తలమడుగు, జూన్ 25 : ఆదిలాబాద్ జిల్లా మావల హైవే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మ్యానా ఆనంద్(65), భోజనపెల్లి నారాయ ణ(45) మృతి చెందారు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామానికి చెందిన కూరగాయలు సాగు చేసుకొనే ముగ్గురు రైతులు మ్యానా ఆనంద్, భోజనపెల్లి నారాయణ, కొడప భీంరావు అదే గ్రామానికి చెందిన సలాం నగేశ్‌కు చెందిన ఆటోలో గురువారం ఉదయం 4 గంటలకు కూరగాయలు తీసుకొని ఆదిలాబాద్ కూరగాయల మార్కెట్‌కు బయలు దేరా రు.
ఈ క్రమంలో మావల హైవేపై వెనుక నుంచి కంటేయినర్ బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణ, భీంరావు, డ్రైవర్ సలాం నగేష్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నారాయణ మృతి చెందా డు. నగేశ్ రిమ్స్లోచికిత్స పొందుతుండగా, భీంరావు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మావల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆనంద్ జీవితమంతా వ్యవసాయానికి అంకితం చేశాడు. కూరగాయలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ముగ్గురు కూతుళ్లను పెంచి పెద్ద చేసి వారి పెండ్లిళ్లు కూడా చేశాడు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చిన ఆనంద్ వృద్ధప్యంలో కూడా వ్యవసాయాన్ని వదల లేదు. తనకున్న ఒక ఎకరం భూమిలో ఏటా కూరగాయలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు కష్టపడి పండించిన కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించడం ఆయన అలవాటు. గురువారం అదే పనిపై బయలుదేరాడు. కానీ.. ఆ ప్రయాణమే ఆయన చివరి ప్రయాణంగా మారింది. ఉదయం ఇంటి నుంచి వెళ్లి ఇంటి పెద్ద తిరిగి రారని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
నారాయణ తన కష్టాన్ని నమ్ముకున్న రైతు. తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో కూరగాయల సాగుతో కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న నారాయణ పెద్ద కూతురికి వివాహం జరిపించాడు. మిగిలిన ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం కష్టపడుతున్నాడు. పండించిన కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్లి మంచి ధర వస్తే కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చని ఆశతో గురువారం ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ.. వీధి వేరేలా నిర్ణయించింది. మార్గ మధ్యలో జరిగిన ప్రమాదంలో నారాయణ ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి అండతో భవిష్యత్ నిర్మించుకోవాల్సిన పిల్లలకు ఆ అండ దూరమైంది. కుటుంబ పోషణ, బాధ్యతలు, పిల్లల భవిష్యత్ ఆందోళన మధ్య నారాయణ కుటుంబం తీవ్రం విషాదంలో మునిగింది. కుటుంబం కోసం శ్రమించిన రైతు జీవితం రోడ్డు ప్రమాదంలో ముగియడం గ్రామస్తులకు కలిచివేసింది.