Thaman |ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ స్టార్డమ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. దీంతో ఈ చిత్రం పరాజయంగా మిగిలిపోయింది. అయితే సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాత్రం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా దర్శకుడు మారుతి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం, ఆయనను ప్రభాస్ స్వయంగా ఓదార్చడం, ఆ తర్వాత నిర్మాత ఎస్కేఎన్ కూడా కంటతడి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆ సమయంలో స్టేజ్‌పై అందరూ భావోద్వేగానికి గురవుతుంటే, వెనుక నుంచి చూస్తున్న సంగీత దర్శకుడు థమన్ మాత్రం నవ్వుకున్నారట. తాజాగా ఓ ఇంటరాక్షన్‌లో థమన్ ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మారుతి తన ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మారుతిని అలా చూసిన ప్రభాస్ వెంటనే స్టేజ్‌పైకి వెళ్లి ఆయనను ఓదార్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎస్కేఎన్ కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సన్నివేశం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. అయితే ఆ సమయంలో తన పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని థమన్ తెలిపారు. మారుతి, ఎస్కేఎన్ ఇద్దరూ ఏడుస్తుంటే తనకు నవ్వొచ్చిందని చెప్పారు.
స్టూడియోలో ఉన్నప్పుడు అందరూ మామూలుగానే ఉన్నారని, ఈవెంట్‌కి వచ్చేసరికి ఒక్కసారిగా ఏడుస్తుండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదని థమన్ సరదాగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మారుతి సాధారణంగా చాలా సరదాగా ఉంటారని, ఆయనను ఎప్పుడూ ఏడుస్తూ చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ తనకు మైక్ ఇచ్చేందుకు ప్రయత్నించారని థమన్ గుర్తు చేసుకున్నారు. కానీ అప్పటికే మారుతి, ఎస్కేఎన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో తాను ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు.తనకు ఏడుపు రావడం లేదని, తాను మాట్లాడినా పరిస్థితికి తగ్గట్టుగా ఉండదని భావించానని చెప్పారు. ఒకవేళ తాను ఏడవకుండా ఉంటే ప్రభాస్ అభిమానులు తనను ప్రభాస్ అభిమానిగా భావించకపోవచ్చని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే తనకు మైక్ ఇవ్వొద్దని చెప్పి పక్కకు వెళ్లిపోయానని తెలిపారు. అంతేకాదు, తాను సూట్ వేసుకుని ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నానని థమన్ నవ్వుతూ చెప్పారు. సాధారణంగా సూట్ తనకు అంతగా సూట్ కాదంటూ కూడా సరదాగా వ్యాఖ్యానించారు.