Vishal – Dhansika | సినిమాల ద్వారా పరిచయం అయి ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో సాధారణం.అజిత్–శాలిని, సూర్య–జ్యోతిక, నయనతార–విగ్నేష్ శివన్ వంటి జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. వీరు సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విశాల్ – సాయి ధన్సిక జంట మాత్రం ఈ పాత ట్రెండ్‌కు భిన్నంగా నిలిచింది. ఈ ఇద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయినా, వారిద్దరి మధ్య 8 ఏళ్లుగా గాఢమైన ప్రేమ సాగుతూ వస్తుంది.. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ముగిసింది. త్వరలోనే పెళ్లి వేడుక జరగనుంది.
విశాల్, ధన్సిక కలిసి నటించకపోయినా… ఒక సంఘటన ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. ఈ ప్రేమ కథకు నాంది పడింది 2017లో ‘విజితిరు’ సినిమా సమయంలో. ఆ సినిమాలో సాయి ధన్సిక నటించగా, ప్రెస్మీట్లో జరిగిన ఘటన ఆమె జీవితానికే మలుపు తిప్పింది.విజితిరు ప్రమోషన్ ఈవెంట్లో వేదికపై మాట్లాడిన ధన్సిక, అందరికి కృతజ్ఞతలు చెప్పగా, టీ. రాజేందర్ పేరును అనుకోకుండా మర్చిపోయింది. దీంతో ఆయన బహిరంగంగా ధన్సికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “సీనియర్లను గౌరవించడం తెలియదా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, రాజేందర్ ఆగ్రహం చల్లబడలేదు.
ఈ ఘటన తర్వాత సినిమాటిక్ స్టైల్లో రంగంలోకి దిగిన వ్యక్తి విశాల్. ఆ సమయంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, ధన్సికకు మద్దతుగా నిలిచాడు. యువ తారలను ప్రోత్సహించాల్సిన పెద్దవాళ్లు ఇలా అవమానించడంపై తీవ్రంగా స్పందించాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య బంధం బలపడింది. అప్పటి సంఘటన తర్వాత ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. ఆపై విశాల్ – సాయి ధన్సిక 8 ఏళ్ల పాటు ప్రేమలో ఉండగా, ఈ విషయాన్ని పెద్దగా బయటపెట్టలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్తో ప్రేమకథను అధికారికం చేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టనుంది.
ఇండస్ట్రీలో కలిసి నటించకుండానే జీవిత భాగస్వామ్యంగా మారడం అరుదు. విశాల్ – ధన్సిక జంట అందుకు అద్భుతమైన ఉదాహరణ. ఇక విశాల్ ఈ బర్త్ డేకి పెళ్లి చేసుకుంటానని అనుకున్నాడు. కాని నడిఘర్ సంఘం భవనం పూర్తి కాకపోవడంతో ఎంగేజ్మెంట్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పటికీ వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పిక్స్ చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.