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు వెళ్తుంది. యాప్ లేకపోతే ఏ ఫోన్ నుంచైనా పవర్ ఆఫ్ బటన్‌ను వెంటవెంటనే మూడుసార్లు నొక్కితే ఎమర్జెన్సీ కాల్ 112కు వెళ్తుంది.
మహిళా భద్రత విభాగం వెబ్సైట్
ఎన్నారై సంబంధాలా?
ఎన్నారై సంబంధం అనగానే.. ఆలస్యం చేస్తే అవకాశం చేజారుతుందేమోనన్న ఆరాటంలో తల్లిదండ్రులు వివరాలేవీ తెలుసుకోకుండానే పెండ్లి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఎన్నారై అబ్బాయికి ఇదే మొదటి వివాహమా? అప్పటికే పెండ్లి అయ్యిందా? ఒకవేళ అయ్యుంటే విడాకులు తీసుకొన్నారా? అన్న వివరాలను స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంకా ఉద్యోగం చేస్తున్న సంస్థ, విద్యార్హతలు, వేతనం, కంపెనీ వివరాలు, ఇమ్మిగ్రేషన్ స్టేటస్, వీసా రకం, పెండ్లయ్యాక భార్యను విదేశాలకు తీసుకెళ్లే అర్హత ఉందా? కుటుంబ నేపథ్యం? మొదలైన వివరాలను మొహమాటం లేకుండా రాబట్టాలి. ఎన్నారై వివాహ కేసుల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్‌లో తెలంగాణ మహిళా భద్రత విభాగం కార్యాలయంలో ప్రత్యేకంగా ఎన్నారై సెల్ ఏర్పాటు చేశారు. కేసుల నమోదు నుంచి దర్యాప్తు వరకు ఈ సెల్ పర్య వేక్షిస్తుంది. ఎన్నారై సెల్ కేంద్ర హోంశాఖ, విదేశాంగశాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ రాయబార కార్యాలయాలు, ఎన్జీవోలతో సమన్వయంగా ఉంటూ కేసులను పర్యవేక్షిస్తుంది.
పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే
ఎవరైనా దాడికి దిగితే భయపడిపోవద్దు. ధైర్యంగా ఎదురు తిరగాలి. చేతిలో ఏది ఉంటే దానితో ప్రతిదాడి చేయాలి. అయినా పైపైకి వస్తే ఎదుటి వ్యక్తి రెండు కాళ్ల మధ్యలో మోకాలితో బలంగా తన్నాలి. వెనుక నుంచి పట్టుకొనే ప్రయత్నం చేసినా, చేతులు వేసి పట్టుకొన్నా వేళ్లను వెనక్కి విరిచేందుకు ప్రయత్నించాలి. దాడికి పాల్పడిన వ్యక్తి కండ్లలో వేళ్లతో పొడవాలి. కడుపులో, ఛాతీపై బలంగా పిడిగుద్దులు కురిపించాలి.
సామాజిక మాధ్యమాలతో
ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో మీ అప్డేట్స్, ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాలు పెట్టకపోవటం మంచిది. ఒకవేళ మీ అప్డేట్స్, చిత్రాలు షేర్ చేయాలనుకొంటే ఆ ప్రదేశం నుంచి వెళ్లిన అరగంట తర్వాత అప్డేట్ చేయటం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని అనుసరించే అవకాశం తక్కువ. సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను తరచూ మారుస్తూ ఉండాలి. వీలైనంత వరకు వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు అప్లోడ్ చేయవద్దు.
పానీయాల విషయంలో…
వేడుకల కోసం బయటికి వెళ్లినప్పుడు కూల్‌డ్రింక్స్, ఇతర పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులు, కొన్నిసార్లు స్నేహితులు ఇచ్చినా.. తాగకపోవటం మేలు.
రోడ్డుమీద…
రోడ్డుమీద ఒంటరిగా నడిచేటప్పుడు వీలైనంత వరకు సెల్‌ఫోన్ వాడకపోవటమే మంచిది. ఫోన్లో మాట్లాడుతూ పరిసరాలపై దృష్టిపెట్టకపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి ప్రయాణాలు మానుకోవాలి. తప్పనిసరైతే రద్దీగా ఉండే బస్సులను ఎంచుకోవాలి. ఒంటరిగా క్యాబ్‌లు, తక్కువమంది ప్రయాణికులు ఉండే బస్సుల్లో ఎక్కకపోవటం మంచిది.
