Trikaala | శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న అనేక ఆధ్యాత్మిక రహస్యాలను, నమ్మకాలను ఆధారంగా చేసుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించారు. రాధిక మరియు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ వైవిధ్యభరిత చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్ LLP సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. టాలీవుడ్లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టి, ఆ తర్వాత ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రద్ధాదాస్, ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని సరికొత్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ప్రధాన పాత్రను పోషించారు. ఆమెతో పాటు ‘మాస్టర్’ ఫేమ్ మహేంద్రన్, ప్రముఖ నటుడు అజయ్, సీనియర్ నటి ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు సోషల్ మీడియాలో మరియు ప్రేక్షకుల్లో ఊహించని రీతిలో భారీ స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో అత్యంత సహజంగా, భీతి గొలిపేలా రూపొందించిన విజువల్స్, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఒక సాధారణ హారర్ డ్రామాగా కాకుండా, ఈ ప్రపంచంపై ఒకానొక సమయంలో చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగుగా అవతరించే ఒక అద్భుతమైన దైవిక శక్తికి, అతీత శక్తులకు మధ్య జరిగే సస్పెన్స్భరిత పోరాటంగా ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ‘త్రికాల’ అనే విలక్షణమైన టైటిల్ సైతం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక హాట్ టాపిక్‌గా మారి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందింది. సినిమాలో ఉపయోగించిన హైఎండ్ VFX గ్రాఫిక్స్, గ్రాండ్ విజువల్స్ మరియు పవన్ చెన్న అందించిన అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు మరింత గ్రాండియర్‌ను, రిచ్‌నెస్‌ను తీసుకువచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’, ‘స్పిరిట్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా, షాజిత్ హుమాయున్ అందించిన వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, ఇది సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని “అమ్మ” సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా భావోద్వేగానికి గురిచేస్తూ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఈ చిత్రం గురించి దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ, సనాతన ధర్మంలోని కొన్ని కీలకమైన ఆధ్యాత్మిక అంశాలను నేటి తరం మెచ్చేలా సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో మిళితం చేసి రూపొందించామని, శ్రద్ధాదాస్ అద్భుతమైన నటన, మాస్టర్ మహేంద్రన్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ క్యారెక్టర్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే నిర్మాతలు సైతం సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు థ్రిల్ సమ్మేళనంగా తెరకెక్కిన ‘త్రికాల’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడవడం విశేషం. శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి అశోక్ దయ్యాల పీఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు, భారీ విజువల్ వండర్స్‌తో మే 28న విడుదల కానున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.