అణగారిన వర్గాల ఆవేదన, వారి గుర్తింపు కోసం జరిగే పోరాటమే ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడు. ఒక సమాజం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటాన్ని ఈ సినిమా ప్రతిబింబించింది. స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ను పోలిన శంకరన్న పాత్రలో ప్రియదర్శి మెరవడంతో ఈ సినిమా మరింత ఊపందుకున్నది. తెలంగాణ అంటేనే పోరాటాలకు పుట్టినిల్లు. నిజాంను గద్దె దించాం. వలస పాలన నుంచి స్వేచ్ఛను సాధించాం. అలాంటి పోరాటాలను మళ్లీ గుర్తు చేసింది ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో చూపించిన ‘సవారీ’ సమాజం ఒక కల్పిత నేపథ్యానికి చెందినదే అయినా.. గుర్తింపు లేకుండా, అధికార వ్యవస్థకు కనిపించకుండా జీవించే అనేక అణగారిన వర్గాలకు అది ఒక ప్రతీక. ఎవరికైనా ఉనికిపై హకు లేకపోతే వారి జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నను ఈ సినిమా ముందుకు తెచ్చింది.
ఈ నేపథ్యంలో నాని పోషించిన జడల్ పాత్ర వ్యక్తిగత అవమానాల నుంచి ప్రారంభమై క్రమంగా తన సమాజం కోసం పోరాడే స్థాయికి ఎదుగుతుంది. ఒక వ్యక్తి కథ సామూహిక పోరాటంగా మారడం ఈ కథలోని ప్రధానమైన అంశంగా చూడవచ్చు. ‘జడల్’ అనే పేరుకు కూడా ప్రత్యేకమైన భావోద్వేగ నేపథ్యం ఉన్నది. ఈ రూపం పాత్రకు కేవలం ప్రత్యేకమైన గెటప్గా కాకుండా కుటుంబం, అనుబంధం, జ్ఞాపకం, బాధ్యతలకు ప్రతీకగా నిలుస్తుంది. జడల్ తన వ్యక్తిగత జీవితాన్ని దాటి, తన చుట్టూ ఉన్న సమాజం ఎదురొంటున్న అన్యాయాన్ని గుర్తించినప్పుడు అతని పోరాటానికి మరో అర్థం వస్తుంది.
తెలంగాణ చరిత్రను పరిశీలించినప్పుడు అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన అనేక పోరాటాలు కండ్లకు కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో సమ్మక-సారలమ్మల పోరాట గాథ ప్రజల సామూహిక సృ్మతిలో ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజల కోసం నిలబడటం, హకులను కాపాడుకోవడం, ఆత్మగౌరవాన్ని వదులుకోకపోవడం వంటి భావనలు ఈ చారిత్రక గాథల్లో కనిపిస్తాయి. ‘ది ప్యారడైజ్’లో సవారీలు చేసే పోరాటాన్ని ఈ చారిత్రక పోరాటాల స్ఫూర్తితో పోల్చి చూడొచ్చు. ఇందులో సమ్మక్క సవారీల గుర్తింపు కోసం ఏండ్లుగా పోరాడుతున్న సందర్భంలో తన తల్లి పోరాటానికి జడల్ తోడైన సందర్భాన్ని నాటి సమ్మక-సారలమ్మ తెగువ కనిపిస్తుంది. ఆ వీరవనితల త్యాగాన్ని ఈ సినిమా రూపంలో డైరెక్టర్ మనకు గుర్తుచేశారు.
కాకతీయుల వారసత్వం, సమ్మక-సారలమ్మ పోరాటం, రైతాంగ పోరాటాలు, రాష్ట్ర సాధన వరకు అస్తిత్వమే ఉద్యమ నినాదం. పోరాటాల సందర్భాలు వేర్వేరైనా, హకు, గుర్తింపు, జీవన విధానానికి గౌరవమే ఒక నిరంతర భావనగా కనిపిస్తుంది. మన పలుకుబడుల బాషలో, జానపద పాటలతో నిఖార్సయిన తెలంగాణ సినిమా తీసిన డైరెక్టర్ ఈ గడ్డ రుణం తీర్చుకున్నారని అభినందనలు అందుకుంటున్నారు. అదేవిధంగా ‘చావునోట్లే తలకాయ పెట్టి మీకు గుర్తింపు తీసుకొస్తా’ డైలాగ్ వెనుక రాష్ర్టాన్ని సాధించిన తొలిముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తి కనిపిస్తుంది.
కేసీఆర్ను పోలిన శంకరన్న పాత్ర, రూపకల్పన కూడా తెలంగాణ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. మొన్నటివరకు వినాయక నిమజ్జనాల్లో ‘సార్’ పాటలే, నేడు థియేటర్లలో ‘సార్’ డైలాగులే. తొమ్మిదిన్నరేండ్ల పాటు రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ‘సార్’ను కాదని ఢిల్లీ పార్టీకి ఓటేస్తే ‘మాలిక్’ చేతిలో చితికిపోతున్న సవారీల బతుకులైతున్నయంటూ సామాన్యులు రోదిస్తున్నారు. మరోవైపు రకరకాల అక్కసులతో విషప్రచారం చేసిన వాళ్లంతా సినిమా కలెక్షన్లు చూసి నోరెళ్లపెడుతున్నారు. ఎవరెన్ని మాయోపాయాలు చేసినా, అధికారంలో ఎవరున్నా ‘ది ప్యారడైజ్’లో జడల్ జమానా.. తెలంగాణలో కేసీఆర్ హవానే నడుస్తున్నది.
– జై తెలంగాణ