హ్యాండ్‌బ్యాగ్ ఇలా కూడా…
బస్సులు, రైళ్లు, ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌ను చేతిలో గట్టిగా, దగ్గరగా పట్టుకొని ఉండాలి. అవసరమైతే బ్యాగ్‌తో దాడి చేయవచ్చు. మార్కెట్లో చాలారకాల పెప్పర్ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. రూ.100 నుంచి ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. బయటికి వెళ్లినప్పుడు పెప్పర్ స్ప్రేను బ్యాగ్‌లో ఉంచుకోవటం ఉత్తమం. మరీ అడుగుభాగంలో కాకుండా ఆపత్కాలంలో వెంటనే దొరికేలా మీదే పెట్టుకోవాలి. జీపీఎస్ ట్రాకర్, మొనదేలిన పెన్సిల్, చిన్న ఫోల్డింగ్ కత్తి, విజిల్, ఎలక్ట్రిక్ షాక్ పరికరం.. వీటిలో ఏదో ఒకటి తప్పక ఉంచుకోవాలి. బైక్‌పై వెళ్లేప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఎవరైనా అకస్మాత్తుగా దాడిచేసినా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
రాత్రివేళ కారు ప్రయాణమా?
రాత్రిపూట కారు ప్రయాణం తప్పనిసరైతే.. వాహనాలు ఎక్కువగా ఉన్న చోట నిలిపి ఉంచాలి. తిరిగి వచ్చినప్పుడు, వెనుక సీటును క్షుణ్నంగా పరిశీలించాకే కారులో కూర్చోవాలి. కొద్దిగా దూరమైనా సరే తెలిసిన రూట్లలోనే వెళ్లాలి. కొత్తవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ ఇవ్వొద్దు. మొబైల్‌ను చేతుల్లో ఉంచుకోవద్దు. దాడి చేసే వ్యక్తి లాక్కొనే ప్రమాదం ఉంటుంది. ఎమర్జెన్సీ నంబర్లను స్పీడ్ డయల్‌లో యాక్టివ్‌గా పెట్టుకోవాలి. వెంటనే డయల్ చేసేలా ఉండాలి. ఇబ్బందిగా అనిపిస్తే.. ఎవరికైనా ఫోన్ చేసి, కాల్ లిఫ్ట్ చేయగానే గట్టిగా అరవాలి. మీరున్న ప్రదేశాన్ని కచ్చితంగా చెప్పాలి. వీలైతే షేర్ చేయాలి. దాంతో అవతలి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి వీలవుతుంది.
షీ టీమ్స్ వాట్సాప్ నంబర్లు
యూనిట్ :వాట్సాప్ నంబర్
ఉమెన్ సేఫ్టీ వింగ్ :9441669988
హైదరాబాద్ :9490616555
సైబరాబాద్ :9490617444
రాచకొండ : 9490617111
రామగుండం :6303923700
వరంగల్ :7382294058
ఖమ్మం :9494933940
నిజామాబాద్ :9490618029
సిద్దిపేట :7901640473
కరీంనగర్ :9490795182
ఆదిలాబాద్ :8333986926
మెదక్ :6303923823
వికారాబాద్ : 9490617968
నల్లగొండ :9963393970
భద్రాద్రి కొత్తగూడెం :7901145721
సంగారెడ్డి :6301639022
కామారెడ్డి : 8985333321
నిర్మల్ :9490619043
మహబూబ్‌నగర్ : 9440713000
నాగర్ కర్నూల్ : 7901099455
సూర్యాపేట : 8332901586
మహబూబాబాద్ : 7901142009
రాజన్న సిరిసిల్ల : 7901132141
జయశంకర్ భూపాలపల్లి : 9440904747
కుమ్రంభీం ఆసిఫాబాద్ : 7901674838
జోగులాంబ గద్వాల :7993131391
జగిత్యాల :7330711080
వనపర్తి :6303923111
ములుగు :9440795241
నారాయణపేట : 7901022492
సికింద్రాబాద్ :9440700040
నాగోజు సత్యనారాయణ