చెన్నై: అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి విజయ్‌కాంత్ పార్టీ వైదొలిగింది. హీరో విజయ్‌కాంత్‌కు చెందిన దేశీయ మురుపొక్కు ద్రావిడ ఖజగం (డీఎండీకే) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుదిరిన పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీట్ల పంపకం విషయంలో చర్చలు విఫలమైనట్లు విజయ్‌కాంత్ వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అన్ని జిల్లా కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు హీరో విజయ్‌కాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే కూటమి నుంచి తప్పుకోవాలని ఏకపక్షంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్‌కాంత్.. 2011లో ప్రతిపక్ష నేతగా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీకి 41 సీట్లు కేటాయించాలని అన్నాడీఎంకే కూటమిని కోరారు. ఆ ప్రతిపాదనను అన్నాడీఎంకే తోసిపుచ్చింది. వారం రోజులుగా ఇదే అంశంపై చర్చలు సాగాయి. అయినా సమస్య కొలక్కిరాలేదు. డీఎండీకే కనీసం 20 నుంచి 25 సీట్లు ఆశించింది. కానీ కేవలం 15 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు అన్నాడీఎంకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో డీఎండీకేకు ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో స్వయంగా విజయ్‌కాంత్ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పాపులార్టీ తగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి.