తెలంగాణ క్రీడా తారలు తుళుకులీనుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మనోళ్లు పతకాల పంట పండిస్తున్నారు. తాము ఎంచుకున్న క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ సత్తాచాటుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతున్నారు. అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ తమకు తిరుగులేదని ఘనంగా చాటిచెబుతున్నారు. పేదరికం తమ ప్రతిభకు అడ్డుకాదని కొందరు నిరూపిస్తే..మధ్య తరగతి నుంచి అత్యుత్తమ స్థాయికి ఎదిగిన వారు మరికొందరు. అంతర్జాతీయ టోర్నీల్లో దేశ ఖ్యాతిని, ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న కొందరు మన ప్లేయర్ల ప్రదర్శనపై ప్రత్యేక కథనం.
తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తాము ఇష్టపడి ఎంచుకున్న క్రీడలో కష్టపడుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇందులో కొందరు పేదరికం నుంచి వచ్చిన వారైతే..మరికొందరు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యుత్తమ స్థాయికి ఎదిగారు. వీరిలో గొంగడి త్రిష, ఇషాసింగ్, ఆకుల శ్రీజ, అగసర నందిని, సామియా ఇమాద్ ఫారుఖీ, నిఖత్ జరీన్, సిక్కిరెడ్డి, మహమ్మద్ సిరాజ్, విహారి, ఠాకూర్ తిలక్‌వర్మ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఇరిగేసి అర్జున్, భరత్‌కోటి, రాజా రిత్విక్, హుసాముద్దీన్ లాంటి ఉన్నారు. వీరికి తోడు సీఎం కేసీఆర్ మదిలో ఉంచి పుట్టిన గురుకుల విద్యాసంస్థల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో తమదైన నైపుణ్యంతో అదరగొడుతున్నారు. బరిలోకి దిగిన టోర్నీలో ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ పతకాలు సాధిస్తున్నారు.
అమ్మాయిల హవా:
అబ్బాయిలతో తాము ఎందులో తీసిపోమని అమ్మాయిలు నిరూపిస్తున్నారు. ఊహ తెలియని వయసులోనే బ్యాటు చేతబట్టిన గొంగడి త్రిష జాతీయస్థాయి క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్నది. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన త్రిష వెనుదిరిగి చూసుకోలేదు. ఇటీవల జైపూర్‌లో జరిగిన అండర్-19 వన్డే చాలెంజర్ టోర్నీలో 260 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువడంతో పాటు మెరుగైన ఎకానమీతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసింది. షూటింగ్లో ఇషాసింగ్ కొత్త ఒరవడి నెలకొల్పుతున్నది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఈ యంగ్‌స్టర్ గన్ గురిపెట్టిందంటే కచ్చితంగా పతకం దక్కాల్సిందే. అంతలా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నది.
కరోనా వైరస్ కారణంగా పలు టోర్నీలు రద్దు, వాయిదా పడినా..వెరువని ఆత్మవిశ్వాసంతో ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకుని గంటల పాటు ప్రాక్టీస్ చేసింది. దీనికి పెరూ వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలను ఒడిసిపట్టుకుంది. ఇక తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న ఇందూరు యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఇటీవల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మెరుపులు మెరిపించింది. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ అంచలంచెలుగా ఎదుగుతున్నది. ఇక గాయాల నుంచి తేరుకుని గాడిలో పడ్డ బుద్దా అరుణారెడ్డి ఈజిప్టు టోర్నీలో రెండు స్వర్ణ పతకాలను దక్కించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న అరుణ.. రానున్న కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ప్రపంచ కప్‌లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది. వీరికి తోడు సామియా, గాయత్రి(బ్యాడ్మింటన్), నందిని, మహేశ్వరి(అథ్లెటిక్స్), దీక్షిత, పావని(వెయిట్‌లిఫ్టింగ్) పతకాలతో మెరిసిన వాళ్లే.
యంగ్ గన్స్:
రాష్ట్రం నుంచి మహమ్మద్ సిరాజ్, హనుమ విహారి, ఠాకూర్ తిలక్‌వర్మ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌తో పాటు యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్, సాయి ప్రణీత్, వరుణ్ శంకర్ నిలకడగా రాణిస్తున్నారు. ముఖ్యంగా టీమ్ఇండియా తరఫున హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ కీలకంగా మారాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు విజయ్ హజారే వన్డే టోర్నీలో తిలక్‌వర్మ తనదైన రీతిలో రాణించాడు. సీవీ మిలింద్ నిలకడగా రాణిస్తుండగా..టేబుల్ టెన్నిస్‌లో స్నేహిత్‌తో పాటు వరుణ్ శంకర్ భవిష్యత్ ఆశాకిరణల్లా కనిపిస్తున్నారు. చెస్‌లో రిత్విక్, అర్జున్, భరత్‌కోటి..ఆనంద్ వారసులుగా ఎదుగుతున్నారు.