వాషింగ్టన్, ఏప్రిల్ 10: పాత అణ్వాయుధాల స్థానంలో ప్రవేశపెట్టదలచిన ‘న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్’ అభివృద్ధిని అమెరికా వేగవంతం చేసింది. భారీ విధ్వంసాన్ని కలుగజేసే ఈ అణు గురుత్వాకర్షణ శక్తి బాంబ్ ఉత్పత్తిని 2026లో ప్రారంభించి 2028 నాటికి వాటిని అణ్వాయుధాల స్థానంలో వైమానిక దళానికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. హిరోషియాపై వేసిన అణుబాంబ్ కన్నా ఇది 24 రెట్లు అధిక శక్తిమంతమైనది. ఒక్క గ్రావిటీ బాంబును బీజింగ్ వంటి నగరంపై వేస్తే 7,88,000 మంది మరణిస్తారని, 22 లక్షల మంది క్షతగాత్రులవుతారని నిపుణులు పేర్కొన్నారు. ఈ బాంబు పడిన అర మైలు పరిధిలో జీవులు, భవనాలు అన్నీ ఆవిరైపోతాయని, కిలోమీటరు పరిధిలో ఉన్నవన్నీ వెంటనే హతమవుతాయని తెలిపారు. రెండు మైళ్ల దూరం వరకూ ఈ బాంబు రేడియేషన్ ప్రభావం ఉంటుందని, ఆ పరిధిలోని జనం నెల రోజుల్లో మృత్యువాత పడతారని పేర్కొన్నారు.
ఆ ప్రభావం నుంచి బయటపడిన వారిలో 15 శాతం మంది ఆ తరువాత క్యాన్సర్ బారిన పడి మరణిస్తారని తెలిపారు. తొలుత ఈ బాంబ్ తొలిదశ అభివృద్ధిని 2037లో ప్రారంభించి 2050 నాటికి ఉత్పత్తి చేయాలని జాతీయ అణు భద్రతా సంస్థ (ఎన్ఎన్ఎస్ఏ) భావించింది. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన ప్రణాళికను ముందుకు జరిపింది. ప్రస్తుతం బీ61-13గా పిలిచే ఈ అణు గ్రావిటీ బాంబ్ ఉత్పత్తి న్యూమెక్సికోలోని సాండియా జాతీయ ల్యాబొరేటరీలో కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, చైనాతో అమెరికా సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఈ బాంబు ఉత్పత్తి వేగవంతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్-హమస్ మధ్య యుద్ధం ఇరాన్, యెమెన్ దేశాలకు పాకిన నేపథ్యంలో అంతటా 3వ ప్రపంచ యుద్ధాన్ని గూర్చిన భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే.