‘ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అరుదైన కథతో తెరకెక్కించారు. ఆరేళ్లపాటు ఒక సినిమా కోసం అంకితభావంతో పనిచేయడం మామూలు విషయం కాదు’ అని అన్నారు అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. గురువారం జరిగిన ‘గామి’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వక్సేన్ కథానాయకుడిగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 8న విడుదలకానుంది. ‘నేనెవరినో..అసలు ఎక్కడి నుంచి వచ్చానో..నాకీ సమస్య ఎప్పటి నుంచి ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు’ అంటూ విశ్వక్సేన్ తనను తాను ప్రశ్నించుకునే సన్నివేశంతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
ఈ సినిమాలో మానవ స్పర్శను అనుభవించలేని అఘోర పాత్రలో విశ్వక్సేన్ నటిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టెక్నికల్‌గా వండర్‌ఫుల్‌గా ఉంది. ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు తానెవరో ఎవరికీ తెలియదని, ఆరేళ్ల పాటు ఎంతగానో శ్రమించి ఈ సినిమా తీశామని, ప్రతి తెలుగు ఫిల్మ్‌మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని విశ్వక్సేన్ అన్నారు. ఈ సినిమా విషయంలో సందీప్‌రెడ్డి వంగా ఎంతగానో సహకారం అందించారని దర్శకుడు విద్యాధర్ కాగిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.