ప్రజల బతుకుల్లో కష్టాలు తొలగాలి
పాలపిట్టను చూసి శుభం కోరుకునే నేల..జమ్మి ఆకును బంగారంగా పంచుకునే పల్లె..బతుకమ్మ పూలలో ప్రకృతిని కొలిచే సంస్కృతి తెలంగాణది. పండుగ అంటే పంచాంగంలో ఒక తేదీ కాదు. తరతరాల ఆత్మగౌరవం, ఆచారాల వెనుక జీవనతత్వం, ప్రజల ఆకాంక్షల సమాహారం. చెడుపై మంచి విజయం సాధించిందని విజయదశమి సంబురాలు చేసుకునే తెలంగాణలో..ప్రజల బతుకుల్లోని కష్టాలు తొలగి, రైతు కండ్లల్లో ఆనందం వెల్లివిరిసి, రాష్ట్రం సుభిక్షంగా మారినప్పుడే రాష్ట్ర ప్రజలకు అసలైన విజయదశమి.
నేటి సమాజంలో దసరా చెప్పే విజయం అంటే అవినీతిపై నిజాయితీ, పేదరికంపై అభివృద్ధి, రైతు కష్టాలపై భరోసా, ప్రజల సమస్యలపై పాలకుల బాధ్యత విజయం సాధించడం. తెలంగాణలో విజయదశమికి ప్రత్యేకమైన సాంస్కృతిక అర్థం ఉన్నది. జమ్మిచెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పరస్పరం పంచుకోవడం, పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి పల్లె సంప్రదాయంలో భాగం. బతుకమ్మలో తంగేడు పూలకు ఉన్న స్థానం, ప్రకృతితో తెలంగాణ మహిళలకు ఉన్న అనుబంధం ఈ నేల ప్రత్యేకతను చాటుతాయి.
ఈ సంప్రదాయాలకు ఆధునిక తెలంగాణ రాష్ట్ర గుర్తింపులోనూ చోటుదక్కింది. పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా, తంగేడును రాష్ట్ర పుష్పంగా గుర్తించారు. ఇవి కేవలం అధికారిక చిహ్నాలు కావు.. తెలంగాణ ప్రజల జీవనశైలికి, పండుగలకు, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతిరూపాలు.. రాష్ట్ర అధికారిక చిహ్నాలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక అస్తిత్వం కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అస్తిత్వాన్ని ప్రభుత్వ గుర్తింపులో ప్రతిబింబించడం కూడా ముఖ్యమే.
తెలంగాణ సంస్కృతిని రాష్ట్ర అధికారిక గుర్తింపులో భాగం చేయడంపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రత్యేక దృష్టి కనిపించింది. రాష్ట్ర చిహ్నాల ఎంపికలో స్థానిక ప్రకృతి, పండుగలు, సంప్రదాయాలకు ప్రాధాన్యం లభించింది. తెలంగాణ సోయి అంటే కేవలం యాసలో మాట్లాడటం కాదు..ఈ నేల చరిత్రను, ఇక్కడి ప్రజల ఆచారాలను, వారి ఆత్మగౌరవాన్ని గుర్తించడం. సంస్కృతి పరిరక్షణను పండుగల నిర్వహణతోనే కొలువలేం. పల్లెల్లో చెరువులు ఎప్పుడూ నీటితో కళకళలాడుతుండాలి. జమ్మిచెట్లు, తంగేడు మొక్కలు పెరగాలి. జానపద కళాకారులకు ఆదరణ ఉండాలి. బతుకమ్మ పండుగ జరుపుకునే చెరువులు కాలుష్యానికి గురికాకూడదు. ప్రకృతి ఆరాధన వెనుక ఉన్న పర్యావరణ స్పృహ ఆచరణలో కనిపించాలి. అదే తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి నిజమైన గౌరవం. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి.
తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. వర్షాలు, చెరువులు, సాగునీరు, భూగర్భ జలాలు.. ఇవన్నీ రైతు జీవితాన్ని నిర్ణయించే అంశాలు. పండుగకు కొత్త బట్టలు కొనాలన్నా, పిల్లలకు మిఠాయిలు తేవాలన్నా, అప్పులు తీర్చాలన్నా రైతు చేతికి పంట డబ్బు రావాలి. పొలంలో పంట లేకపోతే పండుగ ఇంటి గడప దాటినా..ఆ కుటుంబంలో ఆనందం నిలువదు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంపై ఆందోళనలు, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సవాళ్లు విసురుతున్నాయి.
అయితే ఎల్ నినో ఉన్న ప్రతిసారీ కరువు తప్పదని చెప్పలేం. వర్షపాతం ప్రాంతాల వారీగా మారుతుంది. అందుకే వాతావరణ మార్పులను ముందుగా అంచనా వేయడం, నీటిని పొదుపుగా వినియోగించడం, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు ఇవ్వడం, పశువులకు మేతనీటి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడే పాలకుల పనితీరుకు అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం పాస్ మార్కులు కూడా రావడం లేదు. ఎవరైనా సంక్షోభం వచ్చిన తర్వాత సమీక్షలు నిర్వహిస్తారా? మన ముఖ్యమంత్రి అచ్చం అదే చేస్తున్నారు. ఆయనకు ముందస్తు ప్రణాళికల్లేవు. గ్రామస్థాయిలో అప్రమత్తత అంతకన్నా లేదు. విద్యుత్తు సరఫరా, తాగునీటి భద్రత, పంట నష్టపరిహారం ఏవీ లేవు. అంతా భబ్రజమానం, భజగోవిందం.
రాష్ర్టానికి పట్టిన శని కాంగ్రెస్ ప్రభుత్వమేనని అంతిమంగా అందరికీ అర్థమైంది. కరువు ప్రకృతి సవాలు కావచ్చు.. కానీ కరువు సమయంలో రైతును ఆదుకోవడం పాలకుల బాధ్యత. అది మరిచిపోయి వ్యవహరిస్తున్నదీ ప్రభుత్వం. అందుకే రెండో పంటలు వేయొద్దని రైతులను ఆదేశిస్తున్నది. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, రైతులకు అండ, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి, పేదలకు గౌరవప్రదమైన జీవితం..ఇవన్నీ నేటి కాంగ్రెస్ పాలనలో కరువయ్యాయి.
పాలకులు మారవచ్చు..పార్టీలు మారవచ్చు..కానీ ప్రజల బతుకులు బాగుపడాలన్న లక్ష్యం మాత్రం మారకూడదు. జమ్మిచెట్టు సాక్షిగా పంచుకునే బంగారం మనుషుల మధ్య ఆప్యాయతకు ప్రతీక కావాలి. పాలపిట్ట రెక్కలపై కనిపించే రంగులు భవిష్యత్తులో ఆశలకు ప్రతీక కావాలి. ఎండిన పొలాల్లో మళ్లీ పచ్చదనం పరచుకోవాలి. రైతు ఇంట్లో అప్పుల ఆందోళనకు బదులు పంట ఆనందం వెల్లివిరియాలి. ప్రతి పేదింటా పండుగ వెలుగులు నిండాలి. ప్రజల బతుకుల్లో చీకట్లు తొలగి, కష్టాలు కరిగి, ఆశలు నెరవేరినప్పుడే అసలైన విజయదశమి. ప్రజల ఆకాంక్షలకు అడ్డుగా నిలిచే ప్రతీ వైఫల్యం, నిర్లక్ష్యం, అన్యాయం అనే శని వినాశనం కావాలి. ప్రజలు విజయులు కావాలి. బాపూ విజయం కోసం ఈ విజయదశమి వేళ జమ్మి చెట్టు సాక్షిగా ఆకాంక్షిద్దాం!
(వ్యాసకర్త: రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు)
మంత్రి శ్రీదేవి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

