హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరకట్న రాక్షసత్వం ఆగ డం లేదు. కట్నం కోసం పిశాచాల్లా ఆడబిడ్డలను పీక్కుతింటున్నారు. వరకట్న మరణాలపై అవగాహన కల్పించాల్సిన ప్రభు త్వం మిన్నకుండిపోవడంతో ఆడబిడ్డల ఆర్తనాదాలు నాలుగుగోడలు దాటి బయటికి రావడం లేదు. తాజాగా వెల్లడైన 2024 ఎన్సీఆర్బీ క్రైమ్ నివేదిక రాష్ట్రంలో వరకట్న వేధింపులు, మరణాల భయానక రూపాని కి అద్దం పడుతున్నది. భర్త, అత్తమామల వేధింపుల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతున్నది. అదనపు కట్నం తేవాలంటూ భర్త, అతని తర ఫు బంధువులు మహిళలను శారీరకంగా, మానసికంగా ఎంతలా వేధిస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 2024లో మొత్తం 10,061 కేసులు నమోదయ్యాయి. ఈ విభాగంలో మహిళలపై జరిగే నేరాల రేటులో రాష్ట్రం 52.8 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ సగటు రేటు 17.3% ఉంటే, తెలంగాణలో అది మూడు రెట్లకు పైగా ఉండటం సమస్య తీవ్రతను సూచిస్తున్నది.
కేవలం కట్నం కోసమే భార్య ఉసురు తీస్తున్నారంటే ఈ పిశాచం ఎంతలా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. వేధింపులు భరించలేక, పుట్టింటి నుంచి అడిగినంత తెచ్చివ్వలేక ఎంతోమంది వివాహితలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024లో మొత్తం 144 మంది మహిళలు వరకట్న దాహానికి బలయ్యారు. రాష్ట్రంలో వరకట్న మరణాల రేటు 0.8గా నమోదైంది. ఇది దేశవ్యాప్త సగటు రేటు 0.8తో సమానంగా ఉన్నది.
కేసుల నమోదులో ఆయా రాష్ర్టాల జనాభాను బట్టి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముందు ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. మరణాల్లో ఆయా రాష్ర్టాల జనాభానుబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, హర్యానా తర్వాత తెలంగాణ ఉన్నది. కేసు ల సంఖ్యపరంగా తెలంగాణ 6, 9 స్థానాల్లో ఉన్నప్పటికీ.. జనాభా నిష్పత్తి/నేరాల రేటు ప్రకారం చూస్తే మాత్రం భర్త, అత్తమామల వేధింపుల్లో (52.8%) దేశంలోనే మొదటి స్థానంలో నిలువడం గమనార్హం. ఈ కట్న రకసిని అంతమొందించడానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు, సమాజంలో, ముఖ్యంగా పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది.