Bollaram | సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ యూనిట్‌కు చెందిన ఆయుధ విభాగంలో కొన్ని ఆయుధాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఆయుధాల విభాగంలో ఉన్న నాలుగు ఏకే-47 తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు మిస్సింగ్ అయినట్లు ఆర్మీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ ఘటనపై మిలటరీ బ్రిగేడియర్ బొల్లారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయుధాలు ఎలా మాయమయ్యాయనే విషయంపై ఆర్మీ అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. తోటి అధికారికి సెలవు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయుధాలు ఎత్తుకెళ్లినట్లు ఒక కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఆయుధాలు మిస్సింగ్ కావడంతో బొల్లారం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ, సివిల్ రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బొల్లారంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లను అధికారులు మూసివేశారు.
మిస్సింగ్ అయిన ఆయుధాల కోసం ఆర్మీ అధికారులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయుధాల విభాగంలో విధులు నిర్వహించిన సిబ్బంది వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీ, రాకపోకలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.