ఖైరతాబాద్, జనవరి 22 : మూడు దశాబ్దాలుగా ఆ బస్తీ వాసులు మురుగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. గతంలో వ్యర్థ జలాలను ఎస్టీపీకి పంపించి.. అక్కడ శుద్ధి జరిగిన తర్వాత సాగర్లో కలిపారు. అయితే, లోతట్టు ప్రాంతంగా ఉన్న బీఎస్ ముక్తా, ఎంఎస్ మక్తాలో నీటిని తోడాలంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. 30 ఏండ్ల క్రితం బావిని ఏర్పాటు చేసి, దానికి మోటార్లు అమర్చి తద్వారా మురుగునీటిని పంపింగ్ చేశారు. ప్రస్తుతం 30 వేలకు పైగా జనాభా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ మోటార్ల సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో వర్షం పడినప్పుడల్లా మురుగునీరు ముందుకు వెళ్లలేక వెనక్కి వచ్చి బస్తీ మొత్తం జలమయమయ్యేది. ఈ ప్రాంతం నుంచి నీటిని బయటకు పంపించాలంటే మోటార్లు మాత్రమే పరిష్కారమని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి తీసుకెళ్లగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. రూ.33 లక్షలు మంజూరు చేయించగా, అధిక సామర్థ్యం కలిగిన నాలుగు 35 హెచ్పీ మోటార్లను అమర్చారు. దీంతో లోతట్టు ప్రాంతంలోని రెండు బస్తీలకు శాశ్వత పరిష్కారం లభించింది.
మోటార్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం..
సోమాజిగూడలోని పంపింగ్ హౌజ్లో రూ. 33లక్షల వ్యయంతో నూతంగా ఏర్పాటు చేసిన రెండు భారీ మోటార్లను శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంఎస్ మక్తా ప్రజలు చాలా కాలంగా మురుగు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ మోటార్ల ఏర్పాటుతో సమస్య తీరిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నదన్నారు. అర్హులైన వారందరికీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, డివిజన్ అధ్యక్షుడు ఎస్కే అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు సాధిక్, నాయకులు ఖుర్షీద్, అహ్మద్ అలీ, ఎండీ అబేద్, సలీం, ఆజాం, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.