ముంబై: బాలిక చెంపపై ట్యూషన్ టీచర్ కొట్టింది. (Tuition Teacher Slaps Girl) దీంతో ఆమె మెదడుకు గాయమైంది. చెవుడు రావడంతోపాటు ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నది. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 5న నల్లసోపరా ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లింది. అయితే అల్లరి చేడయంతో 20 ఏళ్ల ట్యూషన్ టీచర్ రత్నా సింగ్ ఆ బాలిక చెంపపై రెండుసార్లు గట్టిగా కొట్టింది. ఆ చెంప దెబ్బకు బాలిక చెవి రింగు ఆమె బుగ్గలోకి దిగింది.
కాగా, మెదడుకు తీవ్ర గాయం వల్ల బాలికకు మొదట చెవుడు వచ్చింది. తొలుత ఆమెను స్థానిక ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ బాలికకు పది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు బాలిక పేరెంట్స్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ట్యూషన్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ నోటీస్ పంపారు. బాలిక ఆరోగ్యంపై డాక్టర్ల అభిప్రాయం తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.