S. Janaki : భారతీయ చలనచిత్ర రంగాన్ని తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు ఏలిన ‘దక్షిణ భారత గాన కోకిల’ ఎస్. జానకి (88) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, శనివారం కర్ణాటకలోని మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. కొడుకు దూరమైన కొన్ని నెలలకే జానకమ్మ కూడా కన్నుమూయడంతో సంగీత లోకంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది.
జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన మేనమామ, ఆమెను మద్రాసు (చెన్నై) తీసుకువెళ్లారు. అది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1957లో ‘విధియిన్ విలైయాట్టు’ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆమె, అదే ఏడాది ‘ఎమ్మెల్యే’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
Her voice defined generations. Her legacy is eternal. Rest in Peace, S. Janaki mam.🕊️#SJanaki #RestInPeace #LegendForever #IndianMusic #MusicalLegend pic.twitter.com/90QyXtAax9
— Lahari Music (@LahariMusic) July 11, 2026
తెలుగు మాతృభాష అయినప్పటికీ జానకి కేవలం ఒక భాషకే పరిమితం కాలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా దాదాపు 20కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో 48,000 కంటే ఎక్కువ పాటలు పాడి రికార్డు సృష్టించారు. మైమరపించే మెలోడీలు, ఉరకలెత్తించే మాస్ పాటలు, భక్తి గీతాలు.. ఇలా ఆమె పాడని జానర్ లేదు.
పాటలో భావాన్ని పలికించడంలో, వెండితెరపై నటి హావభావాలకు అనుగుణంగా స్వరాన్ని మార్చడంలో జానకమ్మకు ఆమే సాటి. చిన్న పిల్లల గొంతును సైతం అలవోకగా అనుకరిస్తూ ఆమె పాడిన పాటలు శ్రోతలను అబ్బురపరిచాయి. అందుకే పరిశ్రమ ఆమెను ప్రేమగా ‘క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ అని పిలుచుకునేది.
A voice that became the heartbeat of Indian cinema is now immortal. 💔
Legendary playback singer S. Janaki (1938–2026) leaves behind an unmatched musical legacy…
🎤 Sang 48,000+ songs across 20+ languages over a career spanning 6 decades.
🏆 4 National Film Awards for Best… pic.twitter.com/xEpZrl4ZZg
— Arun Kumar 🇮🇳💰 (@Oye_arunkumar09) July 11, 2026
ఎస్. జానకి కెరీర్లో సంగీత దర్శకుడు ఇళయరాజాతో చేసిన ప్రయోగాలు ఒక చరిత్ర. అలాగే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళగీతాలు భారతీయ సినీ సంగీతంలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఎం.ఎస్. విశ్వనాథన్ నుండి ఏ.ఆర్. రెహమాన్ వరకు ప్రతి ఒక్కరి దర్శకత్వంలో ఆమె క్లాసిక్స్ అందించారు.
I Can Never Get Bored Of Listening To This Masterpiece
~Spb sir ..janaki amma 😩❤️✨ . . pic.twitter.com/TMIZ56rC8G
— Elisa das ⚡ (@Elisa_das_) July 11, 2026
దిగ్గజ గాయని ఎస్. జానకి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. ఆమె అద్భుత గాత్రానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు సార్లు ‘ఉత్తమ నేపథ్య గాయని’గా జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి. 1977లో భారతీరాజా దర్శకత్వం వహించిన ’16 వయదినిలేస (16 ఏళ్ల వయసు) చిత్రంలో ఇళయరాజా సంగీతంలో పాడిన “సెంధూర పూవే” అనే తమిళ పాట జానకమ్మ కెరీర్లో మొదటి జాతీయ అవార్డును అందించింది. ఆ తర్వాత 1981లో ‘ఒప్పోల్’ సినిమాలోని “ఎట్టుమానూర్ అంబలత్తిల్” అనే మలయాళ క్లాసికల్ మెలోడీకి రఘునాథ్ సేథ్ సంగీతం అందించగా, జానకి తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసి రెండోసారి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇక 1984లో వంశీ-ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘సితార’ చిత్రంలోని “వెన్నెల్లో గోదారి అందం” అనే గీతం తెలుగు సినీ చరిత్రలోనే ల్యాండ్‌మార్క్ మెలోడీగా నిలిచి, ఆమెకు మూడో జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. చివరగా 1992లో కమల్ హాసన్ నటించిన ‘దేవర్ మగన్’ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన “ఇంజి ఇడుప్పళగా” అనే తమిళ పాటలో జానకమ్మ పలికించిన వాయిస్ మోడ్యులేషన్, హావభావాలకు గాను ఆమె నాలుగోసారి జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ నాలుగు కాలాతీత గీతాలు భారతీయ సినీ సంగీత చరిత్రలో జానకమ్మ ముద్రను శాశ్వతం చేశాయి.
From the Editor’s Desk. 🖊️
Filmfare’s Editor-in-Chief, Jitesh Pillai reflects on the extraordinary legacy of legendary playback singer S. Janaki, a voice that transcended languages, generations and emotions, leaving behind melodies that will continue to echo through time. 🤍… pic.twitter.com/mZpfaKLweM
— Filmfare (@filmfare) July 11, 2026
ఆమె ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డులతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. మైసూరు విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అయితే, 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించగా, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని, తన సుదీర్ఘ సేవలకు ‘భారతరత్న’ మాత్రమే సరైనదని పేర్కొంటూ ఆమె ఆ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు.
ఆరు దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన జానకమ్మ, 2017 అక్టోబర్ 28న మైసూరులో జరిగిన ఒక బహిరంగ కచేరీతో తన సుదీర్ఘ గాన ప్రస్థానానికి అధికారికంగా వీడ్కోలు పలికారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన అమర గీతాల రూపంలో జానకమ్మ స్వరం విశ్వమంతా ఎప్పటికీ మ్రోగుతూనే ఉంటుంది.