ఉలాన్బాతర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. భారత రెజ్లర్లు దీపక్ పునియా (86 కేజీలు) రజతం, విక్కీ చాహర్ (92 కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్నారు. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపక్‌కు రెండోసారి నిరాశే ఎదురైంది. అతడి ఆశలపై కజకిస్థాన్ రెజ్లర్ అజ్మత్ నీళ్లు చల్లాడు. పురుషుల 86 కేజీల ఫైనల్ బౌట్లో దీపక్ 1-6 తేడాతో అజ్మత్ చేతిలో ఓడాడు. నిరుడు ఇదే టోర్నీలో దీపక్ రజతం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2019, 20ల్లో దీపక్ కాంస్యాలు గెలుచుకున్నాడు. రజత పోరులో విక్కీ 5-3తో అజినియాజ్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గాడు. ఆదివారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ మొత్తం 17 పతకాలు కొల్లగొట్టింది.