న్యూఢిల్లీ: భారతదేశం పోషకాహార లోపంలో ఏ స్థాయిలో ఉన్నదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 కండ్ల ముందుంచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వమే దేశంలో ఇంకా 31.8 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారని అధికారికంగా తెలిపింది. శుకవ్రారం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో 6.79 లక్షల కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించారు.
సర్వే ప్రకారం ఐదేళ్లలోపు ఉన్న 29.3 శాతం మంది పిల్లలు ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఉంటున్నారు. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురు ఎత్తు సమస్యతో, 5.2 శాతం మంది శారీరక బలహీనతతో బాధపడుతున్నారు. అలాగే నవజాత శిశువులకు సగం మంది తల్లులు మాత్రమే పుట్టిన గంట లోపు పాలు పడుతున్నారు. పైగా 40.5 శాతం మంది పిల్లలకు తల్లిపాలతో అందాల్సిన సమతుల్య ఆహారం అందట్లేదు. వీటి కారణంగా పిల్లలు బలహీనంగా, ఎత్తు, బరువు తక్కువగా ఉంటున్నారు. పుట్టిన పిల్లల్లో ఇంకా 13 శాతం మందికి సరైన టీకాలే అందట్లేదు. మీజిల్స్ రెండో డోస్ టీకా కేవలం 71.8 మందికే అందుతున్నది.
ఈ సర్వేలో ప్రతి పది మందిలో నలుగురు అధిక బరువుతో బాధ పడుతున్నారు. సుమారు 40 శాతం పెద్ద వయసు పురుషులు, మహిళలు అధిక బరువు, ఊబకాయంతో ఉన్నారు. 18 శాతం మంది మహిళలు, 20 శాతం మంది పురుషులు ప్రస్తుతం షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కుటుంబాలకు అందే బీమా కవరేజీ మాత్రం 41% నుంచి 60.2% కి పెరిగింది. 90 శాతం ప్రసవాలు దవాఖానల్లో జరుగుతుంటే ఇంకా 10 శాతం బయటి ప్రాంతాల్లోనే జరగడం గమనార్హం.
దేశంలో డిజిటల్ వినియోగం వైపు మహిళల అడుగులు వేగంగా పడుతున్నాయి. 64 శాతం మంది మహిళలు మన దేశంలో ఇంటర్నెట్ను వాడుతున్నారు. 2019-21 మధ్య వీరి వీరి సంఖ్య 33.3 శాతం ఉండగా, 2023-24 నాటికి 64.3 శాతం పెరిగిందని ఎన్ఎఫ్హెచ్ఎస్-6 శుక్రవారం నివేదిక తెలిపింది. అలాగే మహిళల బ్యాంక్ సేవింగ్ ఖాతాల వినియోగం 2019-21 మధ్య 78.6 శాతం ఉండగా, 2023-24 నాటికి 89 శాతానికి పెరిగింది. అలాగే మహిళల వ్యక్తిగత మొబైల్ ఫోన్లు 2019-21కు 53.9 శాతం ఉండగా, 2023-24కు 63.6 శాతానికి చేరుకున్నది. నెలసరి సమయంలో పరిశుభ్రతా విధానాలు పాటించడం 15-24 ఏండ్ల మధ్య మహిళల్లో ఇదే కాలానికి 77.6 శాతం నుంచి 79.2 శాతానికి పెరిగింది.