‘ఆడలేక మద్దెల ఓడన్నట్టున్నది సంటర్ సర్కారు సంగతి. మోక మీదికొచ్చినంక చేతులెత్తేస్తే.. రైతులు, రాష్ర్టాలు ఆళ్లదాళ్లే కొట్టుకసత్తరన్నట్టు ముందుగాళ్లనే ప్లాన్ చేసుకున్నట్టున్నది. అందుకోసమే వడ్లు కొనమంటే కొనమని మొండికేస్తున్నది.
ఇగ ఆ సంటర్ సర్కారుకు వంతపాడే (‘బాప్ ఏక్ నంబరీ బేటా దస్ నంబరీ’) రాష్ట్రంలున్న బీజేపీ లీడర్లు సిన్నోళ్లా..? ‘అగో పులి అంటే, ఇగో తోక’ అంటున్నరు. ఈళ్ల వల్ల పాపం రాష్ట్రంలున్న రైతులు ఆగం గావట్టిరి. ‘అన్నదమ్ములు సక్కగుంటె అవుతలోనికి కళ్లమంటన్నట్టు’.. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల మజ్జన ఉన్న సఖ్యతను సూడలేక కండ్లు మండిచ్చుకుంటున్నరు. రైతులకు, ప్రభుత్వానికి దూరం పెంచే కుట్రలు జేస్తున్నరు. వానకాలం వడ్లు కొనమని ముందుగాళ్లనే చెప్పాలె కదా..? మోక మీదికచ్చినంక ‘మీ వడ్లు కొనమంటే కొనం’ అని చేతులెత్తేస్తున్నది. వేరే రాష్ట్రపొల్ల వడ్లు కొనుకుంటా తెలంగాణ రైతుల పట్ల కోపం సూపిత్తున్నది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేటందుకేనని పసివోరన్ని నిద్ర లేపడిగినా పట్టు తప్పకుండా సెప్తడు. సంటర్ సర్కార్ ఆడుతున్న డ్రామా సూత్తుంటే నాకు సిన్నప్పటి, మా ఊరి దళారోడి ఆట యాదికొస్తున్నది.
మా ఊళ్లే ఓ దళారి ఉంటుండె. మా ఊరి వడ్లన్నీ ఆ దళారే కాంటాకు జోకుతుండె. ఇగ మా బాపు రామసామి మాటకొస్తే.. మాకున్నది ఎకురం భూమి. ఆ ఎకురంల పండిన వడ్లళ్ల ఇన్ని తిండికుంచుకోంగ మిగిలినయి ఆ దళారోనికే అమ్ముతుంటిమి. ఎందుకంటే ఆ దళారోనికి ఓ దుక్నం కూడా ఉంటుండె. లాగోడి కాన్నుంచి, వడ్లు కాంటాకు వెట్టేదాన్క ఉప్పుకు, పప్పుకు ఆ దళారోని దగ్గరికే పోతుంటిమి.
ఓసారి ఇట్లనే వానకాలం పంట కోతకచ్చింది. అప్పుడు ఈ ట్రాక్టర్లున్నయా, వరికోత మిషిన్లున్నయా.. ఎడ్లతోనే ఎవుసం జేసుడాయె.! మనుషులే మర యంత్రాలాయె…! ఆ ఎడ్లకు తోడు అమ్మాబాపు రెక్కల కట్టం. నలుగురు మనుషుల వెట్టి వరి కోపిచ్చి, అల్గం పెట్టి, వడ్లు దుల్పి, తూర్పారా వట్టినం. వడ్లు వట్టుడంటె ఎట్లనుకుంటుర్రు? ‘గాడ్పచ్చినప్పుడే తూర్పార వట్టాలె’. వడ్లను శాట్లల్ల వెట్టుకొని గాడ్పు కోసం గోసగోసోలె సూత్తుండె మావోళ్లు. గాడ్పస్తున్నదంటే సాలు శాట బాపు చేతికిస్తుండె అమ్మ. మూన్నాలుగు రోజుల బాగోతమది. ఎంత వట్టినా వడ్లు దంగకపోయేటియి. అసలే వానకాలమాయె ఏడ వానత్తదోనని అమ్మ వడే తపన ఎట్లుండెనో! ఇప్పుడు యాదికొత్తే సాలు కండ్లపొంటి నీళ్లుగారుతయి. ఈ గోసిట్లుంటె.. వడ్లమ్ముడో సవాల్. ‘రేపన్నా ఆ దళారోడొస్తడానయ్యా..’ ‘అస్తెరానియ్యి, లేకంటె ఆ వానల్నే నాననియిపో వడ్లు.. మరేం జేత్తం’ అని బాధవడుకుంటా ముచ్చట వెట్టుకునేటోళ్లు అమ్మాబాపు.
వడ్లు కొనుమని ఆ దళారోని దగ్గరికి వోతె, వాడు ‘రేపత్త, మాపత్త’ అని నాట్కాలాడుతుండె. రాకరాక ఓ రోజొచ్చి, ‘వడ్లళ్ల మొత్తం తాలే ఉన్నది, మళ్ల వట్టుర్రనుకుంటా’ భూమి జాగలెక్కువున్నోళ్ల దగ్గరికి, పేరు పతారున్నొళ్ల సుట్టే తిరుగుతుండె. అందరియి కొన్నంక ఆఖర్కి మాయి కొంటుండె. వాన కొట్టకుంటే మా అద్రుట్టం. లేకుంటే అమ్మాబాపుల కట్టం సెమ్ట రూపంలో ఆ వానల్నే కలుస్తుండె.
ఇప్పుడు వడ్లను కొనుమంటే సంటర్ సర్కార్ ఆడుతున్న నాట్కాలను చూస్తుంటే అచ్చం అప్పటి దళారోడే గుర్తుకొస్తున్నడు. ఇగ రాష్ట్రంల ఓ కొత్త బిచ్చగాడు మోపైండు. బిచ్చగానికి కొత్త గిన్నిస్తే కోడి కూయకముందే ‘అమ్మా.. అన్నం’ అని అరుస్తడు. ఏం మాట్లాడిన దొరింపుగాని ముచ్చటే. నోటికచ్చింది వాగుతూ కన్నారాన్ని బజారుకీడుస్తున్నడు. ‘ముఖ్యమంత్రి’ పదవి ఎంత పెద్దదో..ఆ పదవికైనా ఇలువియ్యాలె గదా.., ముఖ్యమంత్రిని వట్టుకొని ఎటువడితే అటే మాట్లాడుతున్నడు. సరే ఆ మాట్లాడిందేమన్న సక్కగ అర్థమైతదా అంటే అదీ కాదు.
సంటర్ సర్కారోళ్లు డ్రామాలాడినంత మాత్రాన రాష్ట్ర సర్కారు రైతుల్ని ఇడిసిపెడుతదా.. వాళ్లు కొనకున్నా పండిన వడ్లను నీళ్లపాల్జెయ్యది. బాజాప్తా కొంటది. గని ఈ తాప ఎట్లనో ఎల్లదీసుకుందాం. కని వచ్చేడు గురించైనా ఆలోచించుర్రి. సంటర్ సర్కార్, ఇక్కడి కాషాయ నేతల మాటల్ని వట్టించుకుంటే ‘కుక్క తోకను వట్టుకొని గోదారీదినట్టే..’ అందుకే ఇక్కడి సర్కార్ చెప్తున్నట్టు తీరొక్కతీరు పంటలేసుకుంటా తిరంగుందాం.. రైతును ‘ఉన్నోడిని’ చేయాలనేది కేసీఆర్ తపన. ఇత్తునాలు, మందుల కొరత లేకుండా చేసిండ్రు. కరెంటు, నీళ్ళకు తిప్పల్లేవు. ‘రైతు సమితి’లను పెట్టిండ్రు. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నరు. ఒక పద్ధతి ప్రకారం ఎవుసాన్ని లాభసాటి చేస్తున్నరు. ఉడికేదాక ఉండి, ఉమ్మగిల్లే యాల్ల ఆగం గావద్దు. కేసీఆర్ సార్ చెప్పినట్టు నడుద్దాం.
గడ్డం సతీష్
99590 59041