న్యూఢిల్లీ, జూలై 29: పూరిలోని జగన్నాథ ఆలయం రత్న భండార్‌లో రహస్య గది ఏదీ లేదని భారత పురావస్తు శాఖ నిర్వహించిన సర్వే (ఏఎస్ఐ) తేల్చింది. ఏఎస్ఐ ఇటీవలే రత్న భండార్ పునరుద్ధరణ, మరమ్మత్తు పనులను పూర్తిచేసింది. వీటి వివరాలను మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వివరిస్తూ, రత్న భండార్‌లో రహస్య గదులు, చాంబర్లు ఏవీ లేవని వెల్లడించింది. ఈ విషయాన్ని జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సర్వే ఆధారంగా నిర్ధారించినట్టు ఏఎస్ఐ తెలిపింది. ‘రత్న భండార్ (ఖజానా) అనేది రెండు చాంబర్లను కలిగి ఉంది. విలువైన బహుమతులను భద్రపర్చేందుకు వీటిని ఏర్పాటుచేశారు. ఈ రెండు గదులను పరిశీలించిన తర్వాత గోడల లోపల, నేల కింద ఏవైనా రహస్య గదులు, అల్మారాలు ఉన్నాయా? అన్నదానిపై సెప్టెంబర్ 2024 జీపీఆర్ సర్వేతో నిర్ధారించుకున్నాం’ అని ఏఎస్ఐ తెలిపింది.
వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా.. ; స్మార్ట్ గ్లాస్‌ను తయారుచేసిన ఐఐటీ-ఇండోర్
ఇండోర్, జూలై 29: భవనాలు వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఉండేందుకు దోహదపడే ‘స్మార్ట్ గ్లాస్’ను ఐఐటీ-ఇండోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పర్యావరణ అనుకూల భవనాలను నిర్మించడంలో ఇది అత్యంత సహాయకారిగా ఉంటుందని ఐఐటీ-ఇండోర్ అధికారులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీలో కీలక పదార్థం ‘వయలోజెన్ ఆధారిత పోరస్ ఆర్గానిక్ పాలిమర్’ (పీవోపీ) కొత్తగా అభివృద్ధి చేసినదిగా వారు పేర్కొన్నారు. ‘భవిష్యత్‌లో వయలోజెన్ ఆధారిత పాలిమర్లు స్మార్ట్ హోమ్స్, పర్యావరణ అనుకూల భవనాలలో సర్వ సాధారణం అవుతాయి. విద్యుత్తు బిల్లును తగ్గించటంలో, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి’ అని తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఒక ఎలక్ట్రానిక్ కర్టెన్ గ్లాస్ రూపొందించటంపై దృష్టి పెట్టింది. అవసరమైనపుడు సూర్యరశ్మి, వేడిని భవనం లోపలికి, బయటకు పంపుతుంది. దీంతో ఏసీ, కృత్రిమ లైటింగ్ వాడకాన్ని తగ్గిస్తుంది’ అని వర్సిటీ అధికారి ఒకరు వివరించారు. పారిశ్రామికంగా స్మార్ట్ గ్లాస్ తయారీపై పరిశోధకులు పరిశ్రమ వర్గాలతో మాట్లాడుతున్నట్టు తెలిసింది.