హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మీ వాహనం పోయిందా? పోలీసులకు ఫిర్యాదు చేశారా? చేస్తే.. మీ వాహనం దొరికే చాన్సుంది. హైదరాబాద్‌లోని పలు చౌరస్తాల్లో ఏర్పాటుచేసిన ఇం టెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) కెమెరాల సహాయంతో పోలీసులు దొంగ వాహనాలను పట్టేస్తున్నారు. వాహనం పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేసి వా హనం నంబర్‌ను ట్రాఫిక్ ఈ చలాన్ విభా గం సర్వర్‌లో సీసీఆర్బీ (సిటీ క్రైమ్స్ రి కార్డు బ్యూరో) ద్వారా అప్లోడ్ చేస్తారు.
సర్వర్‌లో నంబర్ ఫీడ్ అయ్యింది మొద లు.. ఐటీఎంఎస్ సీసీ కెమెరాల నిఘా ఆ దొంగ వాహనాలపై పడుతుంది. ఆ కెమెరాలు ఉన్న చౌరస్తా నుంచి వాహనం వెళ్లిందంటే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్‌కు అలర్ట్ వచ్చేస్తుంది. ‘వెంటనే ఫలానా చౌరస్తా నుంచి ఫలానా నంబర్ వాహనం వెళ్తున్నది.. వెంటనే ఆ వాహనాన్ని పట్టుకోండి’ అని తరువాతి చౌరస్తాలో ఉండే పోలీసులను అప్రమత్తం చేస్తారు. అలా.. పోలీసులు దొంగ వాహనాన్ని, దొంగిలించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొంటున్నారు. ప్రస్తుతం ఐటీఎంఎస్ కెమెరాలను పోలీసులు నగరంలోని చాలా చౌరస్తాల్లో ఏర్పాటు చేసి, దొంగ వాహనాలపై నిఘా పెడ్తున్నారు